06/27/19 8:02 PM

విజయనిర్మల మృతి పట్ల ప్రముఖుల సంతాపం

Actress Vijaya Nirmala Passes Away

టాలీవుడ్ ప్రముఖ నటి, దర్శకురాలు, సూపర్ స్టార్ కృష్ణ భార్య విజయనిర్మల (73) మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఆమె మరణం సినీ పరిశ్రమకు తీరని లోటు అన్నారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు.. జగన్, కేసీఆర్.. మాజీ సీఎం చంద్రబాబు..విజయనిర్మల మృతికి సంతాపం తెలిపారు. అత్యధిక సినిమాలకు దర్శకత్వం వహించిన మహిళగా ఆమె గిన్నిస్‌బుక్‌లోకి ఎక్కారని గుర్తు చేశారు. ఆమె కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

 

నటిగా, దర్శకురాలిగా, నిర్మాతగా తనదైన ప్రత్యేకతను సంపాదించుకున్న విజయనిర్మలగారు కన్నుమూయడం ఎంతో బాధాకరం అన్నారు. సినీ పరిశ్రమలో మహిళా సాధికారతను చాటిన అతికొద్ది మంది మహిళల్లో విజయనిర్మలగారు ఒకరు అని ప్రశంసించారు. దర్శకురాలిగా 44 చిత్రాలను డైరెక్ట్ చేయడం చాలా గొప్ప విషయం అన్నారు. దర్శకురాలిగా గిన్నిస్ బుక్ రికార్డ్ సాధించి ఎంతో మంది మహిళలకు ఆదర్శంగా నిలిచారని చెప్పారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు.

 

విజయనిర్మల నటిగానే కాదు, దర్శకురాలిగానూ సక్సెస్ అయ్యారు. ప్రపంచంలోనే అత్యధిక సినిమాలకు దర్శకత్వం వహించిన మహిళగా 2002లో గిన్నిస్‌బుక్ రికార్డులకెక్కారు. మొత్తంగా ఆమె 44 సినిమాలకు దర్శకత్వం వహించారు. 1971లో దర్శకత్వ బాధ్యతలు చేపట్టిన విజయనిర్మల..1973లో ‘మీనా’ అనే సినిమాకు తొలిసారి దర్శకత్వం వహించారు. ఆ తర్వాత దేవదాసు, దేవుడే గెలిచాడు, రౌడీ రంగమ్మ, మూడు పువ్వులు ఆరు కాయలు, హేమా హేమీలు, రామ్‌ రాబర్ట్‌ రహీం, సిరిమల్లె నవ్వింది, భోగి మంటలు, బెజవాడ బెబ్బులి, ముఖ్యమంత్రి, లంకె బిందెలు, కలెక్టర్‌ విజయ, ప్రజల మనిషి, మొగుడు పెళ్లాల దొంగాట, పుట్టింటి గౌరవం, రెండు కుటుంబాల కథ తదితర 44 సినిమాలకు దర్శకత్వం వహించారు. సొంత నిర్మాణ సంస్థ ‘విజయకృష్ణ’ను స్థాపించి ఆ పతాకంపై 15కుపైగా సినిమాలు నిర్మించారు. తెలుగు, తమిళ, మలయాళం భాషల్లో 200కుపైగా చిత్రాల్లో నటించారు.

 

సూపర్ స్టార్ కృష్ణ- విజయనిర్మల కాంబినేషన్‌‌లో వచ్చిన పలు చిత్రాలు బ్లాక్ బస్టర్ హిట్‌లుగా నిలిచాయి. ‘సాక్షి’ చిత్రంతో మొదలైన వీరి సినీ ప్రయాణం వివాహ బంధానికి దారితీసింది. సుమారు 47 చిత్రాల్లో కలిసి నటించారు. సూపర్ స్టార్ కృష్ణ హీరోగా పలు విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించారు విజయనిర్మల. కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న విజయనిర్మల.. బుధవారం హైదరాబాద్ గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గుండెపోటుతో మరణించారు.

Tags : actress vijaya nirmaladirectorkrishnamahesh babunareshpassed awayTollywood

Also read

Use Facebook to Comment on this Post



Menu