03/29/19 6:19 PM

‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ సినిమా రివ్యూ

Lakshmis NTR Movie Review

టైటిల్ : లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌
జానర్ : బయోపిక్
నటీనటులు : విజయ్ కుమార్‌, యజ్ఞ శెట్టి, శ్రీ తేజ్‌
మ్యూజిక్ : కల్యాణీ మాలిక్‌
డైరెక్టర్ : రామ్ గోపాల్‌ వర్మ, అగస్త్య మంజు
నిర్మాత : రాకేష్‌ రెడ్డి, దీప్తి బాలగిరి

 

వివాదాస్పద సినిమాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన మరో బయోపిక్ ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్’‌. ఎన్టీఆర్ జీవితం నేపథ్యంగా ఈ సినిమా తీశాడు. అది కూడా లక్ష్మీపార్వతి కోణం నుంచి. ఎన్టీఆర్‌ జీవితంలోకి లక్ష్మీపార్వతి ప్రవేశించిన తర్వాత జరిగిన సంఘటనలు.. లక్ష్మీపార్వతికి ఎదురైన అవమానాలు, ఎన్టీఆర్‌, లక్ష్మీ పార్వతిల మధ్య ప్రేమానురాగాలను ఈ సినిమాలో ప్రధానంగా చూపించాడు. ముఖ్యంగా వెన్నుపోటు అంశంపై ఎక్కుక ఫోకస్ పెట్టాడు. చంద్రబాబుని విలన్ గా, లక్ష్మీపార్వతిని దేవతగా చూపించారని టీడీపీ నాయకులు ఆరోపించారు. ఎన్నికల వేళ టీడీపీని దెబ్బకొట్టేందుకు వర్మ ఈ సినిమా తీశారని చెప్పారు. ఏపీలో సినిమా రిలీజ్‌పై స్టే విధించారు. దీంతో ఏపీ మినహా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా మార్చి 29వ తేదీ విడుదలైంది. మరి వర్మ చెప్పినట్టుగా నిజంగా నిజాలనే తెరకెక్కించాడా..? చంద్రబాబుని విలన్ గా చూపించాడా? ఎన్టీఆర్‌ అసలైన బయోపిక్‌ ఈ సినిమానేనా..? ఇది తెలుగుదేశం పార్టీకి మైనస్ గా మారనుందా? తెలుసుకోవాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.

 

ఎపుడైతే బాలకృష్ణ..వాళ్ల నాన్న ఎన్టీఆర్ జీవిత కథపై సినిమా చేస్తున్నా అని అనౌన్స్ చేసాడో..అప్పుడే రామ్ గోపాల్ వర్మ..‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాను అనౌన్స్ చేశాడు. బాలకృష్ణ..తన తండ్రి జీవితాన్ని 2 భాగాలుగా తెరకెక్కించాడు. అందులో మొదటి భాగాన్ని ఎన్టీఆర్ ఫస్ట్ టైమ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన జనవరి 9న రిలీజ్ చేస్తే..రామ్ గోపాల్ వర్మ మాత్రం తెలుగు దేశం వ్యవస్థాపక దినోత్సవమైన మార్చి 29న అనుకోకుండా రిలీజ్ చేయడం జరిగింది.

 

స్టోరీ విషయానికొస్తే..1989 ఎన్నికల తర్వాత అధికారం కోల్పోయిన తర్వాత ఎన్టీఆర్ జీవిత కథ రాయడానికి వచ్చిన లక్ష్మీపార్వతి ఎలా ఆయనకు దగ్గరైంది. ఆ బంధాన్ని కుటుంబ సభ్యులు తిరస్కరించి ప్రతి ఘటించడం..లక్ష్మీపార్వతి విషయంలో అందరు శత్రువులైనా ఆమెను రెండో పెళ్లి చేసుకోవడం… లక్ష్మీ పార్వతిని సాకుగా చూపి చంద్రబాబు.. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులను రెచ్చగొట్టి వైస్రాయ్ హోటల్ సాక్షిగా ఎన్టీఆర్‌ను గద్దె దించి తాను ముఖ్యమంత్రి కావడం.. ఆ తర్వాత అన్నగారు చనిపోవడంతో కథ ముగించాడు.

 

లక్ష్మీపార్వతి మాయలో పడే ఎన్టీఆర్ లేని కష్టాలను కొనితెచ్చుకున్నారని, కుటుంబానికి దూరమై క్షోభ పడ్డారని మరో ఆరోపణ. ఇందులో ఏది నిజమో, ఏది అబద్ధమో ఎవ్వరికీ తెలీదు. ఒకవేళ ఎన్టీఆర్‌ను చంద్రబాబు మోసం చేసినా అది పార్టీ మంచి కోసమేనని, టీడీపీని లక్ష్మీపార్వతి చేతిలో ఎన్టీఆర్ పెట్టేస్తారనే భయంతో ముందుగానే పార్టీని తన చేతుల్లోకి బాబు తెచ్చుకున్నారనే వాదన కూడా ఉంది. అయితే, ఈ వాదనల్లో మొదటి దానికే ప్రాధాన్యత ఇచ్చారు. ఎన్టీఆర్‌ను చంద్రబాబు వెన్నుపోటు పొడవటమే తాను నమ్మిన నిజం అని.. ఆ కథతో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ను తెరకెక్కించారు.

 

1989 అసెంబ్లీ ఎన్నికల్లో మనదేశం (తెలుగుదేశం) పార్టీ ఓటమి పాలైన దగ్గర నుంచి సినిమా మొదలవుతుంది. పార్టీ ఓటమితో ఎన్టీఆర్ కుటుంబం ఆయనకు దూరమవుతుంది. ఎన్టీఆర్ ఏకాకి అవుతారు. అలాంటి సమయంలో ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీపార్వతి వస్తుంది. తన జీవిత కథ రాస్తానంటూ వచ్చిన లక్ష్మీ పార్వతిని.. ఆమెకు ఆ అర్హత ఉందని గ్రహించి ఎన్టీఆర్ సరేనంటారు. ఇక అక్కడి నుంచి లక్ష్మీపార్వతి, ఎన్టీఆర్ మధ్య బంధం ఎలా ఏర్పడింది? అది వివాహానికి ఎలా దారితీసింది? వీరిద్దరి బంధాన్ని కుటుంబం ఎలా జీర్ణించుకోలేకపోయింది? ఎన్టీఆర్‌కు వెన్నుపోటు ఎలా పొడిచారు? అనే విషయాలు సినిమాలో చూడాల్సిందే.

 

చాలామంది ఎన్టీఆర్ అభిమానులకు లక్ష్మీపార్వతిపై మంచి అభిప్రాయం లేదు. ఎన్టీఆర్‌ను వంచించి ఆయన పంచన చేరిందని ఇప్పటికీ వాదిస్తుంటారు. కానీ, దానిలో నిజం లేదని వర్మ చూపించాడు. లక్ష్మీపార్వతి తెలివితేటలు, ఎదుటివారి మనసును ఆమె అర్థం చేసుకునే విధానం, తనపై ఆమె చూపించే భక్తి చూసి ఎన్టీఆర్ ఆమెను ఇష్టపడినట్లు చూపించాడు. ఫస్టాఫ్‌లో కేవలం ఎన్టీఆర్, లక్ష్మీపార్వతిల మీదే ఎక్కువ సన్నివేశాలు ఉండటం బోర్ కొట్టిస్తుంది. మేజర్ చంద్రకాంత్ విజయోత్సవ సభలో లక్ష్మీపార్వతిని పెళ్లి చేసుకోబోతున్నట్లు ఎన్టీఆర్ ప్రకటించడంతో ఇంటర్వెల్ కార్డ్ పడుతుంది.

 

సినిమాకు ప్రధాన బలం సెకండాఫ్. ఇకపై రాజకీయాలే వద్దనుకున్న ఎన్టీఆర్ మళ్లీ పార్టీ ప్రచారంలో పాల్గొనడం, అన్ని నిర్ణయాలు తానే తీసుకోవడం, పార్టీని అధికారంలోకి తీసుకురావడం ఇలా ప్రతి సన్నివేశం ఆకట్టుకునేలా ఉన్నాయి. ఎన్టీఆర్ మళ్లీ సీఎం అయ్యాక తన ఇంట్లో లక్ష్మీపార్వతితో కలిసి డ్యాన్స్ కూడా చేసినట్లు వర్మ చూపించాడు. మరోవైపు ఎన్టీఆర్‌కు వ్యతిరేకంగా బాబు పన్నే పన్నాగాలు, ఓ పత్రికాధిపతితో చేతులు కలిపి ఎన్టీఆర్‌పై ఎలా విషం కక్కారు అనే విషయాలను వర్మ క్లియర్‌గా చూపించాడు. వైస్రాయ్ హోటల్ దగ్గర ఎన్టీఆర్‌పై చెప్పులు వేసే సన్నివేశం రియలిస్టిక్‌గా ఉంది. అయితే, ప్రీ క్లైమాక్స్‌ను వర్మ బాగా సాగదీశాడు. లక్ష్మీపార్వతి, ఎన్టీఆర్ ఏడుపులతో కాస్త ఇబ్బంది పెట్టేశాడు. చివరిగా ఎన్టీఆర్‌ మరణం తర్వాత లక్ష్మీపార్వతికి కూడా అన్యాయం జరిగిందని చూపించాడు.

 

నటీనటుల పెర్ఫార్మెన్స్:
ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్రలో విజయ్ కుమార్ అనే రంగస్థల నటుడు నటించాడు. తన పరిధి మేరకు అచ్చు ఎన్టీఆర్ చూస్తున్న ఫీలింగ్ తీసుకొచ్చాడు. అన్నగారి ఆహార్యంలో, డైలాగ్ డెలవరీలో జీవించాడనే చెప్పాలి. చంద్రబాబు పాత్రలో శ్రీతేజ్ మెప్పించాడు. ముఖ్యంగా కుట్రలు, కుతంత్రాలు, రాజకీయాలు తెలిసిన వ్యక్తి పాత్రలో అద్భుతంగా ఒదిగిపోయాడు. లక్ష్మీపార్వతిగా నటించిన యజ్ఞ శెట్టి తర పరిధి మేరకు బాగానే నటించింది. వర్మ ఆమె పాత్రను మదర్ థెరిసా తరహా పాత్రలో తీర్చిదిద్దాడు. మరోవైపు హరికృష్ణ, బాలకృష్ణ, మోహన్ బాబు, పురంధేశ్వరి పాత్రల్లో నటించిన నటీనటులతో పాటు మిగతా పాత్రల్లో నటించిన వారు పర్వాలేదనిపించారు.

 

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, మరో దర్శకుడు అగస్త్య మంజుతో కలిసి ఈ సినిమాను తనకు తోచిన తెలిసిన యాంగిల్‌లో తెరకెక్కించినట్టు కనబడుతోంది. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా కోసం రామ్ గోపాల్ వర్మ అందరికి తెలిసిన నటీనటులను కాకుండా కొత్తవాళ్లతో ఈ సినిమా తెరకెక్కించాడాన్ని అభినందించాలి. ముఖ్యంగా ఎన్టీఆర్ పాత్రలో నటించిన రంగస్థల నటుడు ఎంపికలోనే వర్మ..మొదటి విజయాన్ని సాధించాడు. చంద్రబాబు పాత్రను టోటల్‌గా విలన్‌గా చిత్రీకరించాడు. ముఖ్యంగా రామోజీరావు ఈనాడు సపోర్ట్‌తోనే చంద్రబాబు.. తెలుగు దేశం ఎమ్మెల్యేలను తనవైపు తిప్పుకొని ఎన్టీఆర్‌ను పదవీచ్యుతుడిని చేయించినట్టు చూపించాడు. ఎన్టీఆర్ చనిపోయేటపుడు హరికృష్ణ, బాలకృష్ణలు దేశంలోనే లేరు. వర్మ మాత్రం దగ్గరే ఉన్నట్టు చూపించాడు. ఎన్టీఆర్ చనిపోయేటపుడు లక్ష్మీపార్వతి దగ్గరగానే ఉంది. కానీ ఈ సినిమాలో ఆమెను ఎన్టీఆర్ పార్థివదేహాన్ని చూడనీయకుండా దూరంగా ఉన్నట్టు వర్మ చూపించాడు.

 

సంగీతం విషయానికొస్తే..కళ్యాణి మాలిక్ ఇచ్చిన సిట్యూవేషనల్ మ్యూజిక్ బాగుంది. చాలా రోజుల తర్వాత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గొంతు ఈ సినిమాలో వినబడింది. కెమెరా వర్క్, ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

 

ఎన్టీఆర్‌ను చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని, నమ్మక ద్రోహం చేశారని ఉన్న ఆరోపణల్లో నిజమెంతో తెలీదు కానీ.. ఇదే నిజం అని నమ్మించే ప్రయత్నం అయితే వర్మ చేశాడు. మొత్తానికి ఎన్నికల వేళ ఈ సినిమా ఏపీ రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో చూడాలి.

 

ప్లస్‌ పాయింట్స్‌ :
వెన్నుపోటు ఎపిసోడ్
చంద్రబాబు పాత్ర
కథ కథనాలు
ఎమోషనల్ సీన్స్‌
సంగీతం
వర్మ టేకింగ్

మైనస్‌ పాయింట్స్‌ :
సాగదీత
క్లైమాక్స్

 

రేటింగ్ : 2.5/5

Tags : APchandrababu naiducmLAKSHMI PARVATHIlakshmis ntrpoliticsram gopal varmaRGVvennupotu

Also read

Use Facebook to Comment on this PostMenu