02/14/19 11:09 AM

చంద్రబాబుకి వరుస షాక్‌లు.. జగన్ ఫుల్ హ్యాపీ.. ఆ భయంతోనే పార్టీ వీడుతున్నారా?

Another Big Shock For Chandrababu Naidu

ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఎన్నికలకు సమయం దగ్గర పడటంతో రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. జంపింగ్‌ల పర్వం పీక్స్‌కు చేరింది. ముఖ్యంగా అధికార పార్టీకి చెందిన నేతలు పక్క చూపులు చూస్తున్నారు. ఈ విషయంలో సీఎం చంద్రబాబుకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. ప్రధాన ప్రతిపక్ష నేత జగన్ మాత్రం హ్యాపీగా ఉన్నారు. టీడీపీ నాయకులు ఒక్కొక్కరిగా పార్టీ వీడుతున్నారు. టీడీపీలో ఉంటే ఓడిపోతామనే భయమో, టికెట్ రాదనే బెంగో తెలియదు కానీ.. సేఫ్ జోన్ చూసుకుంటున్నారు. అసంతృప్తితో కొందరు పార్టీలు మారుతుంటే.. మరికొందరు ముందు జాగ్రత్తగా పార్టీ మారుతున్నారు. టికెట్ కన్‌ఫర్మ్ చేసుకుని జంప్ అవుతున్నారు. ఇప్పటికే చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ టీడీపీకి గుడ్ బై చెప్పి జగన్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. ఆ షాక్ నుంచి తేరుకోకముందే.. టీడీపీకి మరో ఎదురుదెబ్బ తగిలేలా ఉంది.

 

ఉత్తరాంధ్రకు చెందిన టీడీపీ ఎంపీ పార్టీ వీడుతారనే ప్రచారం ఊపందుకుంది. అనకాపల్లి ఎంపీ అవంతీ శ్రీనివాస్ వైసీపీలో చేరతారనే వార్తలు వినిపిస్తున్నాయి. చాలాకాలంగా ఆయన పార్టీ తీరుపై అసంతృప్తిగా ఉన్నట్టుగా తెలుస్తోంది. అసెంబ్లీ సీటుపై గతంలో చంద్రబాబు హామీ ఇచ్చినప్పటికీ ఎటూ తేల్చకపోవడంతో.. ఆయన నిరాశలో ఉన్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఆయన పార్టీ మారబోతున్నారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఎంపీగా ఉన్న అవంతీ… ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయాలని యోచిస్తున్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే చంద్రబాబుతో చర్చించారు. గతంలో అవంతికి ఓకే చెప్పిన చంద్రబాబు.. ప్రస్తుతం అసెంబ్లీ టికెట్‌పై క్లారిటీ ఇవ్వడం లేదట. దీంతో ఆయన పార్టీ మారాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. బాబు తీరు పట్ల సన్నిహితుల దగ్గర అవంతి శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేసినట్టు సమాచారం.

 

అవంతి శ్రీనివాస్ పార్టీ మారతారనే వార్తలు గతంలోనే వచ్చాయి. కానీ ఆయన వాటిని ఖండించారు. చంద్రబాబు నాయకత్వంలోనే పని చేస్తానని తెలిపారు. కానీ ఆయన పార్టీ మారతారనే రూమర్లు మాత్రం జోరుగా ప్రచారంలో ఉన్నాయి. గురువారం హైదరాబాద్‌లో ఆయన జగన్‌ను కలుస్తారని తెలుస్తోంది. భీమిలీ అసెంబ్లీ టికెట్‌ను తనకు ఇవ్వాలని, పార్టీ అధికారంలోకి వస్తే మంత్రి పదవి ఇవ్వాలని ఆయన జగన్‌ను డిమాండ్ చేసినట్టు సమాచారం.

 

గంటా శ్రీనివాస్‌కు సన్నిహితుడైన అవంతి శ్రీనివాస్ 2009లో ప్రజారాజ్యం పార్టీ తరఫున భీమిలి ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత చిరంజీవి పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశాక 2014లో టీడీపీ తరఫున అనకాపల్లి ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. భీమిలీ సీటు కోసం అవంతి శ్రీనివాస్ గంటాతో పోటీకి సిద్ధపడుతున్నట్టు స్పష్టమవుతోంది.

 

టీడీపీకి గుడ్ బై చెప్పాక ఆమంచి.. సీఎం చంద్రబాబుపై దుమ్మెత్తిపోశారు. చంద్రబాబు తీరువల్ల చాలామంది టీడీపీని వీడేందుకు సిద్ధంగా ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాటల్ని నిజం చేస్తూ అనకాపల్లి ఎంపీ అవంతీ శ్రీనివాస్ కూడా టీడీపీకి గుడ్‌బై చెప్పేందుకు సిద్ధమవుతున్నారనే ప్రచారం ఊపందుకుంది. ఈ లెక్కన మరికొందరు నేతలు కూడా పార్టీ మారే అవకాశాలు లేకపోలేదు. టీడీపీకి చెందిన ముగ్గురు ఉత్తరాంధ్ర నేతలు వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారని సమాచారం. ఇద్దరు టీడీపీ ఎంపీలు వైసీపీతో చర్చలు జరుపుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. మరో ఉత్తరాంధ్ర ఎమ్మెల్యే కూడా వారి బాటలోనే ఉన్నాడట. మొత్తంగా ఎన్నికల వేళ జరుగుతున్న ఈ పరిణామాలు అధికార టీడీపీలో కలవరం రేపగా.. ప్రధాన ప్రతిపక్షం వైసీపీలో మాత్రం జోష్ నింపాయి. చివరికి.. ఈ ఈక్వేషన్స్ ఎవరికి ప్లస్ అవుతాయో, ఎవరికి మైనస్ అవుతాయో చూడాలి.

Tags : Amanchi Krishna Mohananakapalli mpAvanthi Srinivasbhimili mla ticketcm chandrababushock for tdptdp leaders joining ysrcpys jaganysrcp

Also read

Use Facebook to Comment on this PostMenu