12/21/18 5:50 PM

”అంతరిక్షం” సినిమా రివ్యూ

Antariksham Movie Review

టైటిల్ : అంతరిక్షం
జానర్ : సైన్స్‌ఫిక్షన్‌ స్పేస్‌ థ్రిల్లర్‌
నటీనటులు : వరుణ్‌ తేజ్‌, అదితిరావ్‌ హైదరి, లావణ్య త్రిపాఠి, సత్యదేవ్‌, రాజా, రెహ్మాన్‌, శ్రీనివాస్‌ అవసరాల
మ్యూజిక్ : ప్రశాంత్ విహారి
దర్శకత్వం : సంకల్ప్‌ రెడ్డి
నిర్మాత : క్రిష్‌, రాజీవ్‌ రెడ్డి, సాయి బాబు జాగర్లమూడి, మురళి

 

ఘాజీ సినిమాతో జాతీయ స్థాయిలో తన సత్తా చాటిన యువ దర్శకుడు సంకల్ప్‌‌రెడ్డి. రెండో ప్రయత్నంలోనూ ప్రయోగమే చేశాడు. తొలి తెలుగు స్పేస్‌ మూవీ ”అంతరిక్షం”ను తెరకెక్కించాడు. ఇప్పటి వరకు తెలుగు తెరపై ఎవరూ చేయని ప్రయోగాన్ని సంకల్ప్ రెడ్డి చేశారు. దీనికి దర్శకుడు క్రిష్ జాగర్లమూడి ప్రోత్సాహం అందించారు. వరుణ్‌ తేజ్‌ హీరోగా తెరకెక్కిన ఈ విజువల్‌ వండర్‌పై భారీ అంచనాలే ఉన్నాయి. డిసెంబర్ 21వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. టీజర్‌, ట్రైలర్‌లు ఇంట్రస్టింగ్‌గా ఉండటంతో సంకల్ప్‌ మరోసారి మ్యాజిక్‌ చేస్తాడన్న నమ్మకం కలిగింది. మరి ఆ నమ్మకాన్ని సంకల్ప్‌ నిలబెట్టుకున్నాడా..? వరుణ్‌‌తేజ్‌ ఈ సినిమాతో హ్యాట్రిక్‌ కొట్టాడా? అనేది తెలియాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.

 

క‌థ‌:
11ఏళ్ల క్రితం భారత దేశం కక్ష్యలోకి పంపిన శాటిలైట్ ‘మిహిర’లో సమస్య తలెత్తుతుంది. దీని వల్ల ప్రపంచవ్యాప్తంగా కమ్యూనికేషన్ సిస్టమ్‌ స్తంభించిపోయే పరిస్థితి ఏర్పడుతుందని ఇండియన్ స్పేస్ సెంటర్ భయపడుతుంది. దాని కోడింగ్‌ను కేవలం దేవ్ (వరుణ్ తేజ్) మాత్రమే సరిచేయగలడని భావించి.. ఐదేళ్ల క్రితం ఉద్యోగం మానేసి ఓ ప్రభుత్వ పాఠశాలలో పాఠాలు చెప్పుకుంటున్న అతన్ని తిరిగి రప్పిస్తుంది. మిహిరలో ఉన్న సమస్యను పరిష్కరించడానికి తాను కూడా అంతరిక్షంలోకి వెళ్లాలని దేవ్ కోరతాడు. దీంతో దేవ్‌ను మరో ముగ్గురు వ్యోమగాములతో కలిపి స్పేస్‌లోకి పంపుతారు. వీరు నలుగురూ కలిసి మిహిరలో సమస్యను సరిచేస్తారు. అయితే భూమిపైకి తిరిగి రావడానికి దేవ్ అంగీకరించడు. ‘మిషన్ కిన్నెర’ను తెరపైకి తీసుకొస్తాడు. ఇంతకీ ఏంటీ మిషన్ కిన్నెర అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

 

విశ్లేష‌ణ‌:
స్పేస్ డ్రామా అనేది కేవ‌లం హాలీవుడ్‌లోనే ఎక్కువ‌గా చూస్తుంటాం. కానీ తెలుగు సినిమా కూడా ఇలాంటి ప్ర‌యోగాలు చేస్తుంద‌ని నిరూపించాడు సంక‌ల్ప్‌రెడ్డి. ఈయ‌న తెర‌కెక్కించిన అంత‌రిక్షం ఇప్పుడు దానికి నిద‌ర్శ‌నం. ఘాజీ త‌ర్వాత చేసిన సినిమా కావ‌డంతో ఆస‌క్తి కూడా అలాగే ఉంది. అయితే ఈ సినిమా ఊహించిన రేంజ్‌లో మాత్రం లేక‌పోవ‌డం అభిమానుల‌ను నిరాశ‌ప‌రిచే విష‌యం. ఘాజీ మాదిరే ఎక్క‌డా టైమ్ వేస్ట్ చేయ‌కుండా సూటిగా సుత్తి లేకుండా క‌థ‌లోకి వెళ్లాడు ద‌ర్శ‌కుడు. అక్క‌డ్నుంచే హీరో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్.. లావ‌ణ్య త్రిపాఠి ల‌వ్ సీన్స్ అన్నీ చూపించేసాడు. అంతా బాగానే ఉంటుంది.. ఆస‌క్తిక‌రంగా సాగుతుంది అనుకుంటున్న స‌మ‌యంలో ఇంటర్వెల్ నుంచి క‌థ గాడి త‌ప్పుతుంది. అప్ప‌టి వ‌ర‌కు అంతా స‌రైన దారిలోనే వెళ్లిన అంత‌రిక్షం సిగ్నల్స్ ఇంట‌ర్వెల్ నుంచి క‌ట్ అయ్యాయి. క‌థ లేక అక్క‌డే గాల్లోనే వేలాడుతూ క‌నిపించింది అంత‌రిక్షం. చాలా సేపు ఎక్క‌డా క‌ద‌ల్లేక ఉండిపోయింది. ఘాజీ రియ‌ల్ ఇన్సిడెంట్స్‌తో ఉన్న క‌థ‌.. పైగా చ‌రిత్ర‌.. అక్క‌డ పాకిస్థాన్ ఉంది. కానీ ఇప్పుడు ఇక్క‌డ అంత సీన్ లేదు. దాంతో ద‌ర్శ‌కుడికి రాసుకోడానికి పెద్ద క‌థ కూడా లేదు. దాంతో అదే అంత‌రిక్షంలో అక్క‌డే ఆగిపోయింది క‌థ‌. ముఖ్యంగా క‌థ‌లో కొన్ని లాజిక్స్ మిస్ అయ్యాయి. ఓ మిష‌న్ కోసం స్పేస్‌లోకి వెళ్లి.. అక్క‌డ స‌డ‌న్‌గా మ‌రో మిష‌న్ కోసం ప్లాన్ మార్చ‌డం అనేది సిల్లీగా అనిపిస్తుంది. కొన్ని ఎమోషనల్ సన్నివేశాలతో అంతరిక్షంలోనే కథను నడిపించారు. సెకండాఫ్‌లో విజువల్స్ బాగున్నా ప్రేక్షకుడు సినిమాను అంతగా ఎంజాయ్ చేయలేడు. సైన్స్ ఫిక్షన్‌లు, సాంకేతికతను ఇష్టపడే ప్రేక్షకులకు తప్ప సాధారణ ప్రేక్షకుడికి సెకండాఫ్ పెద్దగా నచ్చదు. క్లైమాక్స్‌ను కూడా దర్శకుడు అంత బాగా డిజైన్ చేయకపోవడం మరో లోపం. ఓవ‌రాల్‌గా చెప్పాలంటే మంచి ప్ర‌య‌త్నం అని చెప్పుకోవ‌చ్చు. కానీ క‌మ‌ర్షియల్ మాత్రం కాదు.

 

వరుణ్ తేజ్, అదితిరావు హైదరి, రాజా చెంబోలు, సత్యదేవ్ నటన బాగుంది. లావణ్య త్రిపాఠి పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేదు. ఇక అవసరాల శ్రీనివాస్, రెహమాన్ తమ పాత్రల పరిధి మేర నటించారు. సినిమాలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది కెమెరా పనితనం, విజువల్ ఎఫెక్ట్స్ గురించే. జ్ఞానశేఖర్ సినిమాటోగ్రఫీ బాగుంది. అంతరిక్షంలో సన్నివేశాలను అద్భుతంగా చిత్రీకరించారు. వీఎఫ్ఎక్స్‌పై ఇంకాస్త దృష్టి సారించాల్సింది. అక్కడక్కడ విజువల్ ఎఫెక్ట్స్ నాసిరకంగా అనిపిస్తాయి. చిత్ర నిర్మాణ విలువలు బాగానే ఉన్నాయి. సినిమాను సాగదీయకుండా ఎడిటర్ కార్తీక శ్రీనివాస్ రెండు గంటలకు బాగా కుదించారు. ప్రశాంత్ విహారి అందించిన మూడు పాటలు బాగున్నాయి.

 

చివరగా.. సంకల్ప్‌రెడ్డి చేసిన ఈ ప్రయోగాన్ని అభినందించకుండా ఉండలేం. కానీ, ప్రయోగాలతో పాటు ప్రేక్షకుడికి నచ్చే కొన్ని అంశాలను కూడా సినిమాలో చొప్పించి ఉంటే బాగుండేది. ఎందుకంటే, దర్శకుడు చేసే ప్రయోగం ప్రేక్షకుడిని థియేటర్‌కు రప్పించగలగాలి కదా.

 

రేటింగ్: 2.5/5

Tags : aditi rao hydariAntariksham Movie RatingAntariksham Movie ReviewDirector Sankalp ReddyGhaziLavanya Tripathi

Also read

Use Facebook to Comment on this PostMenu