02/3/19 11:52 AM

వీడిన మర్డర్ మిస్టరీ : చిగురుపాటి జయరాం హంతకుడు ఇతడే

Chigurupati Jayaram Murder Mystery Ends

ప్రముఖ వ్యాపారవేత్త, ఎక్స్‌ప్రెస్ టీవీ ఛైర్మన్, కోస్టల్ బ్యాంక్ అధినేత చిగురుపాటి జయరాం చౌదరి మర్డర్ మిస్టరీ వీడింది. హంతకుడు ఎవరో తెలిసిపోయింది. మర్డర్‌కు కారణం కూడా తెలిసింది. రాకేష్‌రెడ్డి అనే వ్యక్తిని పోలీసులు హంతకుడిగా నిర్దారించారు. కిరాయి హంతకులతో జయరాంను హత్య చేయించినట్లు గుర్తించారు. రాకేష్‌రెడ్డి వద్ద తీసుకున్న రూ.4.5కోట్ల అప్పే హత్యకు కారణంగా పోలీసులు తేల్చారు. ఆర్థిక లావాదేవీలే జయరాంను పొట్టనపెట్టుకున్నాయి.

 

రాకేష్ దగ్గర జయరాం మేనకోడలు శిఖా చౌదరి రూ.4 కోట్లు అప్పు తీసుకుంది. ఈ అప్పు డబ్బుకు జయరాం మధ్యవర్తిగా ఉన్నారు. అప్పు తాను చెల్లిస్తానని జయరాం మాటిచ్చారు. ఈ డబ్బు విషయంలో కొన్నాళ్లుగా వివాదం నడుస్తోంది. ఆ వివాదమే మర్డర్‌కు కారణమై ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.

 

జనవరి 31వ తేదీ రాత్రి కృష్ణా జిల్లా నందిగామ మండలం ఐతవరం వద్ద రోడ్డు పక్కన ఆగి ఉన్న కారులో జయరాం డెడ్ బాడీని పోలీసులు గుర్తించారు. ఆయన తలపై గాయాలు ఉన్నాయి. శరీరం నీలం రంగులోకి మారిపోయి ఉంది.  దీంతో ఆయనపై విషప్రయోగం జరిగినట్టు పోలీసులు తేల్చారు.
కుక్కలను చంపేందుకు వాడే ఇంజెక్షన్‌ను జయరాంకు హైదరాబాద్‌లో ఇచ్చారని, దీంతో అతడి శరీరం 10 నిమిషాల్లో విషపూరితం అయిందని గుర్తించారు. హైదరాబాద్‌లో మర్డర్ చేసి డెడ్ బాడీని కృష్ణా జిల్లాలో వదిలేసిపోయారని పోలీసులు గుర్తించారు. జయరాంను హైదరాబాద్‌లోనే హత్య చేసి, రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించారని కనుగొన్నారు. 31న విజయవాడకు వెళ్తున్నాని జయరాం ముందే చెప్పటంతో అదే రూట్‌లో రోడ్డు ప్రమాదం జరిగినట్లు హంతకులు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఐతవరం సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగినట్లు కలరింగ్ ఇవ్వబోయారు. అయితే పోలీసుల విచారణ నిజాలు బయటపడ్డాయి

 

హైదరాబాద్‌లో ఐదుగురిని కృష్ణా జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జయరాంను హైదరాబాద్‌లోనే చంపేసి మృతదేహాన్ని కృష్ణా జిల్లా నందిగామ మండలం ఐతవరం హైవే పక్కన కారులో వదిలేసినట్టు తేల్చారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు నాలుగు బృందాలుగా విడిపోయి, రెండు రోజులుగా దర్యాప్తు చేపట్టారు. సెల్‌సిగ్నల్స్ ఆధారంగా కేసు మిస్టరీని చేధించారు. జయరాంను హైదరాబాద్‌లోనే హత్య చేసి, ఆపై మృతదేహాన్ని కృష్ణాజిల్లా కంచికచర్లకు తీసుకొచ్చారు. జయరాం తలకు బలమైన గాయమైనట్లు చిత్రీకరించేందుకు బీర్‌ బాటిల్‌తో తలపగులగొట్టి, కారులోని వెనుక సీట్లో మృతదేహాన్ని ఉంచి కారును పక్కకు నెట్టేసినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు.

 

మాదాపూర్‌లోని ఓ ఫైవ్ స్టార్ హోటల్ నుంచి రాకేష్ బయలుదేరినట్లుగా తెలుస్తోంది. ఈ హత్యలో జయరామ్ మేనకోడలు శిఖా చౌదరి పాత్ర ఉందా లేదా అన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. రాకేష్‌రెడ్డి.. శిఖా చౌదరికి బాయ్‌ఫ్రెండ్. కాగా, డబ్బు తీసుకుంది శిఖా చౌదరి.. అప్పు తీర్చాల్సింది కూడా ఆమె. అలాంటప్పుడు శిఖా చౌదరిని వదిలిపెట్టి జయరాంను రాకేశ్ ఎందుకు చంపాడన్నది అంతుచిక్కని ప్రశ్న. నందిగామ పోలీస్ స్టేషన్‌లో ఉన్న శిఖా చౌదరిని కబాలి చిత్ర నిర్మాత కెపి చౌదరి కలవడం హాట్ టాపిక్‌గా మారింది. శిఖాను ఈ కేసు నుంచి తప్పించడానికి తీవ్రంగా ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ ప్రచారం జరుగుతోంది. చిగురుపాటి జయరాంకు సంబంధించిన ఆర్ధిక లావాదేవీలన్నీ శిఖా చౌదరి కనుసన్నల్లోనే ఉండటం ఇంకా ఆమె పోలీసుల అదుపులోనే ఉంచడం పలు అనుమానాలకు తావిస్తోంది.

 

జయరాం భార్య, పిల్లలు అమెరికా నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. విషయం తెలిసి వారు కన్నీరుమున్నీరు అవుతున్నారు. మహాప్రస్థానంలో జయరాం అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు.

Tags : chigurupati jayaram murderchigurupati jayaram murder mystery endscoastal bankexpress tv chairmanmoney problemsrakesh reddyshika chowdary

Also read

Use Facebook to Comment on this PostMenu