10/12/19 12:33 PM

సైరా.. 10 రోజుల కలెక్షన్లు

Syeraa Narasimha Reddy Movie Collections

మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన సినిమా సైరా నరసింహారెడ్డి. భారీ తారాగణంతో, రూ.250 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కింది. అక్టోబర్ 2న ప్రేక్షకులు ముందుకు వచ్చింది. మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో మైలురాయిగా నిలిచిన సైరా చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఊగిసలాడుతోంది. స్టార్టింగ్ లో కలెక్షన్లు బాగానే వచ్చినా.. రాను రాను తగ్గుముఖం పట్టాయి. ఈ చిత్రం రెండో వారంలోకి ప్రవేశించినా.. పెద్దగా వసూళ్లను రాబట్టలేకపోతోంది. దీంతో ఇంకా లాభాల్లోకి ప్రవేశించడానికి తంటాలుపడుతోంది.

 

9వ రోజుతో పోల్చుకొంటే 10వ రోజు బాక్సాఫీస్ దగ్గర వసూళ్లు తగ్గాయి. ఏపీ, తెలంగాణలో రూ.2.2 కోట్లు మాత్రమే వసూలు చేసింది. ప్రపంచవ్యాప్తంగా పోల్చుకొంటే మొత్తంగా ఈ చిత్రం రూ.2.7 కోట్ల మేర వసూలు సాధించిందని ట్రేడ్ వర్గాలు చెప్పాయి. నైజాంలో రూ.90 లక్షల మేర వసూలు చేసి మొత్తంగా రూ.29 కోట్ల మేర కలెక్షన్లను నమోదు చేసింది. ఉత్తరాంధ్రలో 10వ రోజున రూ.50 లక్షలకుపైగానే వసూళ్లను రాబట్టినట్టు సమాచారం. ఉత్తరాంధ్రలో ఇంకా లాభాల్లోకి రావాలంటే రూ.14 కోట్లు మేర వసూలు చేయాల్సిందే అంటున్నారు. మొత్తంగా ఈ చిత్రానికి రూ.106 కోట్ల బిజినెస్ జరిగితే.. ఇంకా రూ.11 కోట్ల మేర రావాల్సి ఉంది.

 

ఇకపోతే.. ప్రతికూల పరిస్థితులు ఎదురైనా.. దక్షిణాదిలో సైరా మూవీ ఓ ఘనతను సొంతం చేసుకుంది. 2019లో రూ.200 కోట్ల క్లబ్‌లో చేరిన 4వ చిత్రంగా సైరా నిలిచింది. ఇప్పటి వరకు పేటా, విశ్వం, సాహో తర్వాత రూ.200 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను సాధించిన చిత్రంగా సైరా రికార్డును సొంతం చేసుకుంది.

 

మెగాస్టార్ చిరంజీవి డ్రీమ్‌ ప్రాజెక్ట్ గా తెరకెక్కిన సైరా నరసింహారెడ్డి సినిమాకు సురేందర్‌ రెడ్డి దర్శకుడు. తండ్రి కలను నిజం చేసేందుకు మెగా పవర్‌ స్టార్ రామ్‌ చరణ్‌ ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా నిర్మించాడు. ఈ సినిమాలో బాలీవుడ్ లెజెండ్‌ అమితాబ్ బచ్చన్ నరసింహారెడ్డి గురువు గోసాయి వెంకన్న పాత్రలో నటించారు. కన్నడ నటుడు సుదీప్‌, తమిళ స్టార్‌ విజయ్‌ సేతుపతి ఇతర కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాలో నయనతార, తమన్నాలు హీరోయిన్లుగా నటించారు. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో హాలీవుడ్‌ టెక్నిషియన్స్‌తో ఈ సినిమాను రూపొందించారు. దాదాపు రూ.250 కోట్ల బడ్జెట్‌తో సినిమాను తెరకెక్కించారు. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో బ్రేక్‌ ఈవెన్‌కు చేరువైన సైరా.. వారాంతానికి దాదాపు అన్ని చోట్లా సేఫ్ జోన్‌లోకి వస్తుందని చిత్ర యూనిట్ ఆశలు పెట్టుకుంది.

Tags : box office collectionschiranjeevimegastarram charanSyeraa Narasimha reddy

Also read

Use Facebook to Comment on this Post



Menu