08/7/19 7:52 PM

ఇక సెలవు : చిన్నమ్మ శాశ్వతంగా వెళ్లిపోయారు

Sushma Swaraj Passes Away

చిన్నమ్మగా, భారతీయ ఉక్కు మహిళగా సుపరిచితురాలైన సుష్మాస్వరాజ్ (67) కన్నుమూశారు. ఇక సెలవు అంటూ శాశ్వత్వంగా వెళ్లిపోయారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సుష్మాస్వరాజ్ మంగళవారం(ఆగస్టు 6,2019) రాత్రి కన్నుమూశారు. గుండెపోటు రావడంతో ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆమె మరణంతో యావత్ దేశం కంటతడి పెట్టింది. చిన్నమ్మ ఇక లేరు అనే వార్తను భారతీయులు జీర్ణించుకోలేకపోయారు.

 

సుష్మాస్వరాజ్.. తెలంగాణ చిన్నమ్మగా సుపరిచితురాలు. కేంద్ర మంత్రి పదవి చేపట్టాక దేశానికే చిన్నమ్మ అయ్యారు. భౌతికంగా మన మధ్య లేకపోయినా, కోట్లాది మంది మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. ఆమె ఆహార్యం, మాట తీరు, సాయం చేసే మనస్తత్వం ఆమెను అందలమెక్కించాయి. తెలంగాణ ఏర్పాటులో ఆమె పాత్ర కీలకం. అప్పటి యూపీఏ ప్రభుత్వం పెట్టిన బిల్లుకు, బీజేపీ తరఫున ముందుండి మద్దతు ఇచ్చారు. సుష్మ గురించి చెప్పుకోవాలంటే మొదటగా ఆమె ఆహార్యాన్నే ప్రస్తావించాలి. నేరు పాపిడి, పెద్ద బొట్టు, ప్లెయిన్ చీర జాకెట్, పైన కోటు మోడల్ జాకెట్.. ఇలా తనకంటూ ప్రత్యేకతను సంతరించుకున్నారు. విదేశాలకు వెళ్లినపుడు, విదేశీ ప్రతినిధులతో మాట్లాడేటప్పుడు ఆమె శైలి ముచ్చటేస్తుంది.
ప్రశాంతత ఆమె మోములోనే కనిపిస్తుంది. మొత్తంగా చెప్పాలంటే అచ్చమైన భారతీయతకు నిలువెత్తు రూపం సుష్మ.

 

విదేశాల్లో కష్టాలు ఎదుర్కొంటున్నాం.. పాస్‌పోర్టు పోయింది.. స్వదేశానికి వచ్చేందుకు డబ్బుల్లేవ్.. అంటూ ట్విట్టర్‌లో మొర పెట్టుకోగానే క్షణాల్లో స్పందించే చిన్నమ్మ.. కేంద్ర విదేశాంగ మంత్రి హోదాలో స్వదేశీయులకే కాదు విదేశీయులకూ చేయూతనందించారు. శత్రుదేశం పాకిస్తాన్ ప్రజలకు కూడా ఆమె ఆపన్నహస్తం అందించారు.

 

సుష్మాస్వరాజ్ మరణవార్తను దేశ ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. తల్లి మీకు మీరే సాటి, సలామ్ ఉక్కు మహిళ అంటున్నారు. ABVP నుండి వచ్చి భారతీయ జనతా పార్టీ సీనియర్ నేతగా ఎదిగారు. విదేశాంగమంత్రిగా ఐక్యరాజ్య సమితిలో భారత గళాన్ని వినిపించారు. ప్రవాస భారతీయులు ఎంతోమంది ఇబ్బందుల్లో ఉన్నవారికి కేవలం ఒక్క మేసేజ్ తో ఆదుకున్న మానవత్వం ఉన్న మాతృమూర్తి. మహిళా లోకానికి ఆమె జీవితం ఆదర్శం. ఆడది అంటే అబల కాదు సబల అని నిరూపించిన ధీరవనిత. ఆమె దూరమవడం భరతమాతకు తీరని లోటు. బరువెక్కిన హృదయంతో ఇదే కన్నీటి వీడ్కోలు.

Tags : BJPdiespasses awaysushma swaraj

Also read

Use Facebook to Comment on this Post



Menu