05/15/18 4:49 PM

బీజేపీ దెబ్బకొట్టేందుకు కాంగ్రెస్ భారీ వ్యూహం..!

Untitled-1 copy

దేశం మొత్తంగా ఆసక్తిగా ఎదురుచూసిన కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు  తీవ్ర ఉత్కంఠ రేపుతున్నాయి. ఫలితాల సరళితో కర్నాటక రాజకీయం రసకందాయంలో పడింది. కన్నడ ఓటర్లు ఏ రాజకీయ పార్టీకీ స్పష్టమైన మెజార్టీ ఇవ్వకపోవడంతో ఎన్నికల ఫలితాలు హంగ్‌ దిశగా పయనిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కన్నడ రాజకీయాలు ఉత్కంఠభరితంగా మారాయి. రాజకీయాలు క్షణ క్షణానికి ఊహించని మలుపులు తిరుగుతున్నాయి.

 

ఇప్పటివరకూ విడుదలైన ఫలితాల ప్రకారం బీజేపీ అతి పెద్ద పార్టీగా అవతరించింది. కాంగ్రెస్‌ రెండో స్థానంలో ఉంది. ఏ పార్టీకీ స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో ప్రభుత్వ ఏర్పాటులో జేడీఎస్‌ పాత్ర అత్యంత కీలకంగా మారనుంది. సాధారణ మెజార్టీకి కొన్ని స్థానాల దూరంలోనే బీజేపీ నిలిచిపోయిన నేపథ్యంలో ప్రభుత్వాన్ని ఎవరు ఏర్పాటు చేస్తారు? అనే ఉత్కంఠ నెలకొంది.

 

తొలుత క్లియర్ మెజారిటీ దిశగా వెళ్లిన బీజేపీ ఆధిక్యత ఆ తర్వాత తగ్గింది. ప్రస్తుతం ఆ పార్టీ మ్యాజిక్ ఫిగర్ కంటే దాదాపు 8 సీట్లు వెనుకబడి ఉంది. ఈ నేపథ్యంలో, రాజకీయ పరిణామాలు చాలా వేగంగా మారుతున్నాయి.

 

ఎలాగైనా సరే బీజేపీకి ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఇవ్వకూడదని కాంగ్రెస్ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ తన మార్క్ రాజకీయం ప్రారంభించింది. ప్రభుత్వ ఏర్పాటులో కింగ్ మేకర్ గా మారిన జేడీఎస్‌ కు కాంగ్రెస్‌ మద్దతు ప్రకటించింది. అంతేకాదు కుమారస్వామికి ముఖ్యమంత్రి పదవిని ఆఫర్‌ చేశారు. జేడీఎస్ నుంచి ఎవరు సీఎం అయినా తాము సంపూర్ణ మద్దతిస్తామని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత గులాం నబీ ఆజాద్‌ వెల్లడించారు. ఇరు పార్టీల నేతలు గవర్నర్‌ ను కలుస్తారని ఆయన స్పష్టంచేశారు. జేడీఎస్‌ నేతలు దేవెగౌడ, కుమారస్వామితో ఫోన్‌ లో చర్చలు జరిపామని, వారిద్దరూ తమ ప్రతిపాదనను అంగీకరించారని ఆజాద్‌ అన్నారు. ఇదే జరిగితే కర్నాటకలో జేడీఎస్, కాంగ్రెస్ ల సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఏది ఏమైనా గవర్నర్ కీలకంగా మారింది.

 

అయితే.. కర్నాటక గవర్నర్ కాంగ్రెస్ కు షాక్ ఇచ్చారు. వారికి అపాయింట్ మెంట్ ఇవ్వలేదు. ఇప్పుడు కలవడం కుదరదని చెప్పినట్టు సమాచారం. ఎన్నికల ఫలితాలు పూర్తిగా వెలువడిన తర్వాత, ఎన్నికల కమిషన్ ఇచ్చే సమాచారం ఆధారంగానే తాను నిర్ణయం తీసుకుంటానని గవర్నర్ చెప్పినట్టు తెలుస్తోంది. గవర్నర్ అనుమతి ఇవ్వకపోవడంతో కాంగ్రెస్ నేతలు నిరాశతో వెనుదిరిగారు.

Tags : BJPCONGRESScongress offers jds cm postdevegowdajdsKarnataka election resultsKumaraswamy

Also read

Use Facebook to Comment on this Post



Menu