01/11/19 5:16 PM

”వినయ విధేయ రామ” సినిమా రివ్యూ

Vinaya Vidheya Rama Movie Review

టైటిల్ : వినయ విధేయ రామ
జానర్ : యాక్షన్ డ్రామా
నటీనటులు : రామ్‌ చరణ్‌, కియారా అద్వానీ, వివేక్‌ ఒబెరాయ్‌, ప్రశాంత్‌, స్నేహ
మ్యూజిక్ : దేవీ శ్రీ ప్రసాద్‌
డైరెక్టర్ : బోయపాటి శ్రీను
ప్రొడ్యూసర్ : డివివి దానయ్య

 

‘రంగస్థలం’ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన చిత్రం ‘వినయ విధేయ రామ’. ఊర మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై ఇటు ట్రేడ్ వర్గాల్లో అటు అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. సంక్రాంతి సందర్భంగా జనవరి 11 వీవీఎర్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రామ్ చరణ్ కెరీర్‌లో బిగ్గెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ నడిపిన సినిమాగా విడుదలకు ముందే రికార్డ్ క్రియేట్ చేసింది వినయ విధేయ రామ. మరి చరణ్-బోయపాటి కాంబో వర్కవుట్ అయ్యిందా? చరణ్‌ మరో హిట్ కొట్టినట్టేనా? మూవీ రివ్యూలో చూద్దాం.

 

కథ:
రామ్ చరణ్ అనాథ. చిన్నప్పుడే నలుగురు అనాథలు అతన్ని పెంచి పెద్ద చేస్తారు. ఈ ఐదుగురు సొంత అన్నదమ్ముల్లా పెరుగుతారు. ఆ అనాథల్లో రామ్ చరణ్ చిన్నవాడు. వీళ్లదో అందమైన ఫ్యామిలీ. అందులో రామ్ పెద్దన్న భువన్ కుమార్ (ప్రశాంత్) సిన్సియర్ ఐఏఎస్ ఆఫీసర్. విశాఖ ఎలక్షన్ కమిషనర్‌గా అక్కడి ఉప ఎన్నికలను సాఫీగా జరిపిస్తాడు. ఈ సందర్భంలో అక్కడి ప్రతిపక్ష నాయకుడు పందెం పరుశురాం (ముఖేష్ రుషి)తో భువన్‌కు వైరం ఏర్పడుతుంది. అది నచ్చని ప్రతిపక్ష నాయకుడు హీరో కుటుంబాన్ని టార్గెట్ చేస్తాడు. ఈ సందర్భంలో బిహార్ నుంచి మున్నాభాయ్ మనుషులు (వివేక్ ఓబెరాయ్) రంగంలోకి దిగుతాడు. అతని వల్ల రామ్ కుటుంబానికి ఎలాంటి అన్యాయం జరిగింది. దానికి రామ్ ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడనేదే ‘వినయ విధేయ రామ’ స్టోరీ.

 

విశ్లేషణ:
భద్ర, సింహా, లెజెండ్, సరైనోడు లాంటి బ్లాక్‌బస్టర్ హిట్ చిత్రాలను తీసిన బోయపాటి శ్రీనేనా ఈ చిత్రానికి డైరెక్టర్ అనే సందేహం కలగకమానదు ‘వినయ విధేయ రామ’ సినిమా చూసినోళ్లకి. బోయపాటి సినిమాలో హీరో ఆవేశం వెనుక ఎమోషన్ ఉంటుంది. అందుకే తెగ నరుకుతున్నా ఇంకా నరికితే బావుండు అని ప్రేక్షకులు ఫీల్ అవుతారు. ఆ రేంజ్‌లో బలమైన సీన్లు రాసుకుంటారు. కథను ఆసక్తిగా మలుస్తారు. కానీ VVR లో బొమ్మ తిరగబడింది. కేవలం ఓవరాక్షన్ మాత్రమే కనిపిస్తుంది. మాస్ డైరెక్టర్ అనే పేరును సార్ధకం చేసుకునేందుకు బోయపాటి సినిమాలో రక్తపాతం, నరుక్కోవడాలు, చంపుకోవడాలు, హింస కామన్‌. ఈ సినిమాలో వాటి మోతాదు మరింత పెంచాడు బోయపాటి. అనవసరమైన సీన్స్‌తో ఆడియన్స్ తలలు బొప్పి కట్టించాడు.

 

బోయపాటి సినిమాల్లో ఊహకందని సీన్లు చాలానే ఉంటాయి.  చిటికేస్తే కదిలి వచ్చే కుర్చీ.. కేక పెడితే వెనక్కి వెళ్లిపోయే ట్రైన్ సీన్‌లు చూసి బాబోయ్ అనుకునే వాళ్లు ప్రేక్షకులు. అయితే అలాంటి సీన్‌లు ఈ సినిమాలో చాలానే ఉన్నాయి. రామ్ చరణ్ కదిలే ట్రైన్ మీదికి ఉరికి మరీ నిమిషాల్లో గుజరాత్ నుండి బీహార్ వచ్చేయడం.. విలన్స్ తల నరికితే వారి తలలు ఆకాశంలోకి ఎగిరిపోవడం.. అక్కడే ఉన్న గద్ధలు ఆ తలలను ఎత్తుకుపోవడం.. ఇండియన్ ఆర్మీకి సాధ్యం కాని పనిని చరణ్‌ ఒక్కడే చేసి 300 మందిని చంపేయడం.. విషంతో ఉన్న పాము కరిస్తే మనిషి చనిపోకుండా పామే తిరిగి చనిపోవడం లాంటి వాస్తవాలకు దూరంగా ఉన్న సీన్స్ ఈ సినిమాలో చాలానే ఉన్నాయి.

 

ఫస్టాఫ్ మొత్తం ఫ్యామిలీ ఎమోషన్స్‌తో బాగానే లాక్కొచ్చిన బోయపాటి.. సెకండాఫ్‌లో కంట్రోల్ తప్పారు. ప్రేక్షకులకు చుక్కలు చూపించారు. మంచి ఎమోషన్ ఫ్లాష్ బ్యాక్ సీన్‌తో కథ మొదలు పెట్టిన దర్శకుడు దాన్ని కంటిన్యూ చేయలేకపోయారు. సెకండాఫ్‌లో వచ్చే యాక్షన్ సన్నివేశాలు వాస్తవాలకు దూరంగా ఉన్నాయి. కథనంలో నెమ్మదితో పాటు కొత్తదనం లేకపోగా.. ఆయన గత చిత్రాలను గుర్తుచేశారు.

 

నటీనటులు పెర్ఫార్మెన్స్:
అయితే ఈ సినిమాలో రామ్ చరణ్ కష్టం ప్రతి ఫ్రేమ్‌లో కనిపిస్తుంది. రామ్ కష్టపడ్డాడు కాని.. ప్రతిఫలం దక్కకుండా చేశారు బోయపాటి. సిక్స్ ప్యాక్‌లో రామ్ చరణ్‌ ఆకట్టుకున్నారు. డాన్స్, డైలాగ్ డెలివరీ, ఫైట్స్, యాక్షన్ సన్నివేశాల్లో బెటర్ పెర్ఫామెన్స్ ఇచ్చారు. హీరోయిన్‌ కైరా అద్వానీ ఒకటి రెండు సీన్లకు మాత్రమే పరిమితం అయ్యింది. పాటల్లో మాత్రమే కనిపించింది. ప్రశాంత్ భార్యగా చేసిన సీనియర్ హీరోయిన్ స్నేహకు ప్రాధాన్యత ఉన్న పాత్ర దక్కింది. ఇక చరణ్‌కి బ్రదర్స్‌గా నటించిన ఆర్యన్ రాజేష్ పరిధి మేర బాగానే నటించారు. విలన్‌గా వివేక్ ఒబెరాయ్ రక్తికట్టించాడు. కామెడీ పరంగా ఫస్టాఫ్‌లో హేమ, పృథ్వీలు నవ్వించే ప్రయత్నం చేశారు. పప్పీగా రామ్ అత్త పాత్రలో హేమ ఆకట్టుకునే ప్రయత్నం చేసినా.. కొన్ని సీన్లు ఓవర్‌గా అనిపిస్తాయి.

 

టెక్నిషియన్స్:
మ్యూజిక్ పరంగా దేవి శ్రీ ప్రసాద్ పెద్దగా ఆకట్టుకోలేదు. పాటలు పర్వాలేదనిపించినా.. గత చిత్రాలతో పోల్చుకుంటే నేపథ్య సంగీతం సరిగా కుదరలేదు. రిషి, ఆర్థర్ విలియమ్ సన్ సినిమాటోగ్రఫీ బాగుంది. కణల్ కణ్ణన్ స్టంట్స్ కాస్త ఓవర్‌గా అనిపిస్తాయి. సెకండాఫ్‌ సాగదీసినట్టు అనిపిస్తుంది. ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు కత్తెరకు ఇంకాస్త పనిచెప్పాల్సింది. డీవీవీ దానయ్య బడ్జెట్ భారీగా పెట్టడంతో సినిమా రిచ్‌గా కనిపిస్తుంది.

 

దర్శకుడిగా సుకుమార్..రామ్ చరణ్‌ను నటుడిగా ప్రూవ్ చేసి పది మెట్లు ఎక్కిస్తే..బోయపాటి శ్రీను మాత్రం రామ్ చరణ్‌లో ఉన్న నటనను కాకుండా..అతని సిక్స్ ప్యాక్ బాడీ చూపించడానికే పరిమితం అయి అతన్ని మరోసారి పాతాళంలోకి తోసేసాడు. మొత్తానికి ‘వినయ విధేయ రామ’ టైటిల్‌కు ఈ సినిమాకు పొంతనే లేదు. ఒక సినిమాను ఎలా తీయకూడదో బోయపాటి శ్రీను ఈ చిత్రంతో నిరూపించాడు. సంక్రాంతి పండక్కి ఎంజాయ్ చేద్దామని ప్రేక్షకులు అనుకుంటే.. వారి సహనానికి పరీక్ష పెట్టాడు బోయపాటి. ‘వినయ విధేయ రామ’ అనే కంటే ‘వినయ విధ్వంసక రామ’ అనే టైటిల్ యాప్ట్‌గా ఉంటుంది.

Tags : boyapati srinudevi sri prasadkiara advaniram charanvinaya vidheya rama movie reviesvvr movie reveiw

Also read

Use Facebook to Comment on this PostMenu