01/12/19 5:06 PM

‘F2 (ఫన్‌ అండ్‌ ఫ్రస్ట్రేషన్)‌’ మూవీ రివ్యూ

F2 – Fun and Frustration Movie Review

టైటిల్ : F2 (ఫన్‌ అండ్‌ ఫ్రస్ట్రేషన్‌)
జానర్ : కామెడీ ఎంటర్‌టైనర్‌
నటీనటులు : వెంకటేష్‌, వరుణ్‌ తేజ్‌, తమన్నా, మెహరీన్‌, రాజేంద్ర ప్రసాద్‌, ప్రకాష్‌ రాజ్‌, ప్రగతి
మ్యూజిక్ : దేవీ శ్రీ ప్రసాద్‌
డైరెక్టర్ : అనిల్‌ రావిపూడి
ప్రొడ్యూసర్ : దిల్‌ రాజు

 

పటాస్, సుప్రీమ్, రాజా దిగ్రేట్ చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో విక్టరీ వెంకటేష్, మెగా హీరో వరుణ్ తేజ్ మల్టీస్టార్‌గా తెరకెక్కిన మూవీ F2. ఔట్ అండ్ ఔట్ కామెడీ‌తో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌‌గా రూపొందిన ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించారు. వెంకటేష్ సరసన మిల్కీ బ్యూటీ తమన్నా.. వరుణ్‌కి జోడీగా మెహ్రీన్ నటించారు. ప్రకాష్ రాజ్, రాజేంద్రప్రసాద్, అనసూయ తదితరులు నటించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన రిలీజ్ అయ్యింది. చాలా కాలం తర్వాత వెంకీ ఫుల్‌ లెంగ్త్‌ కామెడీ రోల్‌లో కనిపించటం, వరుణ్‌ తేజ్‌ తొలిసారిగా మల్టీస్టారర్‌ సినిమా చేస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఆ అంచనాలను ఎఫ్‌ 2 అందుకుందా..? అనిల్ మరో హిట్ కొట్టాడా? తెలియాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే..

 

కథ..
వెంకటేష్ ఒక ఎమ్మెల్యే దగ్గర పీఏగా పనిచేస్తుంటాడు. త్వరగా పెళ్లి చేసుకొని భార్యతో లైఫ్ ఎంజాయ్ చేయాలనేది కల. దానికోసం ఒక మంచి అమ్మాయిని పెళ్లి చేసుకోవాల‌ని ఎదురు చూస్తుంటాడు. అదే సమయంలో భర్తను చెప్పుచేతల్లో పెట్టుకోవాలని అనుకునే అమ్మాయి తమన్నా. వీళ్ళిద్దరికి పెళ్ళి కుదురుతుంది.. పెళ్లికి ముందు హ్యాపీగా ఉన్న వెంకటేష్ పెళ్లి తర్వాత మాత్రం ఫ్ర‌స్టేషన్‌కు గురవుతాడు. తమన్నా చెల్లి మెహరీన్‌తో వరుణ్ తేజ్ ప్రేమలో ఉంటాడు. వీళ్లకు కూడా పెళ్లి కుదురుతుంది. కానీ వెంకటేష్‌ను చూసి భయపడిన వరుణ్ తేజ్ సరిగ్గా పెళ్లి సమయానికి వెంకీతో క‌లిసి యూర‌ప్ పారిపోతాడు. ఇద్దరూ కలిసి అక్క‌డే ఉంటారు. అక్కడినుంచి ఏమైంది అనేది ఎఫ్ 2 కథ.

 

కథనం:
పెళ్లంటే నూరేళ్ళ మంట కాదు కాదు నూరేళ్ల పంట.. ఈ రెండు ఎఫ్ 2లో చూపించాడు అనిల్ రావిపూడి. పంట‌, మంట రెండూ బాగా బ్యాలెన్స్ చేశాడు. పెళ్లికి ముందు తర్వాత ఎలా ఉంటుంది అనేది రెండు జీవితాలను పక్కపక్కనే పెట్టి చూపించాడు దర్శకుడు. కావాల్సినంత ఫన్ పెట్టి స్క్రీన్‌పై ఆవిష్కరించాడు. ఫస్ట్ హాఫ్‌లో వచ్చే ఒక్కో సీన్ కడుపులు చెక్కలు చేస్తుంది. తొలి సీన్ నుంచి చివరి వరకు నవ్వించడం ఒక్కటే ఈ దర్శకుడికి తెలిసిన మంత్రం. ఇదే ఫాలో అయిపోయాడు కూడా.

 

నటీనటులు:
సినిమా స్టార్ట్ అయిన కొద్దిసేపటికే థియేటర్స్‌లో ఫన్ ప్రవాహంలా మారింది. కాస్త గ్యాప్ ఇవ్వు వెంకీ నవ్వుకుంటాం అనేంతగా వెంకటేష్ విశ్వరూపం చూపించాడు. ఇంట్లో ఇల్లాలు.. వంటింట్లో ప్రియురాలు, నువ్వు నాకు నచ్చావ్, మళ్లీశ్వరి సినిమాలను గుర్తు చేస్తూ కామెడీ పంచ్‌లతో పొట్ట చెక్కలు చేశారు. సరైన పాత్ర పడేలా కాని.. కామెడీ టైమింగ్‌తో చెడుగు ఆడేసే వెంకటేష్‌కి అనిల్ ఫన్ అండ్ ఫస్ట్రేషన్ మాటలు తోడు కావడంతో పాత రోజుల్ని గుర్తుకు తెస్తాడు. ఎమోషన్స్ సీన్స్‌లో తనదైన శైలిలో రెచ్చిపోయాడు. పెళ్లై ఫస్ట్రేషన్‌లో ఉన్న భర్త పడకగదిలో ఎలా ఉంటాడు.. ఆఫీస్‌లో ఎలా ఉంటాడు.. అత్త మామల దగ్గర ఎలా ప్రవర్తిస్తాడో ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేసి హాస్యపు విందును ప్రేక్షకులకు అందించారు వెంకీ. భార్య బాధితులు ఫస్ట్రేషన్ తగ్గించుకోవాలంటే.. ఓ ఆసనాన్ని కూడా చూపించాడు వెంకీ. సినిమా మొత్తం ఈ ఆసనం హైలైట్ అయ్యింది. థియేటర్ నుండి బయటకు వచ్చే ప్రతి ప్రేక్షకుడికి ఈ ఆసనం గుర్తుండిపోతుంది.

 

వరుణ్ యాదవ్‌గా.. వెంకీకి తమ్ముడిగా వరుణ్ తేజ్ డిఫరెంట్‌ రోల్‌లో కనిపించాడు. పక్కా తెలంగాణ యాసలో మాట్లాడుతూ ప్రేక్షకుల్ని ఎంటర్‌టైన్ చేయడంలో సక్సెస్ అయ్యాడు. సినిమాలో వరుణ్‌కి చాలా సీన్లు వెంకీ కాంబినేషన్‌లో ఉండటంతో కామెడీ బాగా పండింది. ప్రేమికుడిగా ఉన్నప్పుడే పెళ్లాన్ని కంట్రోల్‌లో పెడతా అని శపథం చేసి పెళ్లి కాకుండానే భార్య బాధితుడు కావడం ఫన్‌ని జనరేట్ చేస్తుంది.

 

పటాస్, సుప్రీమ్, రాజా దిగ్రేట్ లాంటి హిట్ చిత్రాలతో ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను ఏర్పరచుకున్న అనిల్ రావిపూడి సంక్రాంతి పండక్కి ప్రేక్షకులు కోరుకునే అసలు సిసలు ఎంటర్‌టైన్‌ని ‘F2’ చిత్రం ద్వారా అందించారు. ఫస్టాఫ్ మొత్తం ఫుల్ ఫన్‌తో ప్రేక్షకులకు ఎక్కడా బోర్ కొట్టకుండా పక్కా స్క్రీన్ ప్లేతో కథను నడిపించి.. చిన్న ట్విస్ట్‌తో సెంకండాఫ్‌పై ఆసక్తి కలిగేలా చేశారు. క్లైమాక్స్‌ ఏంటో ముందే తెలిసిపోయినా.. చిన్న చిన్న ట్విస్ట్‌లతో ఆసక్తిగా మలిచారు. కథ, స్క్రీన్ ప్లేతో పాటు మాటలు కూడా ఆయనే రాసుకోవడంతో కథ ఎక్కడా ట్రాక్ తప్పకుండా ప్రేక్షకులకు వినోదాన్ని అందించారు. అయితే సెకండాఫ్‌లో కొన్ని అక్కర్లేని సీన్లు, సాగదీతగా అనిపించినప్పటికీ ఫన్ ప్రవాహంలో అవి పెద్దగా కనిపించవు. క్లైమాక్స్‌ సన్నివేశం ప్రేక్షకుల ఊహలకు అందినట్టే ఉన్నా.. యాక్షన్, ఎమోషన్ సీన్ల జోలికి పోకుండా ఫన్‌తోటే మంచి ముగింపు ఇచ్చారు.

 

ఇక ఈ సినిమాలో అక్కాచెల్లెల్లుగా చేసిన తమన్నా, మెహ్రీన్‌లకు ఇన్నాళ్లకు మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మూవీ పడింది. ఇగో సిస్టర్స్‌గా హారిక, హనీ పాత్రల్లో ఇమిడిపోయారు. హనీ ఈజ్ బెస్ట్ అనిపించుకోవాలనుకునే అమాయకపు పాత్రలో మెహ్రీన్ బెస్ట్ పెర్ఫామెన్స్ ఇచ్చింది. స్క్రీన్‌పై ఇద్దరూ సిస్టర్స్‌గా పర్ఫెక్ట్‌గా సూట్ అయ్యారు. ఇక అందాల ఆరబోతలోనూ ఒకరితో ఒకరు పోటీ పడ్డారు.

 

ఇక ఈ చిత్రంలో నటించిన భారీ తారాగణం ప్రేక్షకులకు అన్‌లిమిటెడ్ ఎంటర్‌టైన్‌మెంట్ అందించారు. వెంకటేష్, వరుణ్, తమన్నా, మెహ్రీన్ పాత్రలతో పాటు.. ప్రకాష్ రాజ్, రాజేంద్రప్రసాద్, అనసూయ, హరితేజ, సుబ్బరాజు, రఘబాబు, సత్యం రాజేష్, వెన్నెల కిషోర్, ప్రియదర్శి, బిగ్ బాస్ ఫేమ్ నూతన్ నాయుడు, థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృధ్వీ, అన్నపూర్ణ, హరితేజ ఇలా ప్రతి పాత్రతోనూ నవ్వులు పూయించారు.

 

టెక్నిషియన్స్:
టెక్నికల్ పరంగా.. దేవి శ్రీ ప్రసాద్ అందించిన పాటలు పర్వాలేదనిపిస్తాయి. సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ బావుంది. తమన్నా, మెహ్రీన్‌లను గ్లామరస్‌గా చూపించారు. వెంకీని చాలా యంగ్‌గా చూపించారు. ఎడిటర్ తమ్మిరాజు సెకండాఫ్‌లో కొన్ని సీన్లను ట్రిమ్ చేసి ఉంటే బాగుండేది. శిరీష్, లక్షణ్‌లు దిల్ రాజు బ్యానర్‌లో ఈ చిత్రాన్ని రూపొందించడంతో నిర్మాణ విలుకలు రిచ్‌గా ఉన్నాయి.

 

దర్శకుడు అనిల్ రావిపూడి మరోసారి సక్సెస్ అయ్యాడు. తెలిసిన కథనే తెలివైన స్క్రీన్ ప్లేతో నడిపించాడు. ముఖ్యంగా కామెడీ సీన్లు డీల్ చేయడంలో ఈ దర్శకుడు ఆరితేరిపోయాడు. ఆయన సినిమాలను ఇదే నిలబెడుతుంది. తాజాగా ఎఫ్ 2 కూడా అంతే. ప్ర‌తీ సీన్‌లోనూ న‌వ్వు తెప్పించే స‌త్తా ఉన్న ద‌ర్శ‌కుడిగా గుర్తింపు పొందాడు అనిల్. సెకండాఫ్‌పై కూడా కాస్త దృష్టి పెట్టి ఉంటే సినిమా స్థాయి మ‌రోలా ఉండేది.

 

ఫైనల్‌గా:
ఎఫ్ 2.. ఫ‌స్టాఫ్ ఫ‌న్.. సెకండాఫ్ కాస్త ఫ్ర‌స్టేష‌న్.. పూర్తి ఫస్ట్రేషన్‌లో ఉన్న మూవీ లవర్స్‌కి ఈ ‘F2’ చిత్రం ఫుల్ ఫన్ అండ్ రిలీఫ్ ఇస్తుంది. ఫ్యామిలీతో కలిసి సరదాగా చూసి రావొచ్చు.

 

ప్లస్‌ పాయింట్స్‌ :
నటీనటుల నటన
సినిమాటోగ్రఫి
డైలాగ్స్‌

 

మైనస్‌ పాయింట్స్‌ :
సెకండాఫ్‌లో కొన్ని సీన్స్‌
పాటలు

 

రేటింగ్ : 3/5

Tags : Anil ravipudif2fun and frustrationMehreenmoive reviewMovie RatingTamannaahVarun Tejvenkatesh

Also read

Use Facebook to Comment on this PostMenu