06/5/17 1:27 PM

ఇంటర్వ్యూ ముందు రోజు గోపాలకృష్ణ కుటుంబానికి ఎంత అన్యాయం జరిగిందంటే..?

gopalakrishna ias

25 ఏళ్ల నాటి వేద‌న ప‌టాపంచ‌ల్ ..తునాతున‌క‌ల్

11 ఏళ్ల కృషి వెనుదిర‌గ‌క పోరాడిన నైజం కాలానికి చేసిందొక స‌వాల్

అంతేనా!!

వీధి బ‌డి ఇప్పుడు త‌లెత్తుకు ఠీవిగా నిల్చొంది

త‌న విజ‌యం ఇద‌ని స‌గ‌ర్వంగా చెబుతోంది..

 

ఓ నిమ్న‌కులం ఇంట భోజనం చేసినందుకు వెలివేసిన ఊరు

ఈ వేళ స్వాగ‌త‌స‌త్కారాలు చేస్తోంది

ఆయ‌న‌కు చెందిన సామాజిక వ‌ర్గం తెగ స‌న్మానాలు చేస్తోంది

మ‌రి! నిన్న‌టి వేళ వీరంతా ఏమైపోయారో… చెప్మా!!

 

సివిల్స్ టాప‌ర్ రోణంకి గోపాల కృష్ణ కు సంబంధించి మ‌రిన్ని ఆస‌క్తిదాయ‌క సంగ‌తులు కొర‌డా డాట్ కామ్ మీకు అందిస్తోంది. ఆ..వివ‌రాలివిగో….

చైతన్య అకాడమీ సిగ్గులేనితనం 

వాడెవ‌డో శ్రీ చైత‌న్య అకాడ‌మీ సివిల్స్ టాప‌ర్ గోపాల‌కృష్ణ మావాడేనంటూ యాడ్స్ వేసేశాడు. త‌ప్పుక‌దూ! ఈ విజ‌యానికి ఆ.. అకాడ‌మీకి అస్స‌ల‌స్స‌లు సంబంధ‌మే లేదు. కేవ‌లం అక్క‌డ నిర్వ‌హించిన మాక్ ఇంట‌ర్వ్యూల‌కు హాజ‌రైన పాపానికి ఏకాఎకిన గోపాలుడ్ని తీర్చిదిద్దింది మేమే అంటే ఎట్టా?? అన్యాయం క‌దూ!! త‌ప్పు క‌దూ!! మ‌రీ!! ఇంత ఇంగితం లేకుండా ఎలా?? సిగ్గు లేకపోతే ఎలా?  త‌న విజ‌యానికి ప్ర‌ధాన కార‌ణం హైద్రాబాద్ కి చెందిన బాల‌ల‌త గారేన‌ని, జ‌న‌ర‌ల్ స్ట‌డీస్‌కి సంబంధించి ఆమె అందించిన శిక్ష‌ణ త‌న‌కెంతో ఉప‌యోగ ప‌డింద‌ని, ఈనాడు, సాక్షి, ఆంధ్ర‌జ్యోతి ప‌త్రిక‌ల‌ను క్ర‌మం త‌ప్ప‌క చ‌దివేవాడిన‌ని గోపాలకృష్ణ చెప్పారు. ఏళ్ల‌కు ఏళ్లు ప‌త్రికా ప‌ఠ‌నం చేసి ప్రిపేర్ చేసుకున్న నోట్స్ ఇవాళ త‌న విజ‌యానికో ప్ర‌ధాన కార‌ణ‌మ‌ని వివ‌రించారు.  అంతేతప్ప చైతన్య కార్పోరేట్ కోచింగ్ కారణం అని ఎక్కడా చెప్పలేదు.

ఇక ఇంటర్వ్యూ ముందు రోజు ఏం జరిగింది అంటే..?

 

ఆ రోజు అత‌డు ఇంట‌ర్వ్యూకి పోవాలి. ఫైన‌ల్‌స్టేజ్‌. ఏదిఏమైనా త‌రువాత అత‌డు విజేత‌గానే నిల‌వాల‌నుకున్నాడు. ఇంత‌లో ఇంటి నుంచి ఫోన్‌.. మ‌న పొలంలో గ‌డ్డి కుప్ప‌లు త‌గుల‌బెట్టార‌ని..! వ‌ణుకుతున్న ఆ..గొంతు నాన్న‌ది.. మ‌రొక గొంతు అమ్మ‌ది. ఈ రాత్రి గ‌డిస్తే చాలు మీకు ఇక ఏ ఇబ్బందీ ఉండ‌ద‌ని భ‌రోసా ఇచ్చాడు గోపాల‌కృష్ణ‌. అలానే .. ఆ వేద‌న‌తోనే ఇంట‌ర్వ్యూ కి పోయి బోర్డ్‌ని మెప్పించి స‌ఫ‌లీకృతుడ‌య్యాడు. సంక‌ల్ప సిద్ధికి ఏదీ అవ‌రోధం కాద‌ని .. కాగ‌ల కార్యాల‌ను గంధ‌ర్వులో య‌క్షులో కిన్నెర కింపురాషాదులో తీర్చ‌ర‌ని నిరూపించాడు.అంతేనా! తెలుగు భాష ఔన్న‌త్యాన్ని పెంచాడు.

ఇంకా ..ఇంట‌ర్వ్యూలో అత‌డిది మూడో ర్యాంక్‌.. తెలుగు మాధ్య‌మంలో సివిల్స్ రాసి మార్కులు సాధించిన వారిలో అత‌డే ప్ర‌థ‌ముడు. ఇంకా.. తెలుగు మాధ్య‌మంలోనే సివిల్స్  రాయాలి అనుకునేవారికి , సాధ‌న చేస్తున్న‌వారికి ఆరాధ్యుడు. ప్రేర‌కుడు. వెళ్లండి హార‌తులు ప‌ట్టండి .. ప‌లాస పుర‌జ‌నులారా! దండ‌లు వేయండి! కుల సంఘాల్లారా వీడు మావాడే అని డ‌ప్పు కొట్టండి త‌ప్పేమీ కాదు. మ‌రి! నిన్న‌టిదాకా మీరెక్క‌డ‌??

నాలుగంటే నాలుగు అంశాలు త‌న ముందు ఉన్నాయ‌ని .. వీటి సాధ‌న‌కే ఓ సివిల్ స‌ర్వెంట్ గా కృషి చేస్తాన‌ని చెప్పాడు.అవేంటంటే.. 53 సెంట్ల భూమిని సాగు చేసిన‌ప్పుడు ఆదాయం చాల‌క నాలుగు ఎక‌రాల‌ను కౌలుకు తీసుకుని వ్య‌వ‌సాయం చేసినా త‌మ‌కు అప్పులు బెడ‌ద‌లు ఉండేవ‌ని అందుకే కౌలు రైతుల సంక్షేమం కోసం ఏదైనా చేయాల‌ని ఉంద‌ని చెప్పాడు. ఇదే త‌న మొద‌టి ప్రాధాన్యం అని..ఇక ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల బ‌లోపేతా నికి, మ‌హిళా సాధికారిక‌త‌కు, గ్రామీణ వాడ‌ల్లో నిర్ల‌క్ష్యానికి నిలువెత్తు నిద‌ర్శ‌నంగా ఉన్న వైద్య రంగాన్ని గాడిలోపెట్టేందుకు త‌న‌వంతు కృషి చేస్తాన‌న్నాడు. గోపాల కృష్ణుడా ఆల్ ద బెస్ట్‌.

అచ్చం సినిమా లాగానే..

నిన్న మొన్నటిదాకా గోపాలకృష్ణ ఇంటికి వెళ్ళడానికి సరైన రోడ్డు ఉండేది కాదు, ఇప్పుడు రాత్రికి రాత్రే రోడ్డు వేసారు.

గోపాలకృష్ణ కుటుంబానికి అన్యాయం జరిగితే పట్టించుకోని కులపెద్దలు ఇప్పుడు గోపాలుడు మావాడే అని సన్మానాలు చేస్తున్నారు.

గోపాలకృష్ణ  వాళ్ళ నాన్న తన తల్లి  డెత్ సర్టిఫికేట్ కోసం మున్సిపాలిటీ చుట్టూ తిరుగుతున్నారు. ఇప్పుడా అధికారులె స్వయంగా ఇంటికొచ్చి మరీ సర్టిఫికేట్ ఇచ్చారు.

గోపాలకృష్ణ చదువుకున్న ప్రభుత్వ పాఠశాలకి సరైన బోర్డు కూడా లేదు, ఇప్పుడేమో రంగులు వేస్తున్నారు.

ఇదీ ఒక్క విజయం మన సమాజంలో తెచ్చే మార్పు.

 

– ర‌త్న‌కిశోర్ శంభుమ‌హంతి 

Tags : andhra pradeshCivils TopperIAS Topper Gopala KrishnaSrikakulam District

Also read

Use Facebook to Comment on this PostMenu