10/25/19 3:29 PM

హీరోకి చెడ్డ పేరు తెచ్చిన ఫ్యాన్స్

Hero Fans Violence In Tamilnadu

ఇష్టమైన వారిపై అభిమానం పెంచుకోవడం తప్పు లేదు. వారిని ఆరాధించడం నేరం కాదు. హీరోలు, ఫ్యాన్స్ మధ్య అలాంటి రిలేషన్ ఉంటుంది. ఇది కామన్. ఇందులో ఎవరికీ ఎలాంటి ఇబ్బంది లేదు. పలనా హీరోకి మేము వీరాభిమానులం అని ఘనంగా చెప్పుకోవడంలో ఎలాంటి తప్పు లేదు. ఎవరికీ బాధ లేదు. కానీ అభిమానం పేరుతో విధ్వంసం చేయడం ఎంతవరకు కరెక్ట్? అభిమానం ముసుగులో అల్లర్లకు పాల్పడటం, హింసకు దిగడం ఎంతవరకు సబబు? అప్పుడప్పుడు కొందరు హీరోల ఫ్యాన్స్ చేసే పనులు.. ఆ హీరోలకు బ్యాడ్ నేమ్ తెస్తున్నాయి. వారిని చిక్కుల్లో పడేస్తున్నాయి. తాజాగా తమిళ సూపర్ స్టార్ విజయ్ కి ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. విజయ్ ఫ్యాన్స్ అని చెప్పుకునే కొందరు చేసిన రచ్చ హాట్ టాపిక్ గా మారింది.

 

మ్యాటర్ ఏంటంటే.. విజయ్ హీరోగా తెరకెక్కిన సినిమా బిజిల్. ఈ సినిమా సందర్భంగా.. తమిళనాడులో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. విజయ్ ఫ్యాన్స్ చేసిన బీభత్సం అంతా ఇంతా కాదు. బిజిల్ సినిమా ప్రివ్యూలను రద్దు చేయడంతో.. అభిమానుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. దీంతో.. వారు రెచ్చిపోయారు. బీభత్సం సృష్టించారు. విధ్వంసానికి పాల్పడ్డారు. థియేటర్ పై దాడి చేశారు. ధ్వంసం చేశారు. ఆ తర్వాత రోడ్డు మీద పడ్డారు. చుట్టుపక్కల ఉన్న దుకాణాలను, పోలీసు వాహనాలను కూడా ధ్వంసం చేశారు.

 

మా అభిమాన నటుడి సినిమా ప్రివ్యూ లేకుండా చేస్తారా అంటూ.. ఫ్యాన్స్ పెద్ద గొడవే చేశారు. క్రిష్ణగిరి ఏరియాలోని థియేటర్లపై విజయ్ అభిమానులు విరుచుకుపడ్డారు. థియేటర్‌లోని సీసీ కెమెరాలు, అలాగే.. పోలీస్ బారికేడ్లపై తమ ప్రతాపం చూపించారు. పోలీసులు కట్టడి చేసినా.. ఆగకపోవడంతో.. పరిస్థితి శ్రుతిమించింది. దీంతో ఎంటరైన అదనపు పోలీసులు.. విజయ్ ఫ్యాన్స్‌ని లాఠీఛార్జ్ చేసి చెదరొట్టారు. వారిని అరెస్ట్ చేశారు.

 

‘బిజిల్’ ప్రత్యేక షోలు ప్రదర్శించుకోవడానికి తమిళనాడు ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. ఈ మేరకు గురువారం రాత్రి ఆదేశాలు జారీ చేసింది. దీంతో తమిళనాడులోని చాలా చోట్ల గురువారం అర్ధరాత్రి నుంచే షోలు ప్రారంభమైపోయాయి. అయితే, జిల్లా కేంద్రం కృష్ణగిరిలో మిడ్‌నైట్ షో వేయలేదు. తమకు మిడ్‌నైట్ షో వేయాలని ఫ్యాన్స్ డిమాండ్ చేసినా.. థియేటర్ యాజమాన్యం కుదరదని చెప్పడంతో అభిమానులు రెచ్చిపోయారు.

 

థియేటర్‌ను ధ్వంసం చేశారు. సినిమా హాల్ సమీపంలో ఉన్న కూడలి దగ్గర పోలీసులు ఏర్పాటుచేసిన బారికేడ్లను విరగ్గొట్టారు. అంతటితో ఊరుకోలేదు. స్థానికంగా ఉన్న దుకాణాలపై ప్రతాపం చూపారు. వాటిని ధ్వంసం చేసి నిప్పు కూడా పెట్టారు. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. విజయ్ అభిమానులపై లాఠీఛార్జి చేశారు. దీంతో మరింత రెచ్చిపోయిన అభిమానులు.. పోలీస్, మున్సిపాలిటీ వాహనాలను కూడా ధ్వంసం చేశారు. ‘బిజిల్’ ప్రత్యేక షో వేయాల్సిందే అని హంగామా చేశారు. ఎలాగో అలా వారిని చెదరగొట్టిన పోలీసులు, సమీపంలోని సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలించి, 37 మందిని అదుపులోకి తీసుకున్నారు.

 

అభిమానులు చేసిన పని చర్చనీయాంశంగా మారింది. వారి చర్యను స్థానికులు తీవ్రంగా తప్పుపట్టారు. ఇదేం అభిమానం అని మండిపడుతున్నారు. అభిమానం ఉండటంలో తప్పు లేదు.. కానీ ఇలా విధ్వంసాలు సృష్టించడం ఏంటని, అల్లర్లకు పాల్పడటం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హీరో విజయ్ కి చెడ్డ పేరు తెచ్చిపెట్టారని వాపోతున్నారు. అభిమానం అంటే అల్లర్లకు పాల్పడటం, విధ్వంసాలు సృష్టించడమేనా అని అడుగుతున్నారు. ఏ హీరో కూడా ఇలాంటి పనికిమాలిన పనులు చెయ్యమని తన అభిమానులకు చెప్పడని అంటున్నారు. విజయ్ పేరు చెప్పుకుని కొందరు అభిమానులు చేసిన పని.. హీరో విజయ్ ని తలదించుకునేలా చేసిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Tags : bigilfanshero vijaykrishnagirirampageruckustamilnaduVIOLENCE

Also read

Use Facebook to Comment on this Post



Menu