04/16/19 11:29 AM

ఆ కారణంతో : జగన్‌ను కాదని నాకే ఓటు వేశారు

150 Plus Seat For TDP, Chandrababu Confidence

ఏపీలో ఎన్నిక‌లు ముగిశాయి. ఓటర్ తీర్పు ఈవీఎంలో నిక్షిప్తమై ఉంది. ఈసారి పోలింగ్ శాతం పెరిగింది. మే 23న ఫలితాలు వస్తాయి. ఈలోపే గెలుపుపై ఎవరికి వారు ధీమా ఉన్నారు. అటు చంద్రబాబ, ఇటు జగన్.. విజయంపై విశ్వాసంగా ఉన్నారు. గెలుపు మాదే అంటే.. కాదు మాదే అంటున్నారు. పెరిగిన పోలింగ్ శాతం మాకే అనుకూలం అని, ఈసారి వైసీపీదే అధికారం అని జగన్ చెబుతున్నారు. అటు చంద్రబాబు కూడా ఇదే అంటున్నారు. గెలుపుపై ఎలాంటి అనుమానాలు లేవన్నారు. అస‌లు టీడీపీ ఎందుకు ఓడిపోతుంది అని ప్రశ్నించారు. ప్ర‌జ‌లు ఓట్లు వేసింది మీరు చూడ‌లేదా అని అడిగారు. అంతేకాదు మాకు 150 ప్లస్ సీట్లు వస్తాయని కాన్ఫిడెంట్ గా చెబుతున్నారు.

 

ఈవీఎంలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న చంద్రబాబు..మరోసారి ప్రెస్ మీట్ పెట్టి ఈసీపై విమర్శలు చేశారు. ఈవీఎంలపై దేశవ్యాప్తంగా చర్చ జరగాల్సిందే అన్నారు. ఇదే క్రమంలో టీడీపీ గెలుపు, వచ్చే సీట్లపై చంద్రబాబు స్పందించారు. ఓడిపోతామనే భయంతోనే ఈసీపై ఆరోపణలు చేస్తున్నారు అనే ప్రచారాన్ని చంద్రబాబు ఖండించారు. గెలుపుపై తనకు ఎలాంటి డౌట్లు లేవన్నారు. 150 ప్లస్ సీట్లు వస్తాయని చెప్పారు. పెరిగిన పోలింగ్ శాతమే ఇందుకు నిదర్శనం అన్నారు.

 

పోలింగ్ సరళిపై చంద్రబాబు ఆశలు పెట్టుకున్నారు. మ‌హిళ‌లు, వృద్దులు పెద్ద ఎత్తున త‌ర‌లి వ‌చ్చారని చెప్పారు. ఇత‌ర ప్రాంతాల‌కు చెందిన వారూ ఓటు వేసేందుకు పోటెత్తారని అన్నారు. వారంతా జ‌గ‌న్ కోసం వ‌స్తారా.. జ‌గ‌న్ గొప్ప‌తనం ఏంటి.. జ‌గ‌న్ కు ఎందుకు ఓటు వేస్తారు..అని ప్రశ్నల వర్షం కురిపించారు. తెలుగుదేశం అధికారంలోకి రావ‌టం ఖాయ‌మ‌ని స్ప‌ష్టం చేసారు. మే 23 తర్వాత మంచి ముహూర్తం చూసుకొని ప్ర‌మాణ స్వీకారం చేస్తాన‌ని చెప్పారు.

 

విజయంపై చంద్రబాబు కాన్ఫిడెన్స్ కి కారణం లేకపోలేదు. సంక్షేమ, అభివృద్ధి పథకాలు.. పెన్షన్లు, పసుసు కుంకుమ.. టీడీపీకి ప్లస్ కానున్నాయని చంద్రబాబు నమ్ముతున్నారు. పోలింగ్ స‌ర‌ళిపై పార్టీ నేత‌ల‌తో స‌మీక్ష స‌మ‌యంలో చంద్ర‌బాబు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసారు. మ‌హిళ‌లు, వృద్దులు టీడీపీకే ఓటు వేశార‌ని.. ప‌సుపు కుంకుమ‌, పెన్ష‌న్ల పెంపు ప్ర‌భావం మ‌హిళ‌లపై భారీగా ఉంద‌ని చంద్ర‌బాబు విశ్లేషించారు. మోడీ, కేసీఆర్, జగ‌న్ క‌లిసి చంద్ర‌బాబుపై దాడి చేస్తున్నార‌నే ప్ర‌చారం ప్ర‌జ‌ల్లోకి బాగా వెళ్లింద‌ని కొంద‌రు పార్టీ సీనియ‌ర్లు అభిప్రాయ‌ప‌డ్డారు. ఇది కూడా టీడీపీకి వర్కవుట్ అయిందన్నారు. చంద‌బ్రాబుని ఒంట‌రి చేసి..కుట్రలు చేస్తున్నార‌నే అభిప్రాయం ప్ర‌జ‌ల్లో ఏర్ప‌డింద‌ని..అది కూడా టీడీపీకి ఓట‌ర్లు అండ‌గా నిల‌వాల‌నే సంక‌ల్పానికి దోహ‌దం చేసింద‌ని ఓ సీనియ‌ర్ మంత్రి అభిప్రాయ ప‌డ్డారు. జ‌గ‌న్ అధికారంలోకి వ‌స్తే పోల‌వ‌రం..అమ‌రావ‌తి ఆగిపోతాయ‌నే భావ‌న చాలా మందిలో ఉంద‌ని..అందు కోస‌మే జ‌గ‌న్ ఒక్క చాన్స్ అనే నినాదం కంటే అభివృద్ది కోసం టీడీపీకి ఓటు వేశార‌ని చంద్ర‌బాబు అన్నట్టు తెలుస్తోంది.

 

ఈసారి గెలుపు తమదే అన్న జగన్ వ్యాఖ్యలను చంద్రబాబు కొట్టిపారేశారు. 2014 ఎన్నిక‌ల తర్వాత కూడా ఇదే ర‌కంగా వైసీపీ అధికారంలోకి వ‌స్తుందని ప్ర‌చారం చేసుకున్నార‌ని.. ఆ తర్వాత ఫ‌లితాలు ఏ ర‌కంగా వ‌చ్చాయో చూశామని పార్టీ నేతలతో చంద్రబాబు అన్నారు. ప్ర‌ధానంగా ప‌సుపు కుంకుమ లబ్ది దారులు, సామాజిక పెన్ష‌న్లు అందుకున్న వారు, ఇత‌ర ప్రాంతాల నుండి వ‌చ్చిన వారు టీడీపీకే ఓటు వేశార‌ని చంద్ర‌బాబు ప‌దే ప‌దే చెబుతున్నారు. పోలింగ్ రోజు మ‌ధ్నాహ్నం వ‌ర‌కు వైసీపీకి అనుకూలంగా ట్రెండ్ క‌నిపించినా ఆ తర్వాత తెలుగుదేశంకి అనుకూలంగా మారింద‌నేది టీడీపీ అంత‌ర్గ‌త విశ్లేష‌ణ‌. మరి చంద్రబాబు కాన్ఫిడెన్స్, లెక్కలు, విశ్లేషణ, నమ్మకం ఎంతవరకు నిజం అవుతాయో చూడాలి. అసలు విజేత ఎవరు అన్నది మే 23వ తేదీన తేలిపోనుంది.

Tags : ap cmap elections 2019chandrababuevmspasupu kunkumaPensionswinYs jagan mohan reddy

Also read

Use Facebook to Comment on this PostMenu