11/6/18 11:14 PM

చంద్రబాబులో నూతనోత్సాహం నింపిన కర్ణాటక ఉపఎన్నికల ఫలితాలు..

AP CM Chandrabau Warns Modi

 

సార్వత్రిక ఎన్నికలకు సమయం సమీపిస్తున్న వేళ బీజేపీకి గట్టి షాక్ తగిలింది. దక్షిణాదిన పాగా వేయాలని విశ్వప్రయత్నాలు చేస్తున్న కమలనాథులకు ఊహించని పరిణామం ఎదురైంది. కర్ణాటక ఉపఎన్నికల ఫలితాలు బీజేపీకి దిమ్మతిరిగేలా చేశాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇటీవల కర్ణాటకలో మూడు లోక్‌సభ నియోజకవర్గాలకు, రెండు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉపఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఉపఎన్నికల్లో కాంగ్రెస్- జేడీఎస్ కూటమి సత్తా చాటింది. ఉపఎన్నికల ఫలితాల్లో నాలుగు చోట్ల కూటమి అభ్యర్థులు విజయాన్ని సాధించడం విశేషం. కాగా బీజేపీ ఒకచోట మాత్రమే గెలిచింది.

 

బళ్లారి లోక్‌సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి ఉగ్రప్ప విజయం సాధించగా, మాండ్య లోక్‌సభ స్థానం నుంచి జేడీఎస్‌ అభ్యర్థి శివరామ‌గౌడ గెలిచారు. శివమొగ్గ లోక్‌సభ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి రాఘవేంద్ర విజయం సాధించారు. జమఖండి అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థి ఆనంద్‌సిద్దు న్యామగౌడ గెలుపొందారు. రామనగర అసెంబ్లీ స్థానం నుంచి సీఎం కుమారస్వామి భార్య, జేడీఎస్‌ అభ్యర్థి అనితా కుమారస్వామి విజయం సాధించారు.

 

తుది ఫలితాలు ఇవే..
నియోజకవర్గం గెలుపొందిన అభ్యర్థి (పార్టీ)
బళ్లారి (లోక్‌సభ) వీఎస్ ఉగ్రప్ప (కాంగ్రెస్)
మాండ్య (లోక్‌సభ) శివరామగౌడ (జేడీఎస్)
శివమొగ్గ (లోక్‌సభ) బీవై రాఘవేంద్ర (బీజేపీ)
జమఖండి (అసెంబ్లీ) ఆనంద్ న్యామగౌడ (కాంగ్రెస్)
రామనగర (అసెంబ్లీ) అనితా కుమారస్వామి (జేడీఎస్)

 

కర్ణాటక ఉపఎన్నికల ఫలితాలపై ఏపీ సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు స్పందించారు. కర్ణాటక సీఎం, జేడీఎస్ నేత కుమారస్వామికి ఫోన్ చేసి అభినందించారు. అత్యధిక మెజార్టీతో ఈ కూటమి విజయం సాధించడంపై చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. ఈ ఉపఎన్నిక ఫలితాలు బీజేపీకి శరాఘాతమని, బీజేపీ పట్ల ప్రజలకు ఉన్న వ్యతిరేకతకు కర్ణాటక ఫలితాలే అద్దం పడతాయని చంద్రబాబు అన్నారు. కర్ణాటకలో ఘోరంగా విఫలమైన బీజేపీ ప్రజలకు దూరమైందని చెప్పడానికి ఇంత కన్నా నిదర్శనం ఇంకేం కావాలన్నారు. ఇటీవల కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు, తాజాగా జరిగిన ఉపఎన్నికలకు ఎంతో మార్పు కనిపించిందని, అహంభావంతో వ్యవహరించే వారికి ప్రజలే తగినబుద్ధి చెబుతారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. కాగా, ఈ నెల 9న బెంగళూరులో కర్ణాటక, ఏపీ ముఖ్యమంత్రులు భేటీ కానున్నట్టు సమాచారం. మాజీ ప్రధాని దేవెగౌడతో కూడా చంద్రబాబు సమావేశమవుతారని తెలుస్తోంది.

 

మొత్తంగా బైపోల్ ఫలితాలు బీజేపీని షాక్‌కు గురి చేయగా, కాంగ్రెస్-జేడీఎస్ కూటమిలో నూతనోత్సాహాన్ని నింపాయి.

Tags : congress jds alliancekarnataka by election resultskarnataka bypoll resultsKumaraswamymodishock for bjp

Also read

Use Facebook to Comment on this Post



Menu