02/8/19 6:41 PM

‘యాత్ర’ సినిమా రివ్యూ

Yatra Telugu Movie Review

టైటిల్ : యాత్ర
జానర్ : బయోగ్రఫి
నటీనటులు : మమ్ముట్టి, జగపతి బాబు, సుహాసిని, రావు రమేష్‌, అనసూయ, పోసాని కృష్ణమురళి
సంగీతం : కె.కృష్ణ కుమార్
దర్శకత్వం : మహి వి.రాఘవ
నిర్మాత : విజయ్‌ చిల్లా, శశి దేవిరెడ్డి

 

దివంగత ఉమ్మడి ఏపీ సీఎం వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి జీవితకథ ఆధారంగా తెరకెక్కిన బయోగ్రాఫికల్‌ మూవీ ‘యాత్ర’. వైఎస్‌ఆర్‌లో రాజకీయపరంగానే కాక వ్యక్తిత్వ పరంగా కూడా ఎన్నో మార్పులు తీసుకువచ్చిన ప్రజా ప్రస్థానం యాత్ర నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు. దర్శకుడు మహి వి.రాఘవ ఈ సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమాలో వైఎస్ పాత్రలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి నటించారు. దాదాపు రెండున్నర దశాబ్దాల తరువాత మమ్ముట్టి ఈ సినిమాతో టాలీవుడ్‌కు రీ ఎంట్రీ ఇచ్చారు. విజయమ్మ పాత్రలో నటి, నాట్యమణి ఆశ్రిత వేముగంటి కనిపించారు. జగపతిబాబు, అనసూయ, రావు రమేశ్, సుహాసిని, సచిన్ ఖేదేకర్ ముఖ్య పాత్రలు పోషించారు. ప్రపంచవ్యాప్తంగా 970 స్క్రీన్స్‌లో ఫిబ్రవరి 8వ తేదీ శుక్రవారం విడుదలైన ఈ సినిమా ఎలా ఉందో మన రివ్యూలో చూద్దాం..

 

ఈ చిత్రం టైటిల్ ఎనౌన్స్ చేసిన ద‌గ్గ‌ర‌నుండి వైఎస్ఆర్ అభిమానుల్లోనే కాక సాధారణ ప్ర‌జ‌ల్లో కూడా ఈ సినిమాపై ఆసక్తి నెల‌కొంది. దీనికి కార‌ణం ఓ మ‌హానేత చ‌రిత్రను తెర‌కెక్కిస్తుండటమే. సరిగ్గా ఎన్నికల ముందు వైఎస్ బయోపిక్‌ను విడుదల చేస్తున్నారంటే.. ఇది ఎన్నికల స్టంటా లేక ఈ చిత్రం ఇప్ప‌ుడు తీయ‌వ‌ల‌సిన అవ‌స‌రం ఏమిటి? అధికార పార్టీని ఈ సినిమా ద్వారా ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారా? లాంటి రకరకాల సందేహాలు, అనుమానాలు సినీ రాజకీయ వర్గాల్లో కలిగాయి.

 

కథ:
ఉమ్మడి ఏపీలో చంద్రబాబు పరిపాలనతో రాష్ట్రంలో రైతుల స్థితిగతులు ఎలా ఉన్నాయనే దానిపై ఈ సినిమా స్టోరీ మొదలవుతుంది. రాష్ట్రంలో రైతాంగ సమస్యలు, ప్రజల కష్టాలను చూసి చలించి పోయి వైఎస్ఆర్ పాద యాత్రకు పూనుకుంటారు. ఈ సందర్భంగా ప్రజల్లోకి వెళ్లి వాళ్ల కష్టసుఖాలను తెలుసుకుంటారు. పాదయాత్ర తర్వాత వైఎస్ఆర్ ముఖ్యమంత్రి అవుతారు. ఈ సందర్భంగా ఆయన ప్రవేశ పెట్టిన అనేక సంక్షేమ పథకాలు ముఖ్యంగా ఆరోగ్య శ్రీ, ఫీజు రీఎంబర్స్‌మెంట్ ఆయనకు ఎలా పేరు తీసుకొచ్చాయి. తిరిగి రెండోసారి సీఎం అవ్వడం..హెలికాప్టర్ ప్రమాదంలో ఎలా కన్నుమూశారు అనేదే ‘యాత్ర’ స్టోరీ.

 

నటీనటులు:
‘యాత్ర’ సినిమాను ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కించారు దర్శకుడు. ఒక సినిమాకి కథ ఎంపికతోపాటు క్యారెక్టర్ సెలక్షన్ కూడా చాలా ముఖ్యం. ఇదే సినిమా సక్సెస్‌ను నిర్ణయిస్తుంది. ఎప్పుడైతే వైఎస్ పాత్రకు మలయాళ నటదిగ్గజం మమ్ముట్టిని ఎంపిక చేశారో.. అప్పుడే ఈ సినిమా సగం సక్సెస్ సాధించింది. మూడు నేషనల్ అవార్డ్స్, ఆరు స్టేట్ అవార్డ్స్, 12 ఫిల్మ్ ఫేర్‌లు, రెండు డాక్టరేట్‌లు.. పద్మశ్రీ మమ్ముట్టిని నట దిగ్గజం అనడానికి ఈ గణాంకాలు చాలు. నిజానికి ‘యాత్ర’ సినిమా ఓ ఎమోషనల్ జర్నీ. ఇందులో పెద్దగా కథ ఉండదు. పాత్రలే కథకు ప్రాణం. వైఎస్ఆర్‌గా లీడ్ రోల్ పోషించిన మమ్ముట్టి పాత్ర కోసం ప్రాణం పెట్టడం ఏంటో ఆయన నటన ద్వారా నిరూపితం చేశారు. వైఎస్ పాత్రలో ఒదిగిపోయారు. ‘యాత్ర’ సినిమాలో వైఎస్ఆర్ పాత్రకు మమ్ముట్టి కాకుండా..వేరే నటుడిని ఊహించుకోవడం కష్టం అనే రేంజ్‌లో ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేశారా అనే రీతిలో నటించి మెప్పించారు మమ్ముట్టి. ముఖ్యంగా రాజశేఖర్ రెడ్డి హావభావాలు, మొండితనాన్ని తన నటనతో మెప్పించారు. ముఖ్యంగా పార్టీ అధిష్టానం కంటే అన్నీతానై పార్టీని ముందుకు నడిపించడంలో ఆయన మొండితనం ఎలా ఉంటుందో మమ్ముట్టి తన నటనతో చూపించారు. ముఖ్యంగా యాత్ర సందర్భంగా రైతుల కష్టాలు, విద్యుత్ సమస్యలపై చలించపోవడం వంటి ఎమోషనల్ సన్నివేశాల్లో తనదైన నటనతో ఆకట్టుకున్నారు. మిగతా నటీనటుల విషయానికొస్తే వైఎస్ తండ్రి రాజారెడ్డి పాత్రలో జగపతి బాబు కాసేపు ఉన్నా పర్వాలేదనిపించారు. మిగతా పాత్రల్లో నటించిన నటీనటులు ఉన్నంతలో పర్వాలేదనిపించారు.

 

విశ్లేషణ:
వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి..పాదయాత్రతో ఎలా ముఖ్యమంత్రి అయ్యారు..ప్రజలకు సంక్షేమ పథకాలను అందించారు అనే కాన్సెప్టే ఈ సినిమాకు సొంత పార్టీలో విపక్షాన్ని ఎదుర్కొని ఎలా మహానాయకుడిగా ఎదిగాడనే విషయాన్ని ఈ సినిమాలో చూపించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యారు. రైతులకు ఉచిత కరెంటు, ఆరోగ్య పథకం అమలు చేయాలనే ఆలోచన, డబ్బులు కట్టలేక పెద్ద చదువులు చదవలేకపోయిన వారికోసం ఫీజు రీఎంబర్స్‌మెంట్ పథకం ప్రవేశం పెట్టడంతో చిన్న, మధ్యతరగతి ప్రజలకు పెద్ద చదువులను దగ్గరచేయడం వంటివి చాలా ఎమోషనల్‌ సీన్స్ ఈ సినిమాకు ప్రాణంగా నిలిచాయి. స్టోరీ, కంటెంట్ పరంగా బాగున్నా…ఈ సినిమా నేరేషన్ మాత్రం చాలా స్లో గా సాగడం మైనస్ అనే చెప్పాలి. సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగున్నాయి. మొత్తంగా క్లైమాక్స్‌లో వైఎస్ఆర్ హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయిన విజువల్స్‌ను నిజంగానే చూపించి ప్రేక్షకులను ఎమోషన్ కు గురిచేశారు. కథను డీల్ చేసిన విధానంతో దర్శకుడు మహి వి రాఘవకి ప్రశంసలు దక్కుతాయి. టైటిల్స్‌లోనే వైఎస్ బాల్యం, విద్యాభ్యాసం, పొలిటికల్ ఎంట్రీ, ముఖ్యమంత్రిగా ఎదిగిన తీరును చెప్పేసిన దర్శకుడు కేవలం పాదయాత్రను మాత్రమే మెయిన్ థీమ్‌గా ఎన్నుకుని పెద్ద ప్రయోగమే చేశారు. అయితే ఫస్టాఫ్ మొత్తం సాఫీగా నడిపిన దర్శకుడు సెకండాఫ్‌లో బలమైన సీన్లను రాసుకున్నారు. ముఖ్యంగా వైఎస్ ప్రవేశ పెట్టిన ఒక్కో సంక్షేమ పథకానికి ఒక్కో బలమైన కారణాన్ని చాలా ఎమోషనల్‌గా చూపించారు. ముఖ్యంగా పాత్రల ఎంపిక ద్వారా దర్శకుడు సక్సెస్ అయ్యారు.

 

సూటిగా సుత్తి లేకుండా.. కథలో భాగంగా.. చెప్పాల్సిన విషయాన్ని సూటిగా.. ఎమోషనల్‌గా.. ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా.. కంటతడి పెట్టించేలా… ‘యాత్ర’ సాఫీగా సాగిపోతుంది. అయితే బి, సి సెంటర్ ఆడియన్స్‌కు ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి. పరభాషా నటుడు కావడం మరో మైనస్.

 

రేటింగ్ : 2.5/5

Tags : CONGRESSmahaprastanammahi v raghavmammoottyTDPyatra telugu movie ratingyatra telugu movie reviewys rajasekhara reddyysr biopicysr padayatra

Also read

Use Facebook to Comment on this PostMenu