12/22/18 12:17 PM

వ్యాపారం కోసమో లాభాల కోసమో ఎన్టీఆర్‌ను వాడుకోలేదు..!

Nandamuri Balakrishna On NTR Biopic Audio

విశ్వ విఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు జీవిత కథ ఆధారంగా బయోపిక్ తీస్తున్న సంగతి తెలిసిందే. ‘కథానాయకుడు’ .. ‘మహానాయకుడు’ అనే పేర్లతో రెండు భాగాలుగా సినిమాలు తెరకెక్కుతున్నాయి. నందమూరి బాలకృష్ణ లీడ్ రోల్‌లో నటిస్తున్నారు. ఈ సినిమాకు క్రిష్ డైరెక్టర్. ఎన్టీఆర్ బయోపిక్ మూవీ తొలి భాగం కథానాయకుడు ఆడియో అండ్ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌ డిసెంబర్ 21 సాయంత్రం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. అతిరథమహారథులు ఈ వేడుకకు తరలివచ్చి సందడి చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన బాలకృష్ణ.. నాన్నగారి బయోపిక్‌ను చేయడం నాకు ఒక అవకాశమే కాదు .. అదృష్టం కూడా అని అన్నారు. నాన్నగారు ఎన్నో విభిన్నమైన పాత్రలను చేశారని, ఆయన చేసిన పాత్రలను ఎప్పటికైనా సరే నేను చేయగలనో .. లేదో అని అనుకునేవాడిని అని అన్నారు. అలాంటి నాకు ఈ బయోపిక్ చేసే అవకాశం వచ్చిందన్నారు. ఈ సినిమా ద్వారా తన కోరికలన్నీ నెరవేర్చుకున్నానని చెప్పారు. నాన్నగారు చేసిన సినిమాల్లోని కొన్ని ముఖ్యమైన పాత్రలను ఈ సినిమాలో చేశానని తెలిపారు. ఎన్ని చేసినా ఇంకా ఇంకా చేద్దామనే అనిపించిందన్నారు. ఇక సొంత బ్యానర్‌ను ఏర్పాటు చేసుకుని సినిమాలు చేయాలని ఎప్పటి నుంచో అనుకున్నానని.. అది నాన్నగారి సినిమాతో కుదిరినందుకు ఎంతో సంతృప్తిగా ఉందని బాలయ్య చెప్పారు.

 

నాన్నగారి బయోపిక్‌ తీస్తుంటే అనుకోకుండానే మా కుటుంబంలోని నిజ జీవిత పాత్రల్లో మా ఫ్యామిలీ వ్యక్తులే చేయడం యాదృచ్ఛికంగా జరిగిపోయాయన్నారు నాన్న ఎన్టీఆర్‌ పాత్ర నేను చేయగా, అన్నయ్య హరికృష్ణ పాత్రను ఆయన కుమారుడు కళ్యాణ్‌ రామ్‌, నా చిన్నప్పటి పాత్రను నా మనవడు, మా మరో అన్నయ్య పాత్రలో మా పెద్దక్క లోకేశ్వరిగారి వాళ్లబ్బాయి కనిపించాడని బాలకృష్ణ వివరించారు.

 

ఇది వ్యాపారం కోసం తీసిన సినిమా కాదని, లాభాలు ఆశించి చేసింది కాదని బాలయ్య స్పష్టం చేశారు. రౌడీ ఇన్‌స్పెక్టర్‌ అప్పుడే బ్యానర్‌ పెట్టాలనుకున్నానని కానీ కుదరలేదన్నారు. ‘బాలకృష్ణకు పిచ్చో, పైత్యమో అనుకోవచ్చు.. కానీ కొన్ని బయోపిక్స్‌ చేసినప్పుడు వాళ్లు కనిపించలేదని కొందరు ఆరోపిస్తుంటారు. నేను కేవలం ఎన్టీఆర్‌గారి జీవితం సారాంశాన్ని తీసుకున్నాను. అన్ని విధాలుగా పరిశీలించి రామారావు గారిని ఏ విధంగా రెండు భాగాల్లో చూపించాలి అని తపనపడ్డాం. కేవలం 90 రోజులు పనిచేశాం. సినిమా ఆడినా ఆడకపోయినా భాష అనేది నాకు ముఖ్యం. సినిమా చూసి తెలుగు మాటలు విని పిల్లలు పలికితే చాలు. తెలుగు, ఎన్టీఆర్‌ అనే మూడక్షరాలు వింటే నా గుండె ఉప్పొంగుతుంది. మూవీని కేవలం తెలుగులోనూ కాదు తమిళం, హిందీ, కన్నడంలోనూ తీసుకొచ్చి తెలుగువాడి సత్తా చాటుదాం. ఎన్నో పాత్రలను చంపుకోవాల్సి వచ్చింది. అయినా సినిమా కోసం తప్పలేదు. ఈ మూవీతో నా కోరికలు చాలా నెరవేరాయి. చాలా మంది మూవీ హిట్‌ అవ్వాలంటున్నారు. కీరవాణి బాణీలు సినిమాకు ప్లస్‌ పాయింట్‌. ఇతర టెక్నీషియన్లు చాలా కష్టపడ్డారు’ అని బాలయ్య అన్నారు.

 

రామారావు ఉద్యోగం మానేసి సినిమాల్లోకి రావడానికి మద్రాసు రైలెక్కడం, రకరకాల పాత్రలు పోషించి, ఆంధ్రుల ఆరాధ్య నటుడిగా ఎదగడం. ప్రజా సేవలో బతకాలనుకుంటున్నాం అంటూ అన్నగారి రాజకీయ ప్రవేశం గురించి చెప్పడం, అసెంబ్లీలో వాదోపవాదాలతో కట్ చేసిన ఎన్టీఆర్ ట్రైలర్ బాగుంది. ట్రైలర్‌లో ఎక్కువ సేపు బాలకృష్ణ, విద్యా బాలన్‌లు మాత్రమే కనిపించినా, సినిమాపై అంచనాలు పెంచేలా కట్ చేసి, మరోసారి అందర్నీ ఆశ్చర్యపరిచాడు దర్శకుడు క్రిష్. నందమూరి అభిమానులతో పాటు, సినీ ప్రియులకు కూడా ఎన్టీఆర్ ట్రైలర్ విపరీతంగా నచ్చేసింది. 2019 జనవరి 9న మొదటి భాగం ఎన్టీఆర్ కథానాయకుడు ప్రేక్షకుల ముందుకు రానుంది.

Tags : balakrishnaJr.NTRKathanayakudukrishntr biopicntr biopic audio launchntr biopic audio trailer launch event

Also read

Use Facebook to Comment on this PostMenu