07/9/19 7:44 PM

ఆ ఇద్దరి లక్ష్యం చంద్రబాబుని జైలుకి పంపడమేనా?

All Set For Chandrababu Arrest

దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఉన్నాయి. ఇంత రసవత్తరమైన రాజకీయాలు మరెక్కడా కనిపించవేమో. ఎన్నికల సమయంలోనే కాదు… ఫలితాలు వచ్చి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత కూడా పాలిటిక్స్ లో ఉహించని పరిణామాలు కంటిన్యూ అవుతున్నాయి. తాజాగా మరో సంచలన వార్త ఏపీ రాజకీయాలను వేడెక్కించింది. అదే మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ వార్త. కొంతకాలంగా చంద్రబాబు అరెస్ట్ కి సంబంధించిన వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ఇందుకు కారణం బీజేపీ జాతీయ కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ బీజేపీ కో-ఇంచార్జ్ సునీల్ దేవ్ ధర్ చేసిన వ్యాఖ్యలే. ఏపీలో చంద్రబాబుకి ఈయన కొత్త మొగుడిలా తయారయ్యారు. ఛాన్స్ చిక్కితే చాలు.. చంద్రబాబుని ఏకిపారేస్తున్నారు. అంతేకాదు.. చంద్రబాబు అరెస్ట్ కావడం ఖాయం అని చెప్పి టీడీపీ శ్రేణులపై పెద్ద బాంబు పేల్చారు.

 

సునీల్ దేవ్ ధర్.. ఏపీ బీజేపీ ఇంచార్జ్. ఈయనగారి దూకుడు మాములుగా లేదు. టీడీపీ పేరు ఉన్నా, చంద్రబాబు పేరు విన్నా అంతెత్తున ఎగిరిపడుతున్నారు. ఈయనకి ఎలా తెలుసో ఏమో కానీ.. చంద్రబాబు అరెస్ట్ అవ్వడం మాత్రం ఖాయం అంటున్నారు. టీడీపీ ప్రభుత్వం హయాంలో ఏపీలో భారీ ఎత్తున అవినీతి జరిగిందని, చంద్రబాబు భారీగా అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారని దేవ్ ధర్ ఆరోపిస్తున్నారు. ఏపీ సీఎం జగన్ రావడంతో.. చంద్రబాబు అవినీతి, అక్రమాలు వెలుగులోకి వస్తాయని, చంద్రబాబు అరెస్ట్ కావడం ఖాయం అని విశ్లేషిస్తున్నారు. చంద్రబాబు అరెస్ట్ ఖాయం అని తెలిసే.. టీడీపీకి చెందిన 18మంది ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్ లో ఉన్నారని, వారంతా బీజేపీలో చేరతారని దేవ్ ధర్ మరో బాంబు పేల్చారు.

 

చంద్రబాబు అవినీతిపై విచారణ జరిపించాల్సిన బాధ్యత సీఎం జగన్ పై ఉందని దేవ్ ధర్ అన్నారు. అంతేకాదు.. రెండేళ్లలో చంద్రబాబు జైలుకి వెళ్లడం ఖాయమని కూడా చెప్పారు. అధినేతే లేనప్పుడు ఇక మేము మాత్రం చేసేది ఏముందని.. రాజకీయ భవిష్యత్తు కోసం టీడీపీకి చెందిన 18మంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరతారనేది దేవ్ ధర్ అభిప్రాయం. టీడీపీ హయాంలో మంత్రులుగా పనిచేసిన వారు తీవ్రమైన అవినీతికి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. మునిగిపోయే నావ టీడీపీలో ఉండడం ఎందుకని భావించి.. టీడీపీ ఎమ్మెల్యేలు బయట పడటం కోసం తమను సంప్రదిస్తున్నారని దేవ్ ధర్ తెలిపారు. అంటే.. అసెంబ్లీలో టీడీపీ ప్రతిపక్షం హోదా కూడా కోల్పోతుందని, బీజేపీకి ప్రతిపక్ష హోదా దక్కనుందని దేవ్ ధర్ జోష్యం చెప్పారు. రానున్న రోజుల్లో ఏపీలో బీజేపీ బలపడటం ఖాయమన్నారాయన. వైసీపీకి గట్టి పోటీ ఇచ్చేది బీజేపీయే అని కూడా చెప్పారు.

 

ఇప్పటికే ఎవరు ఎటు వెళతారో అనే సందిగ్ధంలో టీడీపీ కొట్టుమిట్టాడుతుంటే బీజేపీ నాయకులు రోజుకో బాంబు పేలుస్తున్నారు. నిజానిజాల మాట ఎలా ఉన్నా బీజేపీ నేతల వ్యాఖ్యలు పొలిటికల్ సర్కిల్స్ లో పెద్ద దుమారాన్నే రేపాయి. దీనికి తోడు చంద్రబాబు అరెస్ట్ కి రంగం సిద్ధం అంటూ దేవ్ ధర్ చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇదంతా దేవ్ ధర్ కి ఎలా తెలుసో అని తెలుగు తమ్ముళ్లు చర్చించుకుంటున్నారు. అసలు ఆయన చెప్పిదంతా పిచ్చివాగుడూ అని కొందరు టీడీపీ నేతలు కొట్టిపారేశారు. టీడీపీ నేతలను కన్ ఫ్యూజ్ చేసి భయపెట్టి తమ పార్టీలో చేర్చుకోవడానికి దేవ్ ధర్ ఇలా మైండ్ గేమ్ ఆడారా అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో.. బీజేపీ పెద్దలు.. దేవ్ ధర్ ద్వారా హింట్ ఇచ్చారా అనే అనుమానాలూ లేకపోలేదు. టీడీపీని దెబ్బకొట్టేందుకు ప్రధాని మోడీ, సీఎం జగన్ చేతులు కలిపారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇదంతా బీజేపీ, వైసీపీ కుట్ర అని వారంటున్నారు. మొత్తంగా ఏం జరగనుంది అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

 

ఇక సునీల్ దేవ్ ధర్ విషయానికి వస్తే.. బీజేపీ కీలక నేత, వ్యూహా రచనలో సిద్ధహస్తుడు. దేశంలో అనేక రాష్ట్రాల్లో కమలం పార్టీకి విజయాన్ని అందించి పెట్టిన బీజేపీ కీలక నేతల్లో సునీల్ దేవ్ ధర్ ఒకరు. కనీసం ఒక ఓటు శాతం కూడా లేని త్రిపురలాంటి కష్టమైన రాష్ట్రంలో కూడా కమలం జెండా ఎగురవేసిన ఘనత సునీల్ దేవ్ ధర్ ది. ఏపీ ప్రజల్లో ఇప్పుడు బీజేపీ దోషిగా నిలబడింది. ప్రత్యేక హోదా ఇవ్వనని చెప్పడం, విశాఖ రైల్వే జోన్, కడప స్టీల్ ఫ్యాక్టరీ వంటి విషయాలను నాన్చుతుండటం కూడా బీజేపీకి మైనస్ గా మారాయి. ఏపీలో బలపడాలంటే వీటిని అధిగమించాలి. ఈ పరిస్థితుల్లో సునీల్ దేవ్ ధర్ అయితేనే పార్టీని ట్రాక్ పైకి తీసుకురాగలరన్న నమ్మకంతో అమిత్ షా ఆయనను ఏపీ బీజేపీ కో ఇన్ ఛార్జిగా నియమించారట. ఏపీలో బీజేపీని పటిష్టం చేస్తారన్న నమ్మకం అమిత్ షాకు మెండుగా ఉండటంతో దేవ్ ధర్ ని ప్రత్యేకంగా ఏపీకి పంపినట్లు కమలం పార్టీ నేతలు చెబుతున్నారు.

Tags : ap cmarrestBJPchandrababumodisunil deodharTDPys jagan

Also read

Use Facebook to Comment on this PostMenu