12/7/18 10:36 PM

”కవచం” సినిమా రివ్యూ

kavacham movie review

టైటిల్ : కవచం
జానర్ : యాక్షన్ థ్రిల్లర్‌
నటీనటులు : బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌, కాజల్‌, మెహరీన్‌, నీల్‌ నితిన్‌ ముఖేష్‌
మ్యూజిక్ : తమన్‌
డైరెక్టర్ : శ్రీనివాస్‌ మామిళ్ల
ప్రొడ్యూసర్ : నవీన్‌ శొంఠినేని

 

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజల్, మెహ్రీన్ హీరో హీరోయిన్లుగా నటించిన ‘కవచం’ మూవీ నేడు (డిసెంబర్ 7) విడుదలైంది. శ్రీనివాస్ మామిళ్ల అనే కొత్త దర్శకుడిని ఈ చిత్రం ద్వారా ఇండస్ట్రీకి పరిచయం చేయగా.. వంశధార క్రియేషన్స్ బ్యానర్‌లో నవీన్ శొంఠినేని ఈ చిత్రానికి ప్రొడ్యూస్ చేశారు. కెరీర్‌ ప్రారంభం నుంచి భారీ బడ్జెట్‌ సినిమాలు చేస్తూ వస్తున్న యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ ఈ సారి రూట్‌ మార్చి ఓ మీడియం రేంజ్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇప్పటి వరకు చేసిన సినిమాలకు పాజిటివ్‌ టాక్‌ వచ్చినా కమర్షియల్‌గా హిట్ అనిపించుకోలేకపోవటంతో ఈ సారి ఎలాగైనా ఓ భారీ హిట్ కొట్టాలన్న కసితో కవచం సినిమా చేశాడు. మరి శ్రీనివాస్‌కు సక్సెస్‌ దక్కిందా? అనేది తెలియాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే..

 

కథ:
కొండ విజయ్ (సాయి శ్రీనివాస్) విశాఖపట్నంలో ఎస్ఐ‌. ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ కావాలనేది అతడి డ్రీమ్. చిన్నప్పుడే తండ్రిని కోల్పోవడంతో తల్లితో కలిసి ఉంటాడు. సాఫీగా సాగిపోతున్న అతని జీవితంలోకి సంయుక్త (మెహ్రీన్) ప్రవేశిస్తుంది. విలన్లు ఆమెను వెంటాడుతుండగా వాళ్ల నుండి కాపాడి ఇంటికి తీసుకువెళ్తాడు. అప్పుడే తన తల్లికి పెద్ద యాక్సిడెంట్ కావడంతో ఆపరేషన్‌ కోసం రూ. 50 లక్షలు అవసరమవుతాయి. ఎస్ సొల్యుషన్స్ సంస్థకు వారసురాలైన తనను కిడ్నాప్ చేసినట్టుగా నాటకం ఆడితే వాళ్ల మామయ్య (ముఖేష్ రుషి) యాభై లక్షలు ఇస్తాడని నాటకం ఆడమంటుంది సంయుక్త. మరో దారి లేక సంయుక్తతో కిడ్నాప్ నాటకం ఆడతాడు విజయ్.

 

అక్కడే కీలక మలుపు ఉంటుంది. కిడ్నాప్ తర్వాత విజయ్.. సంయుక్తని విడిచిపెట్టినా కిడ్నాపర్‌లు ఇంకా వదిలిపెట్టలేదని టీవీలో చూసి షాక్ అవుతాడు . దీంతో ఆ కిడ్నాప్ చేసింది ఎస్ఐ విజయ్ అని పోలీసులకు తెలియడంతో ఏసీపీ శరత్ చంద్ర (హరీష్ ఉత్తమన్) అతడ్ని పట్టుకునే ప్రయత్నం చేస్తాడు. పోలీసుల నుండి తప్పించుకుని తిరుగుతున్న విజయ్‌కి అప్పుడే అసలు నిజం తెలుస్తోంది. అసలు ఎస్ సొల్యుషన్స్ సంస్థ వారసురాలిగా తనకు పరిచయమైనది సంయుక్త (మెహ్రీన్) కాదని.. ఆమె పేరు లావణ్య (మెహ్రీన్) అని తెలుసుకుంటాడు. అసలు సంయుక్త (కాజల్) తాను గతంలో ప్రేమించి.. కనిపించకుండా పోయిన అమ్మాయే అని తెలుసుకుంటాడు. ఇంతకీ లావణ్య ఎవరు? సంయుక్త ఎవరు? లావణ్య.. సంయుక్తగా ఎందుకు మారింది? దీని వెనుక ఉన్నది ఎవరు? దాన్ని విజయ్ ఎలా బయట పెట్టగలిగాడు అన్నదే మిగతా కథ.

 

నటీనటులు:
కొత్త దర్శకుడు కొత్త కంటెంట్‌తో మాయ చేస్తాడని థియేటర్‌కి వెళ్లిన ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టేశాడు శ్రీనివాస్ మామిళ్ల. తొలి పది నిమిషాల్లోనే సినిమా ఎలా ఉండబోతుందో హింట్ ఇచ్చేశాడు. ‘ఎవడి పేరు ముందైనా ఇంటి పేరు ఉంటుంది. నా పేరు ముందు ఎన్‌కౌంటర్ ఉంటుంది’ లాంటి భారీ డైలాగ్‌లో హీరో ఎంట్రీ ఇవ్వడం వెంటనే.. హీరోయిజాన్ని ఎలివేట్ చేస్తూ ఇంట్రో సాంగ్.. ఆ వెంటనే హీరోయిన్ వెంటాడుతూ విలన్లు రావడం.. వాళ్లను హీరో చితక్కొట్టేసి హీరోయిన్‌ని కాపాడేయడం. ఇలాంటి నాటకీయత చొప్పించిన బోలెడు సీన్లతో కవచాన్ని నింపేశాడు దర్శకుడు.

 

కోట్ల ఆస్తికి ఒక్కరే వారసురాలు.. ఆ ఆస్థిని కాజేయాలిని చూసే బంధువులు.. హీరో ఆమెను కాపాడటం.. ఆమె హీరో ప్రేమలో పడటం ఇలాంటి పాత చింతకాయ కథల్ని బ్లాక్ అండ్ వైట్ కాలం నుండి మన దర్శకులు ప్రేక్షకుల నెత్తిన రుద్దుతూనే ఉన్నారు. ఇప్పుడు కొత్త దర్శకుడు ఇదే కథతో మళ్లీ నాటి కథల్ని గుర్తు చేశాడు తప్పితే కొత్తగా చెప్పిందేమీ లేదు. హీరో విలన్‌ల మధ్య నడిచే మైండ్ గేమ్‌లో కూడా హీరోయిజాన్ని పండించడానికి అక్కర్లేని లాజిక్కుల్ని తెరపై చూపించే ప్రయత్నం చేశారు. కథలో చాలా మలుపులు ఉన్నప్పటికీ.. వాటిని ప్రేక్షకుడు ముందే ఊహించేయడంతో ట్విస్ట్‌లలో పస లేకుండా పోయింది. దీనికి తోటు క్లైమాక్స్‌లో హీరోయిన్‌‌ని, హీరో తల్లిని ఊరు చివర ఫ్యాక్టరీలో విలన్ బంధించడం.. హీరోకి ఫోన్ చేయడం.. హీరో వచ్చి విలన్‌ని చితక్కొట్టి వాళ్లను కాపాడటం.. చివర్లో పోలీసులు రావడం ఇదంతా కొత్త దర్శకుడు ఇంకా పాతకాలంలోనే ఉండిపోయాడనిపిస్తుంది.

 

హీరోగా 5 సినిమాలు చేసినప్పటికీ బెల్లంకొండ వారసుడు ఇంకా నటనను నేర్చుకుంటూనే ఉన్నాడు. డైలాగ్‌లో పస ఉన్నప్పటికీ డైలాగ్ డెలివరీలో తేలిపోతూ.. హావభావాల్ని దరికి చేరనీయడం లేదు బెల్లంకొండ. అయితే పోలీస్ ఆఫీసర్‌కి తగ్గ ఫిజిక్ ఉండటంతో ఆ పాత్రకు పర్ఫెక్ట్‌గా సరిపోయాడు. అయితే డైలాగ్‌లు చెప్పడానికి ఎప్పటిలాగే ఇబ్బందిపడ్డాడు. ఇక హీరోయిన్‌గా నటించిన కాజల్.. నటన పరంగా తనకు తిరుగులేదని స్టార్ హోదాను కాపాడుకునే ప్రయత్నమైతే చేసింది. అయితే రొటీన్ కథలో ఆమె నటనకు ఆస్కారం లేకపోయింది. మరో హీరోయిన్ మెహ్రీన్ ఉన్నది కాని.. ఆమెది అంత ప్రాధాన్యత ఉన్న పాత్ర కాకపోగా.. నెగిటివ్ షేడ్స్‌లో చూపించారు. ముఖేష్ రుషి, పోసాని క్రిష్ణ మురళి లాంటి సీనియర్ నటులు ఉన్నా వాళ్లను పెద్దగా ఉపయోగించుకోలేకపోయాడు దర్శకుడు.

 

విశ్లేషణ:
ఇక టెక్నికల్ పరంగా తమన్ పాటలతో పర్వాలేదనిపించినా.. బ్యాగ్రౌండ్ మ్యూజిక్‌పై పెద్దగా శ్రద్ధ పెట్టలేదు. చోటా కె నాయుడు సినిమాటోగ్రఫీ ఈ సినిమాకి ప్లస్ అయ్యింది. విశాఖ అందాలను కెమెరాలో బాగా చూపించగలిగారు. పోలీస్ ఆఫీసర్‌గా శ్రీనివాస్‌ను స్టైలిష్‌గా చూపించారు. కాజల్‌ని మరింత అందంగా చూపించారు. సినిమా రన్ టైమ్ కూడా ఎక్కువగా ఉండటంతో చోటా కె ప్రసాద్ కత్తెరకు పనిచెప్పాల్సింది. అబ్బూరి రవి డైలాగ్స్ అక్కడక్కడా పేలాయి. స్క్రీన్స్ ప్లే మాత్రం గజిబిజి గందరగోళంలా ఉంది. లేనిపోని ట్విస్ట్‌లు, అక్కర్లేని సీన్లు, పాత్ర పరిచయాలతో ప్రేక్షకుల్ని కన్ఫ్యూజ్ చేశారు. ఓవరాల్‌గా బెల్లంకొండని ‘కవచం’ కాపాడలేకపోయింది. క్యాస్టింగ్ గట్టిదైనా ‘కవచం’ మాత్రం చాలా పలచగా ఉంది.

 

ప్లస్‌ పాయింట్స్‌ ;
యాక్షన్‌ సీన్స్‌
కథలో మలుపులు

 

మైనస్‌ పాయింట్స్‌ ;
కథ
స్క్రీన్ ప్లే

 

రేటింగ్: 2/5

Tags : Bellamkonda Sai Sreenivasdirector Srinivas MamillaKajal Aggarwalkavacham telugu movie ratingKavacham Telugu Movie Reviewmehreen pirzadaMukesh

Also read

Use Facebook to Comment on this Post



Menu