02/20/18 4:12 PM

జగన్ సవాల్ పై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..!

Untitled-1 copy

ఏపీ రాజకీయాలు అవిశ్వాసం చుట్టూ తిరుగుతున్నాయి. కేంద్రంపై అవిశ్వాసం పెట్టే విషయంలో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. సవాళ్లు, ప్రతిసవాళ్లతో ఏపీ రాజకీయాలు వేడెక్కాయి. వైసీపీ అధినేత జగన్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇప్పటికే అవిశ్వాసం గురించి మాట్లాడారు. తాజాగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా అవిశ్వాసంపై స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.

 

ఎంపీలు తక్కువగా ఉన్న కారణంగా మనం అవిశ్వాస తీర్మానం పెట్టలేమ‌ని, అయితే, అవసరమైతే అన్ని పార్టీల సాయం తీసుకుని అవిశ్వాసం దిశగా వెళతాన‌ని చంద్రబాబు అన్నారు. కానీ, అది చివరి ప్రయత్నంగా మాత్ర‌మే ప్రయోగించాలని తేల్చి చెప్పారు. విజయవాడలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో నిర్వహించిన పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు.

 

అవిశ్వాస తీర్మానం పెట్టాలంటే 54 మంది ఎంపీలు ఉండాలని చంద్రబాబు తెలిపారు. తాను అవిశ్వాస తీర్మానం వల్ల లాభం లేదని అన్నానని కొందరు అంటున్నారని, తాను అలా అనలేదని వివరించారు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని, అన్ని పోరాటాలు చేసిన తర్వాత ఆ ప్ర‌య‌త్నం చేయాల‌ని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రత్యేక హోదా ఇస్తారో ప్యాకేజీ నిధులు ఇస్తారో కేంద్ర ప్రభుత్వం తేల్చుకోవాలని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

 

తాము కేంద్ర ప్ర‌భుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేస్తున్నామ‌ని చంద్రబాబు చెప్పారు. విభజన వల్ల నష్టపోయిన రాష్ట్రానికి న్యాయం చేస్తారనే బీజేపీతో కలిశామ‌ని వెల్లడించారు. అయినా న్యాయం జరగలేదని అన్నారు. ఆనాడు రాష్ట్రాన్ని హేతుబద్ధంగా విభజించలేదని చంద్రబాబు ఆరోపించారు.

 

ఈ సందర్భంగా ప్రతిపక్ష వైసీపీపై చంద్రబాబు ఫైర్ అయ్యారు. గతంలో రాజీనామా చేస్తామన్న వైసీపీ ఇప్పుడు డ్రామాలు ఆడుతోందని ఆయన విమర్శించారు. రాష్ట్రం ఎట్టి పరిస్థితుల్లోనూ అభివృద్ధి కాకూడదనేదే జగన్నాటకం వెనకున్న అసలైన కారణమని చంద్రబాబు ధ్వజమెత్తారు. గత మూడేళ్ల నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందకున్నా… ఇతర రాష్ట్రాల కన్నా గొప్పగా మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేశామని సీఎం చెప్పుకొచ్చారు. ఏపీకి న్యాయం జరిగేంత వరకు పోరాటం ఆపరాదని చంద్రబాబు స్పష్టం చేశారు.

 

ఇదే సమయంలో బీజేపీ నేతలపై కూడా చంద్రబాబు మండిపడ్డారు.  రాష్ట్రానికి అవి ఇచ్చాం, ఇవి ఇచ్చాం అంటూ బీజేపీ నేతలు ప్రకటనలు మొదలు పెట్టారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీకి వెళ్లి రాష్ట్రానికి రావాల్సిన వాటిని అడగాల్సిన బీజేపీ నేతలు… టీడీపీనే ప్రశ్నించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావు ప్లకార్డులు పట్టుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తే… ఆయన నిరసనకు, తమకు సంబంధం లేదని గులాం నబీ ఆజాద్ అన్నారని… ఇప్పుడేమో ఇక్కడకు వచ్చి, కేంద్రానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం పెడతామని కాంగ్రెస్ నేతలు అంటున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రయోజనాలు నెరవేరాలంటే… అన్ని పార్టీల మద్దతు కూడగట్టి, పోరాటం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు.

Tags : ap cm chandrababu naiduBJPNo confidence Motionspecial statusTDPYs jagan mohan reddyysrcp

Also read

Use Facebook to Comment on this Post



Menu