11/23/18 11:53 PM

24 కిస్సెస్ సినిమా రివ్యూ

24 Kisses Movie Review

సినిమా : 24 కిస్సెస్
నటీనటులు : హెబ్బా పటలే్, అదిత్ అరుణ్, రావు రమేష్, నరేష్
దర్శకత్వం : అయోధ్యకుమార్ కృష్ణంశెట్టి
సంగీతం : జోయ్
జానర్ : రొమాన్స్

 

‘కుమారి 21 ఎఫ్’ సినిమాలో తన బోల్డ్ పెర్ఫార్మన్స్‌తో యూత్‌ని ఆకట్టుకున్న హీరోయిన్ హెబ్బా పటేల్ తాజాగా ’24 కిస్సెస్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ముద్దుల ఉత్సవంతో నేడు (నవంబర్ 23వ తేదీ) థియేటర్‌లోకి వచ్చిన ఈ సినిమాలో అరుణ్ అదిత్ హీరోగా నటించాడు. సినిమా టీజర్, ట్రైలర్‌లకి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ‘మిణుగురులు’ లాంటి అవార్డు విన్నింగ్ సినిమాను రూపొందించిన అయోధ్య కుమార్ కృష్ణం శెట్టి ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. ట్రైలర్‌లో హీరో, హీరోయిన్లు మధ్య రొమాంటిక్ సన్నివేశాలు, ఘాటైన ముద్దు సీన్లతో యూత్‌లో ఈ సినిమాపై ఆసక్తిని పెంచేశారు. శృంగార రసకేళిలో తొలి మెట్టు ముద్దే. ఈ ముద్దులో కేవలం బూతునే వెతుకున్న ప్రస్తుతం పరిస్థితుల్లో ‘24 కిస్సెస్’ అంటూ బోల్డ్ అటెంప్ట్ చేశాడు అయోధ్యకుమార్ కృష్ణంశెట్టి. ఈ ముద్దుల ఉత్సవం ప్రేక్షకులకు ఎంత వరకూ కనెక్ట్ అయ్యిందో రివ్యూలో తెలుసుకుందాం.

 

హెబ్బా పటేల్, అరుణ్ అదిత్ జంటగా నటించిన ‘24 కిస్సెస్’ వివాదాల నడుమ శుక్రవారం(నవంబర్ 23) నాడు థియేటర్స్‌లో విడుదలైంది. ‘నీకో సగం.. నాకో సగం.. ఈ ఉత్సవం’ అన్నది టాగ్ లైన్. సిల్లీ మొంక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్, రెస్పెక్ట్ క్రియేషన్స్ బ్యానర్స్‌పై సంజయ్ రెడ్డి, అనిల్ పల్లెల, అయోధ్యకుమార్ కృష్ణంశెట్టిలు ఈ సినిమాని నిర్మించారు.

 

కథ:
హీరో ఆనంద్( అదిత్ అరుణ్) చిన్న పిల్లల సినిమాలు తీస్తుంటాడు. పెళ్లి అంటే ఇష్టం ఉండదు. మాస్ కమ్యునికేషన్ చేసిన శ్రీలక్ష్మి (హెబ్బా పటేల్) షార్ట్ ఫిల్మ్స్ తీస్తూ ఉంటుంది. ఆనంద్‌‌తో పరిచయం ఏర్పడుతుంది. ఫిల్మ్ మేకింగ్‌తో పాటు సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్న ఆనంద్ పట్ల ఇష్టం పెంచుకుంటుంది శ్రీలక్ష్మి. 24 ముద్దులు పెట్టుకుంటే కపుల్స్‌గా మారొచ్చని మిత్రుడి ద్వారా తెలుసుకున్న శ్రీలక్ష్మి ఆనంద్‌తో తొలి ముద్దు టేస్ట్ చేస్తుంది. అలా ఇద్దరి మధ్య ముద్దులు ఒక్కొక్కటిగా హద్దులు దాటుతూ.. సరిహద్దుల్ని చెరిపేస్తూ గోవాలో శారీరకంగా ఒకటైన తరువాత 23వ ముద్దు వద్ద ఆగుతారు. శారీరక కలయిక అనంతరం లవ్ అండ్ పెళ్లి ప్రపోజ్ తెస్తుంది శ్రీలక్ష్మి. అయితే ప్రేమ, పెళ్లి, పిల్లలు పట్ల మంచి అభిప్రాయం లేని ఆనంద్ నో చెప్పడంతో శ్రీలక్ష్మి బ్రేకప్ చెబుతుంది. 23వ ముద్దు వద్ద బ్రేక్ పడిన ఈ జంట.. 24వ ముద్దుతో ప్రేమికులుగా మారారా? పెళ్లి చేసుకుంటారా? అన్నదే 24 కిస్సెస్ మిగతా కథ.

 

విశ్లేషణ..
మొదటగా 24 కిస్సెస్ మూవీ చూస్తే.. ‘మిణుగురులు’ లాంటి అవార్డ్ విన్నింగ్ దర్శకుడేనా ఈ సినిమా తీసింది అనే సందేహం కలగక మానదు. ‘24 కిస్సెస్’ అనే బోల్డ్ టైటిల్‌తో ప్రేక్షకుల్లో ఆసక్తిరేకెత్తిస్తూ.. టీజర్, ట్రైలర్, మేకింగ్ వీడియో‌లతో ఈ చిత్రానికి ఫుల్ పబ్లిసిటీ తీసుకురావడంలో సక్సెస్ అయిన దర్శకుడు సినిమాను ప్రజెంట్ చేయడంతో బొక్కబోర్లా పడ్డాడు. కేవలం ముద్దు సీన్లు ఉంటే సినిమాను ఆదరిస్తారని ఆలోచించే మేకర్స్‌కి ఈ సినిమా ఓ హెచ్చరిక లాంటిది. బోల్డ్ కంటెంట్‌ను సరైన రీతిలో ప్రజెంట్ చేయకపోతే రిజల్ట్ ఎలా ఉంటుంది అనే దానికి పెద్ద ఉదాహరణ ఈ సినిమా.

 

అసలు ఆయన ఏం చెప్పాలనుకున్నారో ‘24 కిస్సెస్’ మూవీ శుభం కార్డు పడేవరకూ ప్రేక్షకులు అయోమయంలోనే ఉన్నారు. ఫస్టాప్ మొత్తం హీరో హీరోయిన్ల మధ్య 23 ముద్దుల్ని లెక్కపెడుతూ కథను గాలికి వదిలేసిన దర్శకుడు.. సెకండాఫ్‌లో ఏమైనా చెప్తాడా అనుకుంటే మిగిలిన ఆ ఒక్క ముద్దుని పెట్టించేసి శుభం కార్డ్ వేసేశాడు. హీరోతో ప్రేమంటే నమ్మకం లేదని చెప్పిస్తాడు.. ఆ ప్రేమే కావాలని హీరోయిన్ వెంట పడేలా చేస్తాడు. పెళ్లిపై నమ్మకం లేదంటాడు.. ఆ పెళ్లి కోసం పరితపించేలా చేస్తాడు.. అన్నింటికీ మించి ఈ ప్రపంచానికే పిల్లల్నికనే అర్హత లేదంటాడు.. చివర్లో ఇద్దరు ముగ్గురు పిల్లలు కావాలనిపించేలా చేస్తాడు. అసలు దర్శకుడు అయోధ్యకుమార్ కృష్ణంశెట్టి ఏం చెప్పాలనుకున్నారు? ఏం చెప్పారు అంటే.. 24 ముద్దులు తప్ప ఇంకేం కనిపించవు. ఆ ముద్దు సన్నివేశాలు కూడా సందర్భాను సారం కాకుండా లెక్క కోసమే అన్నట్టుగా ఉన్నాయి.

 

ఇక హీరోయిన్‌ హెబ్బా పటేల్ బోల్డ్ పాత్రలో.. ముద్దు సన్నివేశాల్లో జీవించేసింది. ఘాటైన ముద్దులతో రెచ్చిపోయింది. దర్శకుడు చెప్పినట్టుగా తన పాత్రకు న్యాయం చేసింది. కథ, కథనాల సంగతి పక్కనపెట్టేస్తే.. ‘24 కిస్సెస్’ పర్ఫెక్ట్‌గా తాను రుచి చూస్తూ.. ముద్దుల వర్షం కురిపించింది. హీరో అరుణ్ అదిత్ కూడా తన పాత్ర పరిధి మేర బాగానే నటించాడు. ముద్దుల్లో హెబ్బాతో పోటీ పడ్డాడు. ప్లే బాయ్‌గా బోల్డ్ సీన్స్ పండించాడు. అయితే కథలో కిస్‌లు తప్ప ఇంకే లేకపోవడంతో హీరో హీరోయిన్లు నటన ముద్దులకే పరిమితం అయ్యింది. ఇక మెంటల్ డాక్టర్‌గా కథను మొత్తం ప్రేక్షకులను వినిపించిన రావు రమేష్ పాత్ర సీరియస్‌గా నడుస్తుంది అనుకుంటే.. చివర్లో అతన్నీ కమెడియన్‌గా మార్చేశారు. అక్కడక్కడా రావు రమేష్ పంచ్‌లు పేలాయి. హీరోయిన్ తండ్రి పాత్రలో నరేష్ ఆకట్టుకున్నాడు.

Image result for 24 kisses movie review
ఈ చిత్రానికి అస్సామీ సంగీత దర్శకుడు జోయ్ బ‌రువా మంచి సంగీతాన్ని అందించారు. వివేక్ ఫిలిప్ బ్యాగ్రౌండ్ స్కోర్ పర్వేలేదనిపిస్తుంది. హరి రామ జోగయ్య శాస్త్రి అద్భుతమైన సాహిత్యం అందించారు. సినిమాటోగ్రాఫర్ ఉదయ్ గుర్రాల ముద్దు సన్నివేశాల్లో తన కెమెరా పనితనాన్ని చూపించారు. అయితే ఇలాంటి సీన్లు సినిమా నిండా ఉండటంతో ఆయన క్రియేటివిటీ పెద్దగా కనిపించదు. ఈ సినిమాలో అక్కర్లేని సన్నివేశాలు చాలానే ఉన్నాయి. ఆలయం అనిల్ తన కత్తెరకు పనిచెప్పాల్సింది. టెక్నికల్ పరంగా మంచి సాంకేతిక విలువలు ఉన్నప్పటికీ వాటిని వినియోగించుకోలేక పోయాడు దర్శకుడు. ‘24 కిస్సెస్’ ఇది పూర్తిగా దర్శకుడి వైఫల్యమే. చివరిగా ‘24 కిస్సెస్.. అన్నీ టేస్ట్ లెస్ కిస్‌లే. కుటుంబంతో కలిసి చూడాలనుకునే వాళ్లు ఈ సినిమాకు దూరంగా ఉండటం మంచిది.

 

ఒక చిన్న లైన్ ని పట్టుకొని సినిమాని లాగాలి అనుకోవడం కష్టం. మిణుగురులు లాంటి అవార్డు విన్నింగ్ సినిమా తీసిన అయోధ్య కుమార్ 24 కిస్సెస్ సినిమాను హ్యాండిల్ చేయడంలో విఫలమయ్యాడనే చెప్పొచ్చు.

ప్లస్:
హెబ్బా నటన

మైనస్:
అనవసరమైన సీన్స్
స్టోరీ
స్క్రీన్ ప్లే

పంచ్ లైన్: ‘24 కిస్సెస్.. అన్నీ టేస్ట్ లెస్ కిస్‌లే’

రేటింగ్: 1.5/5

Tags : 24 kisses movie rating24 kisses movie reviewAdith Arundirector ayodhya kumar krishnamsettyHEBAH PATELminuguruluRao ramesh

Also read

Use Facebook to Comment on this PostMenu