06/14/18 6:27 PM

వర్మను నమ్ముకుని నాగార్జున ఎంత అడ్డంగా మునిగాడంటే..

officer

ఇక ముందు రాంగోపాల్ వర్మ సినిమా చేద్దామంటూ ఏ నిర్మాతనైనా.. హీరోనైనా అప్రోచ్ అయితే వారు వెనక్కి చూడకుండా ఆమడ దూరం కాదు.. కిలోమీటర్ల దూరం పరిగెత్తాల్సిందే. వాళ్లే కాదు.. వర్మ సినిమా అంటే ప్రస్తుతం సాధారణ ప్రేక్షకులతో పాటు ఒకప్పటి అతడి వీరాభిమానులు కూడా హడలెత్తిపోతున్నారు. ఆ మధ్యన ఓ టీ షాప్‌లో టీ త్రాగుతుండగా.. ఓ వ్యక్తి ( బహుశా నాగ్ ఫ్యాన్ అనుకుంటా) ఆఫీసర్ సినిమా గురించి మాట్లాడుతూ.. చెత్త సినిమా తీశాడంటూ వర్మ మీద తిట్ల దండకం అందుకోగా.. అతడి ప్రక్కనే ఉన్న మరో స్నేహితుడు.. ”అయినా.. మీవోడిదే తప్పురా.. అయినా ఆ మెంటలోడితో సినిమా చేయడానికి మీ ఓడికైనా జ్నానం(జ్జానం) ఉండాలి కదా.. బుద్ధి ఉన్నాడెవడూ ఆ తిక్కలోడితో ప్రస్తుతం సినిమా చేయడు.. మీ వోడికి బుద్ధి లేదు కాబట్టే ఆడితో సినిమా చేశాడు.. నువ్వు తిట్టాలనుకుంటే మీవోడిని తిట్టడం కరెక్ట్‌” అంటూ రివర్స్ లో క్లాస్ పీకడం విని నవ్వుకోవాల్సి వచ్చింది.

 

వరుస ఫ్లాపుల్లో ఉన్న రాంగోపాల్ వర్మ మీద అపార నమ్మకంతో అతడికి దర్శకుడిగా మరోసారి నాగార్జున అవకాశమిచ్చాడు. వాస్తవానికి, రాంగోపాల్ వర్మ సినిమాలకు మార్కెట్ ఎప్పుడో పడిపోయింది. కానీ, నాగార్జున హీరోగా చేస్తుండటంతో ఆయన మీద నమ్మకంతో ఈ సినిమా ను డిస్ట్రిబ్యూటర్లు కొనుగోలు చేశారు. అయితే, బాక్సాఫీస్ దగ్గర ఆఫీసర్ సినిమా డిజాస్టర్‌ అయ్యి వారికి భారీ నష్టాలను తీసుకొచ్చింది. ఈ సినిమాను ఆంధ్ర ప్రాంతానికి కొనుగోలుచేసిన ఆంధ్రా డిస్ట్రిబ్యూటర్ ‘ఆఫీసర్‌’ దెబ్బకు తనకు ఆత్మహత్యే శరణ్యమని కొన్నిరోజులు క్రితం ఆవేదన చెందిన సంగతి తెలిసిందే. ‘ఆఫీసర్’ ఎంతటి డిజాస్టర్ ఫ్లాప్ అంటే.. కనీసం ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో కోటి రూపాయలు షేర్‌ను కూడా రాబట్టలేకపోయింది. ఫైనల్ రన్‌ లో ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో.. కేవలం 97 లక్షల షేర్ ను మాత్రమే సాధించింది.. ఇది కాకుండా అమెరికాలో కేవలం 13 లక్షలు దేశంలోని మిగతా ప్రాంతాల్లో మరో 9 లక్షల కలెక్ట్ చేసింది.. ఈ లెక్కన ఈ చిత్రం వరల్డ్ వైడ్ షేర్‌ 1.19 కోట్లు. ఆఫీసర్ సినిమాను నిర్మించడానికి సుమారు 14 కోట్లు ఖర్చయ్యింది.. ఈ లెక్కన ఈ సినిమా ఎంతటి అట్టర్ ఫ్లాప్‌ అయ్యిందో మనం అర్థం చేసుకోవచ్చు.

 

నిజానికి ఈ విషయంలో రాంగోపాల్ వర్మను తప్పుపట్టడానికి ఏమీ లేదు. అతడికి అవకాశమిచ్చిన నాగార్జునదే తప్పు. రాంగోపాల్ వర్మ చాలా కాలంగా సరైన ఫ్రేమ్ ఆఫ్ మైండ్ లేడని నాగార్జునకు తెలుసు! గత కొంతకాలంగా దర్శకుడిగా ఏమాత్రం దృష్టి పెట్టకుండా, తనకు సంబంధం లేని ప్రతీ విషయంలో తలదూరుస్తూ.. అడ్డమైన చెత్త కామెంట్లు చేస్తూ..పబ్లిసిటీ కోసం నానా వెర్రి వేషాలు వేస్తున్న వర్మకు మైండ్ దొబ్బందని అటు సాధారణ ప్రేక్షకుల నుంచి ఇటు సెలబ్రిటీ సినీ ప్రముఖుల వరకు అందరూ తరచుగా అనుకుంటున్న మాటే. అయినప్పటికీ తనకు ‘క్రీస్తు పూర్వం’ అప్పుడెప్పుడో ‘శివ’ లాంటి ఇండస్ట్రీ హిట్ ఇచ్చాడన్న అభిమానంతో.. వర్మ ‘ఆఫీసర్’ కథను కాస్త బాగా నేరేట్ చేయగానే సంబరపడిపోయి.. అతడు ఈ సినిమా సరిగ్గా తీయగలడా లేదా అని ఆలోచించకుండా.. గత కొంతకాలంగా రాంగోపాల్ వర్మ ఆఫ్ స్క్రీన్‌.. ఆన్ స్ర్రీన్ ట్రాక్ రికార్డ్ ను గమనించకుండా ‘ఆఫీస’ర్ సినిమా అవకాశమిచ్చి నాగార్జున చాలా పెద్ద పొరపాటు చేశాడు. నాగార్జున లాంటి స్టార్ హీరో సినిమా తెలుగు రాష్ట్రాల్లో కనీసం కోటి రూపాయలు కూడా కలెక్ట్ చేయలేదంటే అది ఆయనకే అవమానమని.. ఈ రోజుల్లో చిన్నపాటి హీరోల సినిమాలు కూడా కోటి రూపాయల షేర్‌ను సునాయాసంగా కలెక్ట్ చేస్తున్నాయని కొందరు ట్రేడ్ పండితులు వ్యాఖ్యానిస్తున్నారు. వాస్తవానికి, హీరోలకు స్టార్ ఢం వచ్చేది వారు సినిమాలు సాధించే కలెక్షన్ల ఆధారంగానే!ఆ రకంగా చూస్తే, నాగార్జున లాంటి స్టార్ హీరో సినిమా కనీసం కోటి రూపాయలు కూడా కలెక్ట్ చేయలేదంటే అది ఆయన స్టార్ ఇమేజ్‌కు అవమానమే కదా!

 

ఏదైమైనప్పటికీ.. ‘ఆఫీసర్‌’ ప్రభావం నాగార్జున తదుపరి సినిమాలపైన కూడా పడవచ్చు. నాగార్జున సోలోగా చేసే తదుపరి చిత్రాన్ని కొనుగోలు చేయడానికి డిస్ట్రిబ్యూటర్లు ఫ్యాన్సీ ఆఫర్స్ తో ముందుకు రాకపోవచ్చు. మొత్తానికి, రాంగోపాల్ వర్మను నమ్ముకుని ‘కింగ్’ నాగార్జున బాక్సాఫీస్ వద్ద తన పరువును తానే గంగలో కలుపుకున్నాడని చెప్పవచ్చు.

Tags : nagarjunaofficerRGV

Also read

Use Facebook to Comment on this PostMenu