04/4/19 1:04 PM

ఎన్నికల్లో చంద్రబాబుని దెబ్బకొట్టాలని చూసిన వర్మకు షాక్..!

shock for rgv, doubts on lakshmis ntr release

వివాదాస్పద సినిమాల దర్శకుడు రాంగోపాల్ వర్మ కల.. కలగానే మిగిలిపోనుందా? పోలింగ్ కు ముందు ఏపీలో లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదలకు నోచుకోదా? అంటే అవుననే సమాధానం వస్తోంది. చంద్రబాబుని దెబ్బకొట్టడమే లక్ష్యంగా వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాని తెరకెక్కించాడు అనే ఆరోపణలు ఉన్నాయి. చంద్రబాబు.. ఎన్టీ రామారావుని ఏ విధంగా మోసం చేశారు? వెన్నుపోటు ఎలా పొడిచారు? అనేది ప్రధాన అంశంగా వర్మ ఈ సినిమాను తెరకెక్కించాడు. లక్ష్మీ పార్వతిని దేవతగా, చంద్రబాబుని విలన్ లా చిత్రీకరించాడు. దేశవ్యాప్తంగా ఈ సినిమా గత శుక్రవారం రిలీజ్ అయ్యినా.. ఏపీలో మాత్రం ఆగిపోయింది. ఎలాగైనా పోలింగ్ జరిగే ఏప్రిల్ 11వ తేదీ ముందే ఈ సినిమాని ఏపీలో రిలీజ్ చెయ్యాలని వర్మ పట్టుదలగా ఉన్నాడు. కానీ పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి.

 

‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా ఎన్నికల ముందు ఏపీలో విడుదలకు నోచుకునేలా కనిపించడంలేదు. వర్మ ఆశలపై హైకోర్టు నీళ్లు చల్లింది. ఏపీలో సినిమా విడుదల అంశంపై విచారణను హైకోర్టు ఏప్రిల్ 9కి వాయిదా వేసింది. ఏపీలో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా విడుదల అంశంపై బుధవారం (ఏప్రిల్ 3) హైకోర్టులో విచారణ జరిగింది. ఇదే సినిమాకి సంబంధించిన ఒక పిటిషన్ సుప్రీంకోర్టులో పెండింగ్ ఉన్నందున తాము ఈ కేసు విచారణ చేయకూడదని ఏపీ హైకోర్టు తెలిపింది. ఈ కేసు విచారణను ఈ నెల 9కి వాయిదా వేస్తున్నట్లు వెల్లడించింది.

 

ఎన్నో వివాదాల మధ్య మార్చి 29న ప్రేక్షకుల ముందుకు వచ్చింది ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’. అయితే.. కోర్టు ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ఈ సినిమా విడుదలకు నోచుకోలేదు. దీంతో కొంత మంది ఏపీ వాసులు హైదరాబాద్ వచ్చి సినిమా చూస్తుండటం విశేషం. ఏప్రిల్‌ 3న లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ సినిమా ప్రివ్యూ చూసి నిర్ణయం తీసుకుంటామని ఏపీ హైకోర్టు ఇంతకుముందు పేర్కొంది. దీంతో బుధవారం.. చిత్ర నిర్మాత రాకేష్‌ రెడ్డి సినిమా కాపీని తీసుకొని కోర్టుకు వచ్చారు. అయితే.. సుప్రీంకోర్టులో కేసు విచారణ నడుస్తున్నందున తాము ప్రివ్యూ చూడటం సరికాదని న్యాయమూర్తి పేర్కొన్నారు. కేసును 9వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో సినిమా బృందం నిరాశగా వెనుదిరిగింది.

 

లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విడుదలను నిలిపేయడంపై చిత్ర బృందం సుప్రీంకోర్టులో అత్యవసర విచారణ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌ను తోసిపుచ్చిన సుప్రీంకోర్టు ఏప్రిల్ 13న విచారణ చేపడతామని స్పష్టం చేసింది. అత్యవసరంగా విచారించాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది. సో మొత్తంగా.. పోలింగ్ కు ముందే ఏపీలో సినిమాని విడుదల చెయ్యాలనుకున్న వర్మ ఆశలు ఫలించేలా లేవు.

Tags : ap highcourtchandrababuLAKSHMI PARVATHIlakshmis ntrntrram gopal varmareleaseRGVTDPvennupotu

Also read

Use Facebook to Comment on this Post



Menu