05/20/19 8:18 PM

సర్వేలను నమ్మొద్దు : మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం

AP CM Chandrababu Confidence On TDP Win

ఎగ్జిట్ పోల్స్ పై ఏపీ సీఎం చంద్రబాబు ఓ రేంజ్ లో మండిపడ్డారు. ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాట్ పోల్స్ కాదన్నారు. వైసీపీకి అనుకూలంగా ఎగ్జిట్ పోల్స్ రావడంపై చంద్రబాబు అనుమానాలు వ్యక్తం చేశారు. సర్వేలను నమ్మొద్దని కోరారు. ఏపీలో నూటికి వెయ్యి శాతం గెలుస్తామని చెప్పారు. ఏపీలో టీడీపీ గెలుపుపై ఎవరికీ ఎలాంటి అనుమానాలు అక్కర్లేదన్న చంద్రబాబు.. మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. అభివృద్ధి, సంక్షేమం వల్లే టీడీపీ గెలుస్తుందన్న చంద్రబాబు.. వీవీప్యాట్ స్లిప్పులను లెక్కించాల్సిందేనని మరోసారి స్పష్టంచేశారు.

 

సార్వత్రిక ఎన్నికలు ముగియడంతో ఎగ్జిట్ పోల్స్ వచ్చేశాయి. ఒక్క లగడపాటి సర్వే తప్ప.. దాదాప్పు అన్ని న్యూస్ చానళ్లు, సర్వేల ముందస్తు అంచనాల్లో వైసీపీకే పట్టం కటాయి. ఏపీలో జగన్ పార్టీ గెలుస్తుందని చెప్పాయి. ఈ సర్వేలపై చంద్రబాబు ఘాటుగా రియాక్ట్ అయ్యారు. ఏపీలో టీడీపీ గెలుపుని ఎవ్వరూ ఆపలేరని తేల్చి చెప్పారు. సార్వత్రిక ఎన్నికల్లో 18 నుంచి 20 లోక్ సభ స్థానాలను టీడీపీ గెలుచుకోబోతోందని చంద్రబాబు జోస్యం చెప్పారు. టీడీపీకి 110 అసెంబ్లీ స్థానాలు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ఈ సంఖ్య 120 నుంచి 130 సీట్ల వరకూ వెళ్లవచ్చని అభిప్రాయపడ్డారు. ఏపీలో నూటికి నూరు శాతం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నామని స్పష్టం చేశారు.

 

కొందరు మైండ్ గేమ్స్ తో గందరగోళం సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నారని ప్రతిపక్షంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వీటిని పట్టించుకోవద్దని టీడీపీ శ్రేణులకు సూచించారు. సులభంగా నిర్వహించాల్సిన ఎన్నికలను ఈసీ వివాదంగా మార్చేసిందని విమర్శించారు. మంగళవారం మధ్యాహ్నం అన్ని పార్టీలతో కలిసి ఢిల్లీలో ధర్నా నిర్వహిస్తామని చంద్రబాబు ప్రకటించారు. 50 శాతం వీవీప్యాట్ స్లిప్పులను ఈవీఎంలతో సరిపోల్చాలన్న డిమాండ్ తో ఆందోళన చేపడతామని చంద్రబాబు తెలిపారు. సార్వత్రిక ఎన్నికల వేళ ఈసీ తీవ్రమైన అధికార దుర్వినియోగానికి పాల్పడిందని చంద్రబాబు ఆరోపించారు. కౌంటింగ్ ప్రక్రియపై టీడీపీ శ్రేణులకు ఎల్లుండి మరోసారి శిక్షణ ఇస్తామన్నారు. ప్రధాని మోదీ బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తూ అందరినీ భయభ్రాంతులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు.

 

ఎన్నికల సందర్భంగా సర్వేలు జరుగుతూ ఉంటాయని సీఎం చంద్రబాబు తెలిపారు. అంతిమంగా ఇప్పుడు సర్వేలు చేయించుకోవడం ఓ అలవాటుగా మారిపోయిందన్నారు. టీడీపీ 1983 నుంచి సర్వేలు చేస్తూనే ఉందని చెప్పారు. అంటే గత 35 ఏళ్లుగా టీడీపీ సర్వేలు చేయిస్తూనే ఉందనీ, అందులో భాగంగానే ఈసారి కూడా సర్వేలు చేయించామని వెల్లడించారు. అంతేకాకుండా ఐవీఆర్ఎస్ ద్వారా ప్రజల అభిప్రాయాలను తెలుసుకుంటున్నామని పేర్కొన్నారు. ‘ఈరోజు చెబుతున్నా.. రాసుకోండి మీరు. నూటికి వెయ్యి శాతం గెలవబోయేది తెలుగుదేశం పార్టీ’ అని ధీమా వ్యక్తం చేశారాయన.

 

టీడీపీ గెలుస్తుందని చెప్పడానికి చాలా కారణాలు ఉన్నాయని చంద్రబాబు అన్నారు. ఏప్రిల్ 11న ఈవీఎంల సమస్యలు తలెత్తడంతో తాను ఒక్క పిలుపు ఇచ్చానని, ఓటు మిస్ కావొద్దని కోరానని, తాను అలా పిలుపు ఇవ్వగానే సాయంత్రం ఆరు గంటలకల్లా పోలింగ్ కేంద్రానికి చేరుకుని మరుసటి రోజు ఉదయం 4.30 గంటల వరకూ లైన్లలో నిలబడి ఓటు వేశారని చంద్రబాబు చెప్పారు. టీడీపీ విశ్వసనీయతకు ఇంతకంటే ఉదాహరణ ఏం కావాలని అన్నారు. టీడీపీ గెలవకుంటే జన్మభూమికి అన్యాయం జరుగుతుందన్న ఉద్దేశంతో ఏపీ ప్రజలు భారీగా తరలి వచ్చారన్నారు. తెలంగాణ ఆర్టీసీ బస్సులను రద్దు చేసినా, రైళ్లలో రిజర్వేషన్ దొరక్కపోయినా ఏ వాహనం దొరికితే దానిలో ప్రజలు తరలివచ్చి ఓటు వేశారని అన్నారు. తొలిసారి టీడీపీ చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజలు పట్టం కట్టారని చంద్రబాబు చెప్పారు. తాను రాజకీయాల్లో 40 ఏళ్లుగా ఉన్నప్పటికీ గత ఐదేళ్లలో జరిగినన్ని సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ఎప్పుడూ జరగలేదన్నారు.

Tags : ap cm chandrababu naiduexit pollssurveysTDPwinYs jagan mohan reddyysr congress party

Also read

Use Facebook to Comment on this PostMenu