04/23/19 8:56 PM

షకలక శంకర్ చనిపోయాడని వార్తలు : అసలు నిజం ఇదే

Iam Alive, Shakalaka Shankar on Death Rumours

ఈ మధ్య కాలంలో బతికుండగానే సెలబ్రిటీలు చంపేయడం కామన్ గా మారింది. సోషల్ మీడియా పుణ్యమా అని నిక్షేపంగా బతికున్నోళ్లను చంపేస్తున్నారు. కొన్ని రోజుల కనిపించకపోతే చాలు.. ఆ వ్యక్తి మరణించాడు అనే వార్తలు పుట్టిస్తున్నారు. సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఇలాంటి వార్తల వల్ల సదురు వ్యక్తులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. మేమే బతికే ఉన్నాము అని చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు ఇలాంటి వార్తల బారిన పడ్డారు. ఇప్పుడు షకలక శంకర్ వంతు వచ్చింది.

 

జబర్దస్త్ షో ద్వారా కమెడియన్ గా పాపులర్ అయి ప్రస్తుతం హీరోగా ఎదిగిన షకలక శంకర్.. వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. అలాంటి షకలక శంకర్ గురించి సోషల్ మీడియాలో ఓ రూమర్ విపరీతంగా వైరల్ అయ్యింది. శంకర్ చనిపోయాడని వార్తలు హల్‌చల్ చేశాయి. ఈ క్రమంలో జబర్దస్త్ నటుడు గెటప్ శీను క్లారిటీ ఇచ్చాడు. షకలక శంకర్‌ బతికే ఉన్నాడు.. కావాలంటే చూడండి అని చెబుతూ వీడియోను విడుదల చేశాడు.

 

తనకు ఏదో అయిపోయింది అంటూ వస్తున్న వార్తలు అవాస్తవం అని శంకర్ చెప్పాడు. తన హార్ట్ అటాక్ వచ్చిందని, తాను చనిపోయాను అని రూమర్లను ప్రచారం చేసిన వాళ్లపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాడు. ”ఎవడు బే వాడు మీకు రావేంట్రా రోగాలు.. ఎక్కడి నుంచి వస్తార్రా మీరంతా.. మా పని మమ్మల్ని ప్రశాంతంగా చేసుకోనివ్వండ్రా’ అంటూ శంకర్ వార్నింగ్ ఇచ్చాడు. ఇటువంటి వార్తలను క్రియేట్ చేయొద్దని గెటప్ శీను రిక్వెస్ట్ చేశాడు. ఇవాళ షకలక శంకర్ పెళ్లి రోజు అని చెప్పాడు. పెళ్లి రోజున అతడు చనిపోయాడని ప్రచారం చెయ్యడం బాధ కలిగించిందన్నాడు. మేమంతా షూటింగ్ లో బిజీగా ఉన్నామని వీడియోలో చెప్పాడు. శంకర్ తో కలిసి వీడియో షూట్ చేసి సోషల్ మీడియాలో పెట్టాడు. గతంలో మహేష్ విషయంలోనూ ఇలాంటి రూమర్లే క్రియేట్ చేశారని గెటప్ శీను వాపోయాడు. మహేష్ పుట్టిన రోజునే.. మహేష్ మరణించాడు అనే వార్తలు ప్రచారం చేశారని గెటప్ శీను సీరియస్ అయ్యాడు. దయచేసి ఇలాంటి పుకార్లు పుట్టించొద్దని కోరాడు.

 

ఇదే విషయమై మరో ప్రముఖ నటుడు జెమినీ సురేష్ కూడా ఫేస్‌బుక్‌లో తన ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోస్ట్ పెట్టాడు. మా శంకర్ చనిపోయాడు అంటూ యూట్యూబ్, సోషల్ మీడియాలో వార్తా కథనాలు రావటం చాలా దురదృష్టకరం అన్నాడు. రేటింగ్స్ కోసం ఇంత దారుణానికి దిగజారడం బాధ కలిగించిందన్నాడు. ఈ రోజు మొత్తం మేమంతా షూటింగ్‌లోనే ఉన్నామని, మా మధ్యే షూటింగ్ లో ఉన్న శంకర్ మీద ఇలాంటి వార్తలు రావడం అన్యాయం అని వాపోయాడు. మీకు నిత్యం నవ్వులని పంచి, మీరు అందరూ ఆరోగ్యంగా ఉండాలని మీ సంతోషమే మా బలం అనుకుంటూ నటులుగా మీ ఇంటిలోకి, మీ మనసులోకి వచ్చి మీ ఇంటి బిడ్డల్లా పెరుగుతున్న మమ్మల్ని ఇలా ప్రతి క్షణం చంపేయకండి అని రిక్వెస్ట్ చేశాడు. మొత్తంగా తాను బతికే ఉన్నా అని చెప్పుకునే దుస్థితిని షకలక శంకర్ కి తీసుకొచ్చారు.

Tags : death Rumorsgetup srinuIam AliveJabardastShakalaka shankarshakalaka shankar dies

Also read

Use Facebook to Comment on this Post



Menu