06/17/19 12:54 PM

తిరుగులేని భారత్ : వరల్డ్ కప్‌లో పాకిస్తాన్‌పై ఘనవిజయం

ICC World Cup, India Beats Pakistan

హిస్టరీ రిపీట్ అయ్యింది. భారత్ జైత్రయాత్ర కంటిన్యూ అయ్యింది. భారత్ చేతిలో పాకిస్తాన్ చిత్తుచిత్తుగా ఓడింది. క్రికెట్ వరల్డ్ కప్ లో భారత్ దెబ్బకి పాకిస్తాన్ విలవిలలాడింది. ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌పై ఓటమెరుగని భారత జట్టు మరోమారు సత్తా చాటింది. గత రికార్డును పదిలపరుచుకుంది. ఆదివారం మాంచెస్టర్ వేదికగా జరిగిన హైవోల్టేజ్ పోరులో పాక్‌కు మరోమారు భంగపాటు ఎదురైంది. ఈ మ్యాచ్‌లో గెలిచి భారత రికార్డుకు అడ్డుకట్ట వేయాలని భావించిన సర్ఫరాజ్ సేనకు మళ్లీ నిరాశ ఎదురైంది. కోహ్లి సేన చేతిలో దారుణంగా ఓడింది.

 

పాక్ తో జరిగిన మ్యాచ్ లో భారత్ జట్టు 89పరుగుల తేడాతో విజయం సాధించి ఐసీపీ ప్రపంచ కప్ లో భారత్ కు ఉన్న అజేయ రికార్డును మరింత పదిలం చేసింది. మాంచెస్టర్ లో పాక్ తో జరిగిన మ్యాచ్ లో రోహిత్ శర్మ(140) సెంచరీతో చెలరేగగా.. కెప్టెన్ కోహ్లీ (77) అర్ధ సెంచరీతో రాణించాడు. భారత్ బ్యాట్స్ మెన్లు సమిష్టిగా రాణించి 50 ఓవర్లలో 337 పరుగుల లక్ష్యాన్ని పాక్ ముందు నిర్దేశించారు. బ్యాటింగ్ ప్రారంభించిన పాక్ 36 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 166 పరుగులు సాధించింది. ఈ దశలో మ్యాచ్ ను వరుణుడు అడ్డుకోవడంతో డక్ వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం పాక్ విజయ లక్ష్యాన్ని 40 ఓవర్లలో302 పరుగులకు సవరించారు. పాక్ నిర్ణీత 40 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 212 పరుగులు సాధించి పరాజయం పాలైంది.
ఈ విజయంతో మరోసారి ఐసీపీ ప్రపంచ కప్ మ్యాచుల్లో పాక్ పై భారత్ కు తిరుగులేదని కోహ్లీ సేన నిరూపించింది. ప్రపంచకప్ లో భారత్, పాకిస్థాన్ జట్లు ఇప్పటి వరకు ఏడు సార్లు తలపడగా.. ఏడూ మ్యాచుల్లోనూ భారత్ నే విజయం వరించింది. 1992 లో ఆస్టేలియాలో జరిగిన ప్రపంచ కప్ టోర్నీలో అజారుద్దీన్ నేతృత్వంలోని భారత్ జట్టు.. పాక్ ను ఓడించింది. 94 ప్రపంచ కప్ మ్యాచ్ లోను పాక్ ని చిత్తూ చేసింది. 1999 ప్రపంచ కప్ లో సూపర్ సిక్స్ దశలో పాక్ ను ఓడించింది. గంగూలీ సారథ్యంలోని భారత్, 2003 వరల్డ్ కప్ లో పాక్ ను మట్టికరిపించింది. 2011 ప్రపంచ కప్ సెమీస్ లో ఓడించి ఫైనల్స్ లోకి ప్రవేశించింది. 2015 లీగ్ దశలో పాక్ ను ఓడించి అజేయ రికార్డును కొనసాగించిన భారత్ జట్టు తన విజయపరంపరను ఈసారి కూడా కంటిన్యూ చేసింది. దాయాది దేశంపై తిరుగులేని రికార్డు నమోదు చేసుకుంది.

 

పాక్ ఓటమి తర్వాత ఆ జట్టు సభ్యులని మరీ ముఖ్యంగా కెప్టెన్ సర్పరాజ్‌ అహ్మద్ ని పాక్ అభిమానులు టార్గెట్ చేశారు. సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఓటమిని జీర్ణించుకోలేని పాక్ అభిమానులు, సర్పరాజ్‌ ను ఏకేశారు. అతని ఆటతీరు పేలవమని ఎగతాళి చేశారు. “గుడ్ నైట్ బాయ్స్… అద్భుతమైన టీ కప్పుతో నన్ను నిద్ర లేపండి” అని ఒకరు చురకలు అంటించగా, అసలు సర్ఫరాజ్ బ్యాట్ ఎందుకు పట్టుకున్నాడని ఇంకొకరు ప్రశ్నించారు. పలువురు కన్నీరు పెట్టారు. ఈ మ్యాచ్ చూడటం కష్టమని, విజయం సులువుకాదని తెలిసినా వచ్చామని, పాక్ ఆటతీరు ఎంతో బాధను కలిగించిందని వాపోయారు.

 

ప్రస్తుతం ఇండియా చాలా గొప్ప జట్టని, అటువంటి జట్టును ఇలాంటి ఆటతీరుతో గెలవడం కష్టమని అన్నారు. కనీసం పోరాడకుండా కీలకమైన ఆటగాళ్లు పెవిలియన్ కు రావడాన్ని తట్టుకోలేకున్నామని వాపోయారు. కోహ్లీ ఒక్కడే 41 సెంచరీలు చేస్తే, తమ ఆటగాళ్లంతా కలిసి 41 సెంచరీలు చేశారని, ఇరు జట్ల బలాబలాలను బేరీజు వేసేందుకు ఇదొక్క ఉదాహరణే చాలని కొందరు సర్దిచెప్పుకున్నారు.

Tags : beatdefeatIccIndiapakistansarfaraz ahmammedteam indiavirat kohliWorld Cup

Also read

Use Facebook to Comment on this PostMenu