04/28/19 10:13 PM

రాంగోపాల్ వర్మ చేసింది కరెక్టేనా?

Police Arrest Director Ram Gopal Varma

రాంగోపాల్ వర్మ మళ్లీ రచ్చ రచ్చ చేశాడు. పోలీసులను ఉరుకులు పరుగులు పెట్టించాడు. హడావుడి చేశాడు. ప్రజాస్వామ్యం ఎక్కడ అంటూ భారీ డైలాగులు పేల్చాడు. ఆదివారం ఏపీలో వర్మ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. తనదైన శైలిలో ఆర్జీవీ రెచ్చిపోయాడు. లక్ష్మీపార్వతి కోణంలో ఎన్టీ రామారావు జీవితం ఆధారంగా వర్మ తెరకెక్కించిన సినిమా లక్ష్మీస్ ఎన్టీఆర్. విడుదలకు ముందే ఈ చిత్రం వివాదానికి దారితీసింది. మార్చి 29న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం కోర్టు కేసుల్లో చిక్కుకుని ఏపీలో విడుదల కాలేదు. ఎన్నికలు ముగియడంతో మే 1న ఏపీలో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా మూవీ ప్రమోషన్ కోసం విజయవాడలో ఆదివారం ప్రెస్ మీట్ పెట్టడానికి రాం గోపాల్ వర్మ రెడీ అయ్యాడు. నోవాటెల్‌లో ప్రెస్ మీట్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకున్నాడు. అయితే, ఆ హోటల్ వాళ్లు అందుకు పర్మిషన్ ఇవ్వలేదు. ఎవరో వార్నింగ్ ఇవ్వడం వల్ల భయంతో వారు ప్రెస్ మీట్‌కు అనుమతి ఇవ్వలేదని వర్మ వెల్లడించాడు. హోటల్ లో కాకుంటే నడిరోడ్డుపై ప్రెస్ మీట్ పెడతానని అనౌన్స్ చేశాడు. పైపుల రోడ్డులో ఎన్టీఆర్ సర్కిల్ దగ్గర నడిరోడ్డుపై ప్రెస్ మీట్ పెడుతున్నా అని ట్వీట్ చేశాడు.

 

వర్మ ట్వీట్ తో ఏపీ పోలీసులు అలర్ట్ అయ్యారు. ముందుజాగ్రత్తగా వర్మను అదుపులోకి తీసుకున్నారు. ప్రెస్ మీట్ నిర్వహించేందుకు ఆదివారం మధ్యాహ్నం గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్న రాం గోపాల్ వర్మ, నిర్మాత రాకేష్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. ఎయిర్‌పోర్టు దాటి బయటకు రానివ్వలేదు. విజయవాడలో అడుగుపెట్టనివ్వ లేదు. ఏ ఎయిర్‌పోర్టులో అయితే విమానం దిగాడో మళ్లీ అక్కడికే పంపించారు. ఈ విషయాన్ని వర్మ స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు. తమ కార్లు ఆపి కారులో ఉన్నవాళ్లని బలవంతంగా దించి వేరే కారులో ఎక్కించారని వాపోయాడు. విజయవాడ రావడానికి వీల్లేదు, ఎక్కడా మకాం ఉండటానికి వీల్లేదని మమ్మల్ని తీసుకొచ్చి ఎయిర్‌పోర్టులో పడేశారని మండిపడ్డాడు. ఇలా ఎందుకు చేయించాల్సి వచ్చిందో తనకు అర్థం కావడం లేదని వర్మ ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వర్మ తీవ్రస్థాయిలో మండిపడ్డాడు. ‘హే చంద్రబాబూ.. ఏపీలో ప్రజాస్వామ్యం ఎక్కడ ఉంది? ఎందుకు నిజానికి వెన్నుపోటు పొడుస్తున్నారు?’ అని ప్రశ్నించాడు. నిజం చెప్పడానికి చేస్తున్న ప్రయత్నమే నేను చేసిన తప్పు అని వర్మ వాపోయాడు.

 

ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో విజయవాడలో పోలీస్ చట్టంలోని సెక్షన్ 30, సెక్షన్ 144 అమలులో ఉన్నాయని.. అందువల్లే బహిరంగ ప్రదేశాలు, ప్రాంతాల్లో సభలు-సమావేశాలకు ఎలాంటి అనుమతి లేదని విజయవాడ పోలీసులు స్పష్టం చేశారు. ఒకవేళ ఇలాంటి సభలు, సమావేశాలు పెట్టుకోవాలంటే ముందస్తు అనుమతి తీసుకోవడం తప్పనిసరి అని తేల్చిచెప్పారు. వర్మ ప్రెస్ మీట్ పెడతానన్న ప్రాంతం పైపుల రోడ్ అనీ, అక్కడ నిత్యం వేలాది వాహనాలు హైదరాబాద్ వైపు వెళుతుంటాయని అన్నారు. ఒకవేళ అక్కడ ట్రాఫిక్ జామ్ జరిగితే, అత్యవసర సేవలకు కూడా ఆటంకం ఏర్పడే ప్రమాదముందని అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా ఈ కార్యక్రమం వల్ల రెండువర్గాల మధ్య ఘర్షణ తలెత్తే ప్రమాదం కూడా ఉందన్నారు. అందువల్లే వర్మ మీడియా సమావేశానికి అనుమతి ఇవ్వలేదని పోలీసులు వివరణ ఇచ్చారు.

 

వర్మ తీరుపై టీడీపీ నేతలు తీవ్రంగా మండిపడ్డారు. వర్మ ఓవరాక్షన్ చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా మరుగున పడిపోయిందని, దీంతో సినిమా పబ్లిసిటీ కోసమే వర్మ రాద్దాంతం చేశాడని టీడీపీ నాయకులు ధ్వజమెత్తారు. ఏదో ఒక వివాదం సృష్టించడం ద్వారా సినిమాని ప్రమోట్‌ చేయడం వర్మ స్టైల్‌ అని, నెల రోజుల క్రితం అన్ని చోట్లా విడుదలైన సినిమాను ఏపీలోనూ ఆడించేందుకు వర్మ ఈ మార్గాన్ని ఎన్నుకున్నాడని విమర్శించారు. వర్మ ఎన్ని జిమ్మిక్కులు చేసినా.. వర్కవుట్ కావని.. వర్మ ఈగలు తోలుకోవాల్సిందేనని ఎద్దేవా చేశారు.

Tags : chandrababugannavaramlakshmis ntrpolice arrestram gopal varmaRGVvijayawada

Also read

Use Facebook to Comment on this PostMenu