07/12/18 9:51 PM

నేనలా చేసి ఉండకపోతే ఏపీ మరో బీహార్ అయ్యేది: చంద్రబాబు

Untitled-1 copy

సరైన ప్రణాళికతో వెళుతూ దక్షిణాది రాష్ట్రాలతో పోటీపడుతున్నామని, లేకపోతే, ఏపీ మరో బీహార్ లా తయారయ్యేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఆ పరిస్థితి రాకుండా పటిష్ట ప్రణాళికతో రాష్ట్రాన్ని అభివృద్ధి బాట పట్టించామని సీఎం తెలిపారు. రాష్ట్రంలో టీడీపీ అధికారం చేపట్టి 1500 రోజులు పూర్తైన సందర్భంగా అమరావతిలో ఏర్పాటు చేసిన వర్క్ షాప్‌ లో సీఎం మాట్లాడారు. ఎన్నికల ఏడాదిలో చేపట్టాల్సిన కార్యక్రమాలపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.

 

మన రాష్ట్రంలో అన్ని ఎన్నికలు ఒకేసారి జరుగుతాయని, స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో తెలంగాణ రాష్ట్రానికి కోర్టు ఏదైతే చెప్పిందో అదే మనకూ వర్తిస్తుందని సీఎం చంద్రబాబు అన్నారు. బీజేపీకి ఇబ్బంది ఉందనే జమిలి ఎన్నికలు అంటోందని, వచ్చే ఎన్నికల్లో రెండు, మూడు రాష్ట్రాల్లో ఓడిపోతామన్న భయంతో ఈ ఎన్నికలను బీజేపీ తెరపైకి తెచ్చిందని చంద్రబాబు విమర్శించారు.

 

ఏపీలో వ్యవసాయరంగానికి సంబంధించి ఎన్నో ఇబ్బందులను అధిగమించామని, రుణమాఫీతో రైతుల్లో ఒక నమ్మకం ఏర్పడిందని సీఎం అన్నారు. గత ప్రభుత్వంలో ఎన్నో కుంభకోణాలు చూశామని, వాన్ పిక్, లేపాక్షి, బాక్సైట్ కుంభకోణాలు కొన్ని మాత్రమేనని, కాంగ్రెస్ పాలనలో పారిశ్రామికవేత్తలు, అధికారులు జైలుకెళ్లారని, ఏపీ బ్రాండ్ ఇమేజ్ ను దెబ్బతీశారని ధ్వజమెత్తారు.

 

‘ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన అన్ని హామీలను అమలు చేశాం. చెప్పినదాని కంటే ఎక్కువే చేశాం. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా రుణమాఫీ హామీని నిలబెట్టుకున్నాం. వీటన్నింటినీ ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలి’ అని పార్టీ శ్రేణులకు చంద్రబాబు సూచించారు. రుణమాఫీ అమలు విషయంలో కేంద్రం ఎన్నో రకాల ఇబ్బందులు పెట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు.

 

పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిపై కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సంతృప్తిని, ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారని చంద్రబాబు తెలిపారు. ఆయన నేరుగా ప్రాజెక్టును సందర్శించిన తర్వాత పనుల్లో అద్భుతమైన పురోగతి కనిపిస్తోందని అన్నట్లు చెప్పారు. ఓ భారీ ప్రాజెక్ట్ నిర్మాణ పనులు ఇంత వేగంగా జరగడం చూసి తనకు ఆశ్చర్యమేసిందని గడ్కరీ ప్రశంసించారని చంద్రబాబు తెలిపారు.

 

పోలవరం ప్రాజెక్టులో 56 శాతానికి పైగా పనులు పూర్తయ్యాయని చంద్రబాబు తెలిపారు. పోలవరం డీపీఆర్‌-1లో కేంద్రం ఇంకా రూ.400 కోట్లకు పైగా ఇవ్వాల్సి ఉందని చెప్పారు. డీపీఆర్‌-2 ఇచ్చి ఏడాదైనా కొర్రీలతో కాలాయాపన చేస్తూ.. నేటికీ ఆమోదం తెలపలేదని ఆరోపించారు.

 

వైసీపీ, బీజేపీ రాష్ట్ర నేతల మాటలు విని ఆంధ్రప్రదేశ్‌ కు అన్యాయం చేయొద్దని గడ్కరీకి చెప్పినట్లు చంద్రబాబు తెలిపారు. ‘కొన్ని అంశాలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని కేంద్ర మంత్రి గడ్కరీ నాతో అన్నారు. ఢిల్లీకి అధికారులను పంపుతాం.. మొత్తం సమాచారం ఇస్తాం అని ఆయనకు చెప్పా. అవసరమైతే నేనే వస్తానని కూడా తెలిపా. ఎవరో ఆరోపణలు చేస్తే దాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడటం సరికాదని చెప్పా’ అని ఆయన అన్నారు.

Tags : Andhra cm chandrababuap developmentBJPjaimili electionsTDPtdp workshop

Also read

Use Facebook to Comment on this PostMenu