01/5/19 11:59 AM

ఫినిష్ అయిపోతారు : చంద్రబాబు సీరియస్ వార్నింగ్

CM Chandrababu Serious Warning For BJP Women

ఏపీలో ఎన్నికల హీట్ పెరిగింది. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం ముదిరింది. టీడీపీ, బీజేపీ నాయకుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. విమర్శల స్థాయి దాటి వార్నింగ్‌లు ఇచ్చుకునే వరకు వ్యవహారం వెళ్లింది. ఎన్నడూ లేని విధంగా సీఎం చంద్రబాబు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. తనను అడ్డుకున్న బీజేపీ కార్యకర్తలపై ఆయన ఫైర్ అయ్యారు. తెలుగు గడ్డపై ఉంటూ.. మోదీని సపోర్ట్ చేయడానికి సిగ్గుండాలంటూ ధ్వజమెత్తారు. ఇలాగే వ్యవహరిస్తే కఠిన పరిణామాలు ఉంటాయని, ఫినిష్ అవుతారని వార్నింగ్ ఇచ్చారు.

 

జన్మభూమి-మా ఊరు కార్యక్రమంలో భాగంగా సీఎం చంద్రబాబు శుక్రవారం కాకినాడకు వెళ్లారు. ఈ సందర్భంగా బీజేపీకి చెందిన 30మంది కార్యకర్తలు సీఎం కాన్వాయ్‌ని అడ్డుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పనుల్లో అవినీతి జరుగుతోందని ఆరోపిస్తూ జేఎన్టీయూ వద్ద అడ్డుపడ్డారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బీజేపీ కార్యకర్తల తీరు సీఎం చంద్రబాబును అసహనానికి గురిచేసింది. దీంతో ఆయన బస్సులోంచి దిగొచ్చి వారిపై మండిపడ్డారు. ‘మీకు కొంచెమైనా సిగ్గుందా.. రాష్ట్రంపై కమిట్‌మెంట్ ఉందా? నరేంద్ర మోదీ చేస్తున్న పనులకు మీరంతా సిగ్గుపడాలి. మోదీ పేరు చెప్పుకుంటూ తిరిగితే ప్రజలు మిమ్మల్ని కొడతారు’ అని చంద్రబాబు అన్నారు.

 

చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా.. బీజేపీ కార్యకర్తలు వెనక్కి తగ్గలేదు. ఆందోళనకారుల్లో ఓ మహిళ మరింత రెచ్చిపోయింది. సీఎం డౌన్.. డౌన్ అంటూ నినాదాలు చేసింది. దీంతో బాబుగారికి మరింత మండింది. ‘డౌన్ డౌన్ కాదు.. మిమ్మల్ని ప్రజలే కొడతారు. జాగ్రత్త!’ అని వార్నింగ్ ఇచ్చారు. ఏం చేశారమ్మా మీ మోదీ.. అంటూ సదరు మహిళను చంద్రబాబు ప్రశ్నించారు. దానికి ఆమె కూడా ఘాటుగానే స్పందిస్తూ.. ఏపీకి ఎంతో చేశాడని చెప్పింది. చంద్రబాబు ప్రతిస్పందిస్తూ.. ‘ఆ చేశాడమ్మా, ముంచేశారు’ అని ఫైర్ అయ్యారు. ఎవరిని ముంచారని ఆ మహిళ నిలదీయగా.. రాష్ట్రాన్ని, దేశాన్ని అంటూ చంద్రబాబు బదులిచ్చారు. మనం ఏపీ వాళ్లమని వాళ్లకు కొంచెమైనా ఉందా.. వెళ్లవమ్మా, వెళ్లు అంటూ చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

ఈ ఘటనపై టీడీపీ నేతలు తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. సీఎం చంద్రబాబు సైగ చేస్తే బీజేపీ వాళ్లు రోడ్లపై మీద కూడా తిరగలేరని టీడీపీ ఎమ్మెల్సీ బాబూ రాజేంద్రప్రసాద్ వార్నింగ్ ఇచ్చారు. బీజేపీ నేతలు చంద్రబాబును అడ్డుకోవడం సరికాదని… బీజేపీ నేతలు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని తీవ్ర స్థాయిలో ఆయన హెచ్చరించారు. కేంద్రం నుంచి సరైన సహకారం అందడం లేదన్నారు. నిధుల విషయంలో ఏపీపట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. పవన్ కళ్యాణ్ 175 స్థానాల్లో పోటీ చేస్తే టీడీపీకి నష్టమేమీ లేదని రాజేంద్రప్రసాద్ అన్నారు. కేసీఆర్, జగన్.. మోదీకి తొత్తులుగా మారారని ఆయన విమర్శించారు.

 

బీజేపీ నాయకులు కూడా ఎదురుదాడికి దిగారు. టీడీపీ.. టోటల్ దొంగల పార్టీగా ప్రజలకు తెలిసిపోయిందని, ఆంధ్ర ప్రజల నోట్లో మట్టికొట్టి జేబులు నింపుకున్న చంద్రబాబు ముందే కదా నిరసన తెలియజేయాల్సిందని.. లక్షల కోట్ల అవినీతి చేసిన ముఖ్యమంత్రిని నిలదీస్తూనే ఉంటామని బీజేపీ ఎంపీ జీవీఎల్ కౌంటర్ ఎటాక్ చేశారు.

Tags : BJPcm chandrababuGvl narasimha raomlc rajendraprasadTDPtdp vs bjpwarning for bjp

Also read

Use Facebook to Comment on this PostMenu