12/20/18 5:39 PM

ముదిరిన వివాదం : హీరో విశాల్ అరెస్ట్

Police Arrest Actor Vishal

తమిళ నిర్మాతల మండలిలో నెలకొన్న విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. వ్యవహారం అరెస్టుల వరకు వెళ్లింది. సినీ హీరో, తమిళ నిర్మాతల సంఘం అధ్యక్షుడు విశాల్‌ను చెన్నై పోలీసులు అరెస్టు చేశారు. తమిళనాడు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ (TNFPC) ఆఫీస్ తలుపును బలవంతంగా తెరిచేందుకు ప్రయత్నించిన విశాల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు.

 

తమిళ నిర్మాతల మండలి అధ్యక్షుడిగా ఉన్న విశాల్‌‌కు కొందరు నిర్మాతలకు అస్సలు పడటం లేదు. విశాల్‌పై వారు కోపంగా ఉన్నారు. తాజాగా ఒకే రోజు 9 సినిమాల విడుదలకు సంబంధించి వివాదం చెలరేగింది. విశాల్ కేవలం పెద్ద నిర్మాతలకు మద్దతుగా ఉంటున్నారని.. ఆయన నిర్ణయాలు ఏకపక్షంగా ఉంటున్నాయని 50మంది నిర్మాతలు.. నిర్మాతల మండలి కార్యాలయం వద్ద దర్నాకు దిగారు. సినిమాల విడుదల విషయంలో చిన్న నిర్మాతలకు విశాల్ నుంచి ఏమాత్రం సహకారం అందడం లేదని, ఆయన వల్ల చిన్న సినిమాలు విడుదల అయ్యే పరిస్థితి లేకుండా పోయిందని నిర్మాతలు ఆందోళన వ్యక్తం చేశారు.

 

అంతటితో ఆగకుండా టీ నగర్‌లోని నిర్మాతల మండలి ఆఫీస్‌కు తాళం వేసి.. తాళం చెవులు పోలీస్ స్టేషన్‌లో అప్పగించారు. కార్యాలయానికి తాళం వేయడంపై తీవ్రంగా మండిపడ్డ విశాల్, తన అనుచరులతో రోడ్డుపై నిరసనలకు దిగారు. తాళాన్ని పగలగొట్టి ఆఫీస్‌లోకి వెళ్లడానికి ప్రయత్నించారు. దీంతో వ్యతిరేక వర్గం విశాల్‌ను అడ్డుకుంది. ఇరు వర్గాల మధ్య ఎలాంటి గొడవలు జరగకుండా ఉండేందుకు పోలీసులు విశాల్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ సమయంలో తాళం తెరవాలని పోలీసులతో విశాల్ వాగ్వాదానికి దిగారు. కానీ పోలీసులు అంగీకరించలేదు.

 

తాను ఎలాంటి తప్పూ చేయలేదని.. తన కార్యాలయంలోకి వెళ్లేందుకు అనుమతించకపోవడంతో ప్రశ్నించానని విశాల్ మీడియాతో అన్నారు. తనను అన్యాయంగా అరెస్టు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్మాత‌ల మండ‌లితో సంబంధం లేని వ్య‌క్తులు నిన్న కార్యాల‌యం త‌లుపులు, గేట్లు మూసేస్తుంటే కామ్‌గా ఉన్న పోలీసులు.. ఈ రోజు న‌న్ను, నా స‌హోద్యోగుల‌ను మా త‌ప్పేమీ లేక‌పోయినా అరెస్ట్ చేశారని విశాల్ మండిపడ్డారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా మేం మా ప్ర‌య‌త్నాన్ని వ‌దిలిపెట్టమన్నారు. క‌చ్చితంగా పోరాడ‌తామని స్పష్టం చేశారు. ఇళ‌య‌రాజాగారి ఈవెంట్‌ను ఎలాగైనా నిర్వ‌హిస్తామని, ఆ ఈవెంట్ ద్వారా వ‌చ్చిన‌ నిధులతో న‌ష్టాల్లో ఉన్న నిర్మాత‌ల‌ను ఆదుకుంటామని విశాల్ ట్వీట్‌ చేశారు.

Tags : actor vishal arrestedchennai policedifferencesproducers counciltfpc

Also read

Use Facebook to Comment on this Post



Menu