11/25/18 12:32 PM

కన్నడ నట దిగ్గజం ఇక లేరు

Kannada Rebel Star Ambareesh Passes Away

ప్రముఖ సినీనటుడు, కన్నడ రెబెల్ స్టార్, కాంగ్రెస్ నేత అంబరీష్‌(66) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న అంబరీష్ బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ శనివారం(నవంబర్ 24) రాత్రి తుదిశ్వాస విడిచారు. అంబరీష్ తెలుగు ప్రేక్ష‌కుల‌కు కూడా సుప‌రిచితం అయిన న‌టుడు. అంబ‌రీష్ మృతికి క‌న్న‌డ సినిమా ప‌రిశ్ర‌మ‌తో పాటు ద‌క్షిణాది ఇండ‌స్ట్రీ కూడా సంతాపం ప్రకటించింది. క‌న్న‌డ సినీ రంగంలో తిరుగులేని తార‌గా వెలుగొందారు అంబ‌రీష్. వంద‌ల సినిమాల్లో న‌టించారు.

 

నాగహరువు సినిమాతో 1972లో సినీరంగ ప్రవేశం చేశారు అంబరీష్. నటుడిగా వెండితెరపై ఓ వెలుగు వెలిగిన అంబరీష్ 1994లో రాజకీయ రంగ ప్రవేశం చేశారు. మన్మోహన్ ప్రభుత్వంలో సమాచార ప్రసారాల శాఖ సహాయ మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహించారు. ఆయనకు భార్య సుమలత, కుమారుడు అభిషేక్ గౌడ ఉన్నారు. నటి సుమలత తెలుగు తెరకు సుపరిచితురాలే. ఆమె అన్ని దక్షిణాది భాషల్లో, హిందీ సినిమాల్లో సినిమాలు చేశారు.

 

1952 మే 29న అప్పటి మైసూర్‌ రాష్ట్రంలోని మాండ్యలో అంబరీష్ జన్మించారు. కన్నడ రెబల్ స్టార్‌గా పేరొందిన అంబరీష్ దాదాపు ఐదు దశాబ్దాల సినీ కెరీర్‌లో 200కు పైగా సినిమాల్లో నటించి మెప్పించారు. పలు తెలుగు సినిమాల్లోనూ కీలకపాత్రలు పోషించారు. ఆయన చివరి సినిమా ‘అంబి నింగే వయస్సాయ్తో’ సైతం బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది.

 

1998, 1999, 2004లో మాండ్య లోక్‌సభ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. 2013లో సిద్దరామయ్య కేబినెట్‌లో గృహనిర్మాణ శాఖ మంత్రిగా పనిచేశారు. అయితే అనారోగ్య కారణాలతో గత కొంతకాలం నుంచి అంబరీష్, సినిమాలు, రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. తెలుగులో చిరంజీవి శ్రీమంజునాథ సినిమాలో రాజుగా నటించారు. ఆ సినిమాలో భార్య సుమలతతో కలిసి నటించారు. అంబరీష్ అస‌లు పేరు మాళ‌వల్లి హుచ్చే గౌడ అమ‌ర్ నాథ్. సినిమాల్లోకి వ‌చ్చిన త‌ర్వాత అంబ‌రీష్ అయ్యారు.

 

క‌న్న‌డ సినిమా ఇండ‌స్ట్రీ గ‌తిని మార్చేసిన పాండ‌వార‌ల్లి పాండ‌వురు, శుభ‌మంగ‌ళ‌, మాసంద‌, రంగ‌నాయ‌కి లాంటి ఎన్నె సంచ‌ల‌న సినిమాలు చేసారు అంబ‌రీష్. ఆ త‌ర్వాత రెబ‌ల్ స్టార్‌గా అభిమానుల గుండెల్లో చెర‌గ‌ని ముద్ర వేసుకున్నారు. సినిమా హీరోగానే కాదు.. రాజ‌కీయ నాయ‌కుడిగా కూడా ఈయ‌న సంచ‌ల‌న‌మే. 1994లో రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన అంబ‌రీష్.. మూడుసార్లు ఎంపీగా.. ఓ సారి మంత్రిగానూ ప‌ని చేసారు. రాజ‌కీయ నాయ‌కుడిగా కూడా ప్ర‌జ‌ల ద‌గ్గ‌ర చాలా మంది పేరు సంపాదించుకున్నారు‌.

 

క‌న్న‌డ‌లో మ‌రో లెజెండ‌రీ న‌టుడు విష్ణువ‌ర్ధ‌న్‌కు ప్రాణ స్నేహితుడు అంబ‌రీష్. ఆయ‌న‌తో ఎన్నో సినిమాల్లో క‌లిసి న‌టించాడు. ఆ త‌ర్వాత కూడా ఇద్ద‌రూ క‌న్న‌డ సినీ పరిశ్రమను ఏలారు.

 

లెజెండ‌రీ న‌టుడు రాజ్‌కుమార్ పేరు మీదున్న రికార్డును త‌న పేర రాసుకున్నారు అంబ‌రీష్. మ‌రో దివంగ‌త న‌టుడు విష్ణువ‌ర్ధ‌న్ తెలుగు, త‌మిళ‌, హిందీ, మ‌ళ‌యాల భాష‌ల్లో క‌లిపి 230 సినిమాల్లో హీరోగా న‌టించారు. అయితే క‌న్న‌డ‌లో మాత్ర‌మే అత్య‌ధిక సినిమాల్లో హీరోగా న‌టించిన రికార్డు మాత్రం అంబ‌రీష్‌దే. ఆయ‌న కెరీర్‌లో ఎన్నో మ‌రుపురాని సినిమాలు ఉన్నాయి.

Tags : ambareesh diesambareesh passesawayambarish dieskannada actorkannada rebel star

Use Facebook to Comment on this Post



Menu