01/10/19 9:00 AM

ఎన్టీఆర్ కథానాయకుడు మూవీ రివ్యూ

NTR Kathanayakudu Telugu Movie Review

టైటిల్ : ఎన్టీఆర్ కథానాయకుడు
జానర్ : బయోపిక్‌
నటీనటులు : బాలకృష్ణ, విద్యాబాలన్‌, కల్యాణ్ రామ్‌, రానా, సుమంత్‌
సంగీతం : ఎం.ఎం.కీరవాణి
దర్శకత్వం : క్రిష్‌ జాగర్లమూడి
నిర్మాత : బాలకృష్ణ, సాయి కొర్రపాటి, విష్ణు ఇందూరి
విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారకరామారావు జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం ”ఎన్టీఆర్ కథానాయకుడు”. నందమూరి బాలకృష్ణ , విద్యాబాలన్, సుమంత్, రానా, కళ్యాణ్ రామ్ తదితరులు నటించిన ఈ చిత్రం 2019, జనవరి 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగు సినీరంగంలో ఎన్నో అద్భుతాలు సృష్టించిన నందమూరి తారక రామారావు జీవితకథను రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. తండ్రి పాత్రలో నందమూరి బాలకృష్ణ స్వయంగా నటిస్తూ, నిర్మించిన చిత్రం ఎన్టీఆర్ కథానాయకుడు. ఈ సినిమాతో బాలయ్య తొలిసారిగా నిర్మాతగానూ మారాడు. ప్రేక్షకుల అంచనాలను ఎన్టీఆర్ కథానాయకుడు అందుకుందా.? తండ్రి పాత్రలో బాలయ్య మెప్పించాడా..? క్రిష్‌ దర్శకుడిగా మరోసారి సత్తా చాటాడా? ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను అలరించిందా? లేదా? అన్నది రివ్యూలో తెలుసుకుందాం.

 

కథ:
1984 బ్యాక్‌డ్రాప్‌లో చెన్నైలోని అడయార్ క్యాన్సర్ హాస్పిటల్ నుంచి ప్రారంభమవుతుంది. అక్కడ బసవ తారకం(విద్యాబాలన్) చికిత్స తీసుకుంటూ ఉంటారు. ఆమెను కలవడానికి కుమారుడు హరికృష్ణ(క‌ళ్యాణ్ రామ్‌) వ‌స్తారు. కొడుకు తీసుకొచ్చిన ఎన్టీఆర్ ఫొటో ఆల్బమ్‌ను బసవ తారకం చూడటంతో ఫ్లాష్‌బ్యాక్ మొదలవుతుంది. 1947లో తన స్వస్థలంలో నంద‌మూరి తార‌క రామారావు(బాల‌కృష్ణ) రిజిస్ట్రార్ ఆఫీస్‌లో ప‌నిచేస్తుంటారు. అప్పటికి ఆయన ఉద్యోగంలో చేరి 3 వారాలు మాత్రమే అవుతుంది. కానీ ఆఫీసులోని ఉద్యోగులు ప్రజల వద్ద నుంచి లంచాలు తీసుకొని పనిచేయడాన్ని సహించలేక ఎన్టీఆర్ ఉద్యోగం మానేస్తారు. గతంలో దర్శకుడు ఎల్వీ ప్రసాద్ తనకు రాసిన ఉత్తరాన్ని పట్టుకుని సినిమాల్లో నటించడానికి మద్రాసు బయలుదేరతారు. ఇక్కడి నుంచి ఎన్టీఆర్ సినీ జీవితం మొదలవుతుంది. మద్రాసు వెళ్లాక ఎన్టీఆర్‌కు ఎదురైన ఇబ్బందులు, ఆయన సినిమాల్లో ఎదిగిన తీరు, పెద్ద కుమారుడి మరణం, ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావడానికి దారితీసిన సంఘటనలు ఇదే సినిమా.

 

తెలుగు సినీ పరిశ్రమలో వెండితెర రారాజుగా సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న ఎన్టీఆర్ సినీ జీవితాన్ని కేవలం రెండున్నర గంటల్లో చెప్పడమంటే ఈజీ కాదు. కానీ దర్శకుడు క్రిష్, హీరో బాలకృష్ణ ప్రయత్నించారు. ఆ ప్రయత్నం సఫలమైందనే చెప్పాలి. స్క్రిప్ట్‌ను పక్కాగా రాసుకుని దాన్ని తెరపై అందంగా చూపించారు. సినిమాలో ప్రతి ఒక్కరూ నటించారు అనే కన్నా జీవించారు అంటేనే సబబుగా ఉంటుంది. అంత బాగా జాగ్రత్తలు తీసుకొని ప్రతి ఫ్రేమ్‌ను అందంగా, ఆకర్షణీయంగా తెరకెక్కించిన ఘనత దర్శకుడు క్రిష్‌దే. సెట్స్, ప్రాపర్టీల విషయంలో కూడా చాలా కేర్ తీసుకున్నారు. 1947, 1980ల కాలాన్ని గుర్తుచేశారు. ఈ విషయంలో ఆర్ట్ డైరెక్టర్‌ను తప్పకుండా మెచ్చుకోవాలి.

 

ఫస్టాఫ్‌లో ఎన్టీఆర్ సినిమాలోకి ఎలా వచ్చారు.. ఎలా ఎదిగారు.. వంటి విషయాలు చూపించారు. అలాగే రాయలసీమ కరువు వచ్చినప్పుడు సినీ పరిశ్రమ తరఫున ఎన్టీఆర్ చొరవ తీసుకొని ప్రజల నుంచి విరాళాలు ఎలా సేకరించారు వంటి విషయాలను చాలా స్పష్టంగా చెప్పారు. ఏఎన్‌ఆర్‌తో సత్సంబంధాలు, ఆయనతో కలిసి ఎన్టీఆర్ ఎలా నడిచారో కూడా తెరపై బాగా చూపించారు. కృష్ణుడి పాత్రకు ఎన్టీఆర్‌ను దర్శకుడు కేవీరెడ్డి ఎంపిక చేసినప్పుడు ఆయన నిర్ణయాన్ని నిర్మాతలు నాగిరెడ్డి, చక్రపాణి వ్యతిరేకిస్తారు. మాస్ హీరోని తీసుకొచ్చి పౌరాణికం ఎలా చేయిస్తావని అడ్డుపడతారు. ఆ సమయంలో కృష్ణుడి వేషధారణలో బాలయ్య ఎంట్రీ అద్భుతమనే చెప్పాలి. అలాగే ఎన్టీఆర్ పెద్ద కుమారుడు రామకృష్ణ చనిపోయినప్పుడు వచ్చే ఎపిసోడ్ ప్రతి ఒక్కరితో కన్నీరు పెట్టిస్తుంది. ఇక సెకండాఫ్‌లో దివిసీమ ఉప్పెన ఎపిసోడ్ చాలా బాగా చిత్రీకరించారు. ఆఖరిగా ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని ప్రకటించడంతో సినిమా ముగుస్తుంది.

 

ఎన్టీఆర్ పాత్రకు నందమూరి బాలకృష్ణ పూర్తి న్యాయం చేశారు. తండ్రి పాత్రలో జీవించారు. అయితే, బాలయ్యకు వయసు మీద పడటం చిన్న వెలితిగా కనిపించింది. ఎన్టీఆర్ యవ్వనంలో ఉన్న పాత్రలకు బాలయ్య లుక్ అంత బాగా సరిపోలేదు. కానీ 60 ఏళ్ల ఎన్టీఆర్‌గా మాత్రం బాలయ్య లుక్ అదిరిపోయింది. సెకండాఫ్‌లో సీనియర్ ఎన్టీఆర్‌ను గుర్తు చేశారు.

 

ఇక బసవ తారకం పాత్రలో విద్యా బాలన్‌ను తప్ప మరొకరి ఊహించుకోలేనంతగా చేశారు. చాలా నాచురల్‌గా చేశారు. నిజం చెప్పాలంటే సినిమాకు ఆమె ఒక స్పెషల్ ఎట్రాక్షన్. ఏఎన్ఆర్‌గా సుమంత్, హరికృష్ణగా కళ్యాణ్ రామ్, ఎల్వీ ప్రసాద్‌గా జిస్సు సేన్ గుప్తా, నాగిరెడ్డిగా ప్రకాష్ రాజ్, చక్రపాణిగా మురళీ శర్మ ఇలా ప్రతి ఒక్కరూ తమ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. నేటి తరం హీరోయిన్లు రకుల్ ప్రీత్ సింగ్, హన్సిక, ప్రణీత, షాలిని పాండే, శ్రీయ, నిత్యా మీనన్, పాయల్ రాజ్‌పుత్ తళుక్కున మెరిసారు. బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, వాసు ఇంటూరి ఇలా ప్రతి ఒక్కరు తమ పాత్రల పరిధి మేర నటించారు.

 

సినిమాలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది సాయిమాధవ్ బుర్రా మాటలు, ఎం.ఎం.కీరవాణి నేపథ్య సంగీతం గురించి. బాలయ్యకు గతంలో ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ సినిమాకు అద్భుతమైన డైలాగులు రాసిన సాయిమాధవ్.. ఈ సినిమాకు అదే స్థాయిలో మాటలు రాశారు. కొన్ని సన్నివేశాల్లో బాలయ్య చెప్పే డైలాగులు థియేటర్‌లో ప్రేక్షకుల చేత చప్పట్లు కొట్టిస్తాయి. కీరవాణి తన నేపథ్య సంగీతంతో ప్రతి సన్నివేశాన్ని ప్రేక్షకుడి గుండె లోతుల్లోకి తీసుకెళ్లారు. జ్ఞానశేఖర్ సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. నిర్మాణ విలువలు చాలా రిచ్‌గా ఉన్నాయి.

 

మొత్తంగా సినిమా ఓకే అనిపించింది. థియేటర్‌కు వెళ్లిన ప్రేక్షకుడు సినిమాను ఎంజాయ్ చేస్తాడు. నేటితరం ఎన్టీఆర్ గురించి కొత్త విషయాలు తెలుసుకున్నాం అనే భావనతో థియేటర్ నుంచి బయటికి వస్తారు.

 

ప్లస్‌ పాయింట్స్‌ :
బాలయ్య, విద్యాబాలన్‌ నటన
ఎన్టీఆర్‌, బసవ తారకంల మధ్య వచ్చే సన్నివేశాలు
సంగీతం
మాటలు

మైనస్‌ పాయింట్స్‌ :
ఫస్ట్‌ హాఫ్‌లో బాలకృష్ణ లుక్‌
సాగదీత సన్నివేశాలు
సినిమా లెంగ్త్

రేటింగ్: 2.5/5

Tags : balakrishnakrishnandamuri taraka ramaraontrNTR Kathanayakudu Telugu Movie Review

Also read

Use Facebook to Comment on this PostMenu