12/27/18 1:28 PM

వెన్నుపోటు వివాదం.. వర్మ వర్సెస్ ఎస్వీ

Ram Gopal Varma Vs SV Mohan Reddy

”వెన్నుపోటు” సాంగ్ వివాదం పొలిటకల్ టర్న్ తీసుకుంది. వివాదాస్పద సినిమాల దర్శకుడు రాంగోపాల్ వర్మ, టీడీపీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి సై అంటే సై అంటున్నారు. ఇద్దరూ లీగల్ ఫైట్‌కు దిగారు. ఎస్వీ మోహన్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేస్తే… నేనేం తక్కువ తిన్నానా? అంటూ లాయర్ నోటీసులు పంపించారు వర్మ. వివరాల్లోకి వెళితే..తనపై కర్నూలు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డికి తన లాయర్ ద్వారా నోటీసులు పంపించారు వర్మ. నోటీసు అందుకున్న 48గంటల్లోగా బహిరంగ క్షమాపణ చెప్పి పీఎస్‌లో ఫిర్యాదును ఉపసంహరించుకోవాలని నోటీసుల్లో పేర్కొన్నారు. లేనిపక్షంలో చట్టపరమైన చర్యలకు సిద్ధంగా ఉండాలన్నారు. రాంగోపాల్ వర్మను వేధింపులకు గురి చేసేందుకు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారని వర్మ లాయర్ అన్నారు.

 

వర్మ పంపిన లాయర్ నోటీసులపై ఎస్వీ మోహన్ రెడ్డి ఘాటుగా స్పందించారు. తాటాకు చప్పుళ్లకు భయపడే రకాన్ని కాదని చెప్పారు. రామ్ గోపాల్ వర్మ లీగల్‌గా వచ్చినా, ఇల్లీగల్‌గా వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానని తేల్చి చెప్పారు. వర్మపై ఇచ్చిన ఫిర్యాదును వెనక్కి తీసుకునేది లేదని స్పష్టం చేశారు. ప్రజల మధ్య వైషమ్యాలను పెంచుతున్న వర్మను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేసిన ఆయన, వర్మ సినిమాను విడుదల కానివ్వబోమన్నారు.

 

వర్మ తాజా చిత్రం ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’. ఈ సినిమాలో వెన్నుపోటు పాటను వర్మ ఇటీవల విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పాట వివాదానికి దారితీసింది. ఏపీ టీడీపీ నేతలు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు. మఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిష్టను దెబ్బతీసేలా, ఆయనను అవమానించేలా పాటను చిత్రీకరించారని టీడీపీ నేతలు ఆరోపించారు. ఏపీ వ్యాప్తంగా టీడీపీ నేతలు పోలీస్‌స్టేషన్లలో వర్మపై కేసులు పెట్టారు. కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి కర్నూలు పోలీస్‌స్టేషన్‌లో వర్మపై ఫిర్యాదు చేశారు. వర్మపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని కోరారు. దీనిపై స్పందించిన వర్మ తన లాయర్ ద్వారా నోటీసులు పంపడం, దానికి మోహన్ రెడ్డిగా ఘాటుగా బదులివ్వడం ఇష్యూని మరింత హాట్‌గా మార్చేసింది.

Tags : chandrababu insultkurnool mla sv mohan reddylakshmis ntrram gopal varmaram gopal varma noticesv mohan reddyvennupotu song

Also read

Use Facebook to Comment on this Post



Menu