05/17/18 6:54 PM

కేంద్రంలో అధికారంలో ఉంటే ఏమైనా చేయొచ్చా? చంద్రబాబు ఆగ్రహం

Untitled-1 copy

కర్ణాటకలో నెలకొన్న రాజకీయ పరిణామాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. మెజార్టీ ఉన్న పార్టీలను కాదని బీజేపీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం గవర్నర్ ఇవ్వడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో కర్ణాటక రాజకీయ పరిణామాలపై ఏపీ సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సైతం స్పందించారు. భారతీయ జనతా పార్టీ తీరును చంద్రబాబు తప్పు పట్టారు. ప్రజాస్వామ్యబద్ధంగానే అన్ని వ్యవహారాలు జరగాలని, కానీ కర్ణాటకలో అలా జరగడం లేదని చంద్రబాబు అన్నారు. కర్ణాటకలో గవర్నర్.. కాంగ్రెస్, జేడీఎస్‌లనే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందన్నారు. ఈ సందర్భంలో గవర్నర్ వ్యవస్థకు వ్యతిరేకంగా తాము గతంలో కూడా పోరాడామని చంద్రబాబు గుర్తు చేశారు.

 

కాంగ్రెస్, జేడీఎస్‌ లు పోరుబాట పట్టాల్సిందని.. రాజ్‌ భవన్ ముందు బైఠాయించాల్సిందని, అక్కడే స్నానాలూ, భోజనాలు చేస్తూ ఉండాల్సిందని, ఈ అంశం దేశమంతా చర్చనీయాంశం అయ్యేలా చేయాల్సిందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.

 

ప్రకాశం జిల్లా కందుకూరులో నీరు-ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు కర్ణాటక పరిణామాలపై తీవ్రంగా స్పందించారు. “కర్ణాటకలో రెండు పార్టీలు కలిసి మెజార్టీ సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామంటే, మెజార్టీ లేని ఇతర పార్టీకి అవకాశం ఇచ్చారు. ఆ రోజు బీజేపీ చెప్పిన మాటలేంటీ? ఈ రోజు చేస్తోన్న పనులేంటీ? ప్రజాస్వామ్య విలువల గురించి మాట్లాడారు. కాంగ్రెస్‌ పార్టీ అన్యాయం చేస్తోందని అన్నారు. నాడు కాంగ్రెస్‌ పార్టీ వల్ల ఏపీలో ఎన్టీఆర్‌ నష్టపోయారు. 1984లో అప్రజాస్వామికంగా ఎన్టీఆర్‌ ని పదవి నుంచి తీసేస్తే 30 రోజులు పోరాడి మళ్లీ ఆయనను సీఎం చేసిన ఘనత తెలుగు ప్రజలది, టీడీపీది. ఒక పద్ధతి ప్రకారం జరగాలి, ప్రజాస్వామికంగా ముందుకు వెళ్లాలి’ అని చంద్రబాబు హితవు పలికారు. కేంద్రంలో అధికారంలో ఉన్నామని కర్ణాటకలో గానీ, మన రాష్ట్రంలోగానీ ఎక్కడైనా ఇష్టానుసారంగా ప్రవర్తించడం మంచిది కాదని చంద్రబాబు వ్యాఖ్యానించారు. కర్ణాటకలో తెలుగు ప్రజల ఓట్లు బీజేపీకి పడలేదని, ఫలితాలను బీజేపీ నేతలు సమీక్షించుకోవాలని కూడా చంద్రబాబు అన్నారు.

 

కాగా, ఏపీలో పాలన బాగోలేదని బీజేపీ, వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలోనే అత్యుత్తమ పాలనను ఇస్తున్న ఘనత తెలుగుదేశం పార్టీదే అని ఆయన అన్నారు.

 

‘’వైసీపీలో ఉండే ఏ1, ఏ2లు నన్ను విమర్శిస్తున్నారు. నన్ను ఏకవచనంతో సంబోధిస్తూ మాట్లాడుతున్నారు. ప్రజలను చైతన్య వంతులను చేసే ప్రయత్నం చేయాలి తప్ప అసత్యాలను ప్రచారం చేస్తూ తిరగకూడదు. ఏపీలో టీడీపీ మళ్లీ గెలవడం అనేది ముఖ్యమైన అంశం” అని సీఎం అన్నారు.

Tags : ap cm chandrababu naiduBJPcongress jduKarnataka assembly electionsKarnataka governorpm modiTDP

Also read

Use Facebook to Comment on this Post



Menu