02/5/19 8:47 PM

భవిష్యత్తులో ఇలాంటి తప్పు జరగనివ్వను : రాంచరణ్ క్షమాపణ

Ram Charan Apology Letter To Fans On VVR Flop

వినయ విధేయ రామ.. ఊరమాస్ డైరెక్టర్ బోయపాటి శీను, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కాంబోలో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకులకు ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన వీవీఆర్.. భారీ డిజాస్టర్‌గా నిలిచింది. కామన్ ఆడియన్స్‌నే కాదు మెగా ఫ్యాన్స్‌కు కూడా దిమ్మతిరిగేలా చేసింది. వసూళ్ల పరంగా నిర్మాతల్ని సేఫ్ చేసినా.. ఆడియన్స్‌ను మాత్రం తీవ్రంగా నిరాశపరిచింది. ఇందులో కొన్ని సీన్స్‌పై పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరిగింది. విద్యుత్‌తో నడిచే రైలు మీద మూడు నిమిషాల్లో హీరో మరో రాష్ట్రానికి చేరుకోవడం, విలన్ల తలలు ఆకాశంలోకి ఎగరడం, వాటిని గద్దలు పట్టుకెళ్లిపోవడం.. ఇలాంటి సీన్లపై పెద్ద రచ్చే జరిగింది. సోషల్ మీడియాలో సెటైర్లు పేలాయి. అసలు రామ్ చరణ్..ఈ సినిమాను ఎలా ఒప్పుకున్నాడనే సందేహాలు వ్యక్తమయ్యాయి. ఈ సినిమా ఫ్లాప్ అయిన దానికంటే ఈ సినిమాలో రామ్ చరణ్‌తో బోయపాటి శ్రీను చేయించిన ఫీట్స్‌ మెగాభిమానులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ మూవీ ఫ్లాప్ ఎఫెక్ట్‌తో రామ్ చరణ్ ఇప్పటివరకు బయటకు రాలేదు.

 

తాజాగా ‘వినయ విధేయ రామ’ ఫ్లాప్‌పై రామ్ చరణ్ ఎట్టకేలకు స్పందించాడు. ఫ్యాన్స్‌ను ఉద్దేశించి ప్రెస్‌నోట్‌ను రిలీజ్ చేశాడు. వీవీఆర్ చిత్రం చాలా కష్టపడి చేశామని అయితే అభిమానులు ఆశించిన స్థాయిలో వినోదాన్ని అందించలేకపోయామంటూ ఎమోషనల్ లెటర్‌ను మీడియాకి విడుదల చేశాడు. మీరు చూపించే ప్రేమను ప్రేరణగా తీసుకొని ఇకముందు మంచి చిత్రాలతో మీ ముందుకు వస్తానని అభిమానులకు లేఖ రాశాడు.

 

“ప్రియమైన అభిమానులకు .. ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఈ సినిమా కోసం రేయింబవళ్లు కష్టించి పనిచేసిన సాంకేతిక నిపుణులకు .. పంపిణీదారులకు .. ప్రదర్శనదారులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఇక ఈ సినిమా విషయంలో నిర్మాత దానయ్యగారి సహకారం మరువలేనిది. ‘వినయ విధేయ రామ’తో మీ అందరికీ వినోదాన్ని పంచడానికి అంతా కలిసి ఎంతో శ్రమించాము. కానీ దురదృష్టవశాత్తు ఒక మంచి సినిమాను అందించలేక పోయాము .. మీ అంచనాలను అందుకోలేకపోయాము. భవిష్యత్తులో మీకు నచ్చే .. మీరు మెచ్చే సినిమాలు చేయడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తాను. మీ ప్రేమాభిమానాలు ఎప్పటికీ ఇలాగే వుండాలని కోరుకుంటున్నా. అన్నివేళలా మద్దతును అందించిన మీడియా మిత్రులకు ధన్యవాదాలు” అంటూ ఆ లేఖ‌లో రామ్ పేర్కొన్నాడు.

 

చెత్త సినిమా తీశాను, నన్ను క్షమించండి.. అంటూ అభిమానులకు ఓపెన్ లెటర్ రాసిన రామ్ చరణ్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు తమ సినిమాలు ఫ్లాప్ అయితే…అవి ప్లాప్ అని చెప్పుకోవడానికి అస్సలు ఇష్టపడరు. కానీ రామ్ చరణ్ మాత్రం ఎంతో ధైర్యంగా తన సినిమా ప్లాప్‌ అయిందని చెప్పడమే కాకుండా సారీ చెబుతూ ఫ్యాన్స్‌కు లేఖ రాయడాన్ని నెటిజన్లు గ్రేట్‌గా చెబుతున్నారు. రామ్ చరణ్..నిజంగానే ‘వినయ విధేయ రాముడే’ అని కితాబిస్తున్నారు.

Tags : boyapati srinufansmega power starram charanram charan open letterram charan sorryVinaya Vidheya RamaVVR

Also read

Use Facebook to Comment on this Post



Menu