01/4/19 3:24 PM

జగన్‌కి గుడ్ న్యూస్ వినిపించిన హైకోర్టు

YS Jaganmohan Reddy attack case handed over to NIA

వైసీపీ అధినేత జగన్‌పై హత్యాయత్నం కేసు కీలక మలుపు తిరిగింది. జగన్‌పై దాడి కేసు విచారణని ఎన్ఐఏకి అప్పగించాలని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. 2018 అక్టోబర్ 25న విశాఖ ఎయిర్‌పోర్టులో శ్రీనివాస్ అనే యువకుడు కోడి కత్తితో జగన్ పై దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది. ఏపీ రాజకీయాలను కుదిపేసింది. దీనిపై విచారణకు ఏపీ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. అయితే ఈ కేసును రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో దర్యాప్తు చేస్తే సాక్ష్యాలు తారుమారయ్యే అవకాశం ఉందని, అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం ప్రమేయం లేని జాతీయ సంస్థ ఎన్ఐఏతో దర్యాప్తు జరిపించాలని జగన్ తరపు న్యాయవాది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై పలుమార్లు వాదోపవాదాలు జరిగాయి. శుక్రవారం తుది వాదనలు విన్న హైకోర్టు ఈ కేసు విచారణను ఎన్ఐఏకి అప్పగించాలని ఉత్తర్వులు జారీచేసింది.

 

ఈ కేసు నమోదు నుంచి దర్యాప్తు వరకు రాష్ట్ర ప్రభుత్వం అనేక రకాలుగా చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడిన విషయాలను తాము న్యాయస్థానానికి వివరించినట్లు జగన్ తరఫు న్యాయవాది తెలిపారు. ఈ కేసును తప్పుదోవ పట్టించేలా డీజీపీ, సిట్ అధికారులు వ్యవహరించిన తీరును పరిశీలించిన హైకోర్టు తమ వాదనలతో ఏకీభవించి విచారణను ఎన్‌ఐఏకి అప్పగించిందని అన్నారు.

 

జగన్‌పై దాడి కేసు ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించింది. జగన్‌పై దాడి వెనుక కుట్ర కోణం ఉందని వైసీపీ నేతలు ఆరోపించారు. పాదయాత్రలో జగన్‌కు లభిస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక ప్రతిపక్ష నేతను చంపేందుకు ప్రభుత్వం స్కెచ్ వేసిందని అన్నారు. దాడి సరిగ్గా జరిగి ఉంటే జగన్ చనిపోయేవారని ఆందోళన వ్యక్తం చేశారు. కత్తి భుజంపై గుచ్చుకోవడంతో జగన్ ప్రాణాలతో బయటపడ్డారని అన్నారు. వైసీపీ చేసిన ఆరోపణలను ప్రభుత్వం తిప్పికొట్టింది. వచ్చే ఎన్నికల్లో సానుభూతి కోసం జగన్ కోడికత్తి నాటకం ఆడారని ఎదురుదాడికి దిగింది. దాడి చేసిన వ్యక్తి జగన్ అభిమాని అని, వైసీపీ నేతలు చెప్పిన ప్రకారమే అతడు దాడి చేశాడని టీడీపీ నేతలు ఆరోపించారు. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడిచింది. ఆపరేషన్ గరుడ పేరు కూడా బయటకు వచ్చింది.

 

కేసుని ఎన్ఐఏకి అప్పగించాలని వైసీపీ నేతలు న్యాయపోరాటం చేశారు. కేసు దర్యాప్తు ఆలస్యమైతే సాక్ష్యాధారాలు తారుమారు అయ్యే అవకాశం ఉందని జగన్ తరుఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. కేసుని నిర్వీర్యం చేసేందుకు, పక్కదారి పట్టించేందుకే రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని కోర్టుకి విన్నవించారు. కేంద్ర దర్యాప్తు సంస్థలతో నిష్పక్షపాతంగా విచారణ నిర్వహించాలని న్యాయస్థానాన్ని కోరారు. చివరికి వారి పోరాటం ఫలించింది. కేసుని ఎన్ఐఏకి అప్పగిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీచేసింది. దీనిపై వైసీపీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. నిజానిజాలు వెలుగులోకి వస్తాయని, కుట్రదారులు ఎవరో తేలిపోతుందని, చంద్రబాబు బండారం బయటపడుతుందని అంటున్నారు. మరోవైపు హైకోర్టు తీర్పుని సవాల్ చేస్తామని ఏపీ ప్రభుత్వం తెలిపింది.

 

ఈ కేసును ఎన్‌ఐఏకి అప్పగించడంపై కేంద్ర, రాష్ట్రాలను హైకోర్టు గతంలోనే అడిగి తెలుసుకుంది. ఈ కేసును ఎన్‌ఐఏకి అప్పగించడంపై కేంద్రం నిర్ణయం తీసుకోకపోతే, తామే తీసుకుంటామని హైకోర్టు తేల్చిచెప్పడంతో కేంద్రం దిగొచ్చి ఎన్‌ఐఏ విచారణకు అంగీకరించింది. ఈ కేసును టేకప్ చేసిన ఎన్ఐఏ విచారణను వేగవంతం చేసింది. ఈ ఘటనపై ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదు చేసిన ఎన్ఐఏ.. అదనపు ఎస్పీ సాజిద్ ఖాన్‌ను విచారణ అధికారిగా నియమించింది. కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం(సీఐఎస్ఎఫ్) అధికారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తును వేగవంతం చేయాలని కేంద్ర హోంశాఖ ఎన్ఐఏను ఆదేశించింది.

Tags : ap cm chandrababuattack on jaganNIASITYs jagan mohan reddyys jagan mohan reddy attack caseysrcp

Also read

Use Facebook to Comment on this PostMenu