02/9/18 1:35 PM

ఇంటెలిజెంట్ – సినిమా రివ్యూ అండ్ రేటింగ్

Intelligent movie REVIEW

నటీనటులు: సాయి ధరం తేజ్, లావణ్య త్రిపాఠి, రాహుల్ దేవ్ తదితరులు

సంగీతం: తమన్

సినిమాటోగ్రఫీ: విశ్వేశ్వర్

ఎడిటింగ్: గౌతమ్ రాజు

నిర్మాత: సి.కల్యాణ్

దర్శకుడు: వి.వి.వినాయక్

 

కథ: 

ఒక సాఫ్ట్ వేర్ కంపనీను నడుపుతూ ప్రజలకు తనవంతు సహాయం చేయాలని ఒక ట్రస్ట్ ను నడుపుతుంటాడు నందకిషోర్(నాజర్). అతడిని ఇన్స్పిరేషన్ గా తీసుకొని పెరిగిన తేజు(సాయి ధరం తేజ్) సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా అతడి కంపనీలోనే పని చేస్తుంటాడు. నందకిషోర్ ఆఫీస్ ను తన సొంతం చేసుకోవడానికి మాఫియా డాన్ విక్కీభాయ్(రాహుల్ దేవ్) ప్రయత్నిస్తుంటాడు. దీనికోసం నందకిషోర్ ను చంపేసి సూసైడ్ గా సృష్టిస్తాడు. కంపనీ తన పేరు మీదకు వచ్చేలా చేసుకుంటాడు. అతడికి రాజకీయపలుకుబడి ఉండడంతో పోలీసులు కూడా ఏం చేయలేకపోతారు. దీంతో విక్కీభాయ్ ను అంతం చేయడానికి తేజు.. ధర్మాభాయ్ గా అవతారమెత్తుతాడు. మరి అనుకున్నట్లుగా విక్కీభాయ్ ను చంపాడా..? చివరకు కంపెనీ  ఎవరికి దక్కుతుంది..? సినిమాలో లావణ్యత్రిపాఠి క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది..? అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

 

నటన:

వరుస పెట్టి కమర్షియల్ సినిమాలు చేస్తోన్న సాయి ధరం తేజ్ తన మొనటానీను బ్రేక్ చేసి ఇక సినిమాలు చేయడేమో అనిపిస్తుంది. ఈ సినిమాను ఎన్నుకొని అతడు చాలా పెద్ద తప్పు చేశాడు. మొదట్లో చాలా కాన్ఫిడెంట్ గా కనిపించిన తేజు ఈ సినిమాలో మాత్రం అంత యాక్టివ్ గా లేడు. డైలాగ్ డెలివేరీ, ఎక్స్ ప్రెషన్స్ అన్నీ కూడా అనాసక్తిగా చేసేశాడనే భావన కలుగుతుంది. లావణ్య త్రిపాఠి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఆమె పాత్రకు అసలు ప్రాముఖ్యత లేదు. బ్రహ్మానందం, తాగుబోతు రమేష్, సప్తగిరి, రఘుబాబు, ప్రధ్వీ ఇలా తారాగణం పరంగా ఏమాత్రం లోటు లేదు కానీ,  ఏ ఒక్కరి టాలెంట్ ను సరిగ్గా వాడుకోక పోగా, వారందరి గౌరవాన్ని రవ్వంత తగ్గేటట్లుగా పాత్రలను తీర్చిదిద్దాడు. విలన్ గా రాహుల్ దేవ్ బాగానే నటించాడు.

 

కథనం, దర్శకత్వం: 

పక్కా కమర్షియల్ సినిమాలను తెరకెక్కించడంలో సిద్ధహస్తుడైన వి.వి.వినాయక్ ఈసారి కూడా అటువంటి సినిమానే తెరకెక్కించాడు. ఆకుల శివ అందించిన ఈ ‘ఇంటెలిజెంట్’ కథలో ఎక్కడా ఇంటెలిజెన్స్ అనేది కనిపించదు. ఆ కథను మరింత బలహీనంగా తెరపై ఆవిష్కరించాడు దర్శకుడు.

ప్రథమార్ధమే గత్తర గత్తరగా ఉందనిపిస్తే, ద్వితీయార్ధం మరింతగా విసిగిస్తుంది. విమానాన్ని డ్రోన్ తో పక్కకు మళ్లించే సన్నివేశం ఏదైతే ఉందో వర్ణనాతీతం. సినిమాలో అటువంటి సన్నివేశాలు చాలానే ఉన్నాయి. ఇక పతాక సన్నివేశాలను రొటీన్ కే రొటీన్ అనుకుంటుంటే వాటిని మరింత సాగదీసి చూపించి ప్రేక్షకులను అసహనానికి గురి చేశారు. ఒక కమర్షియల్ సినిమాకు కావల్సిన అంశాలన్నీ ఈ సినిమాలో ఉన్నాయి కానీ ఏ ఒక్క ఎలిమెంట్ కూడా ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేయదు.

 

సాంకేతికవర్గం పనితీరు: 

తమన్ అందించిన నేపధ్య సంగీతం సినిమాకు హైలైట్ గా నిలిచింది. పాటలు విజువల్ గా బాగున్నప్పటికీ వినడానికి మాత్రం బాలేవు. సాహిత్యం ఎక్కడా వినిపించదు. మెగాస్టార్ నటించిన ‘చమకు చమకు చామ్’ పాటను రీమిక్స్ చేసి పెద్ద పొరపాటు చేశారు. ఇకనైనా తేజు రీమిక్స్  పాటలకు దూరంగా ఉంటే మంచిది. సినిమాటోగ్రఫీ పర్వాలేదనిపిస్తుంది. ఎడిటింగ్ వర్క్ బాలేదు. క్వాలిటీ పరంగా రాజీ పడకుండా పెద్ద సినిమాలకు తీసిపోని నిర్మాణ విలువలు కనిపిస్తాయి.

 

ఒక్క మాటలో చెప్పాలంటే.. ఈ ఇంటెలిజెంట్ చూస్తే మన మైండ్ పోతుంది. 

అంకెల్లో చెప్పాలి అంటే: 2/5

 

Tags : INTELLIGENT MOVIE REVIEW AND RATINGLavanya TripathiSai Dharam TejV.v vinayak

Also read

Use Facebook to Comment on this PostMenu