06/13/19 10:04 PM

పార్టీ ఫిరాయింపులు : చంద్రబాబు చేసింది తప్పా? ఒప్పా?

Ap CM Jagan Fires On Chandrababu Over Defections

ఏపీ అసెంబ్లీ సమావేశాలు స్టార్టింగ్ లోనే వాడీవేడిగా మొదలయ్యాయి. అసెంబ్లీ స్పీకర్ గా తమ్మినేని సీతారాం ఎన్నిక తర్వాత అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడిచింది. సీఎం జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు మధ్య మాటల తూటాలు పేలాయి. అసెంబ్లీ వేదికగా చంద్రబాబుని జగన్ ఏకిపారేశారు. సభా సంప్రదాయం, విలువలు, పార్టీ ఫిరాయింపులపై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు వైఖరిని కడిగేశారు. గతంలో చంద్రబాబు చేసినట్టు నేను చేయను అన్నారు. చంద్రబాబులా అన్యాయం చేస్తే, ఎమ్మెల్యేలను లాగేస్తే.. అప్పుడు చంద్రబాబుకి, తనకు తేడా ఉండదని జగన్ అన్నారు.

 

ముఖ్యంగా పార్టీ ఫిరాయింపులపై జగన్, చంద్రబాబు మధ్య పెద్ద వివాదమే నడిచింది. టీడీపీ పార్టీ ఫిరాయింపులకు పాల్పడిందని జగన్ ఆరోపిస్తే.. చంద్రబాబు.. జగన్ తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉద్దేశించి కామెంట్స్ చేశారు. ఆ తర్వాత చంద్రబాబు మామ ఎన్టీ రామారావు పేరుని జగన్ ప్రస్తావించడం ఒక్కసారిగా సభలో హీట్ పెంచింది.

 

అసెంబ్లీలో ఈ ఉదయం స్పీకర్ గా తమ్మినేని సీతారాం ఏకగ్రీవంగా ఎన్నికైన తర్వాత ముఖ్యమంత్రి హోదాలో ఆయన్ను అభినందిస్తూ, తొలిసారిగా జగన్ ప్రసంగించారు. ఈ సందర్భంగా రాష్ట్రం విడిపోయిన తర్వాత ఏర్పడిన తొలి శాసనసభలో పరిస్థితులను జగన్ గుర్తు చేశారు. తమ పార్టీ గుర్తుపై గెలిచిన 23 మందిని గత ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా చేర్చుకోవడంతో పాటు నలుగురికి మంత్రి పదవులు ఇచ్చిందని నిప్పులు చెరిగారు. అటువంటి దుర్మార్గమైన పరిస్థితిని మరోసారి సభలో రానివ్వబోనని జగన్ అన్నారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోకుంటే, తాము సభలోకి రాబోమని స్పష్టంగా చెప్పినా పట్టించుకోలేదన్నారు.

 

గత ప్రభుత్వం పార్టీ ఫిరాయింపులకు పాల్పడిందని… తాను అదే పని చేస్తే టీడీపీలో ఎవరూ మిగలరని అసెంబ్లీలో ముఖ్యమంత్రి జగన్ చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు మండిపడ్డారు. 1975లో తాను, వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఇద్దరం ఒకేసారి శాసనసభకు ఎన్నికయ్యామని… రెడ్డి కాంగ్రెస్ నుంచి గెలిచిన రాజశేఖరరెడ్డి నాలుగు రోజులకే కాంగ్రెస్ పార్టీలో చేరారని చంద్రబాబు గుర్తు చేశారు. అప్పుడు మీ తండ్రి చేసింది కూడా తప్పేనని ఒప్పుకోవాలని జగన్ ని డిమాండ్ చేశారు. చరిత్రను ఎవరూ మార్చలేరని చెప్పారు. తొలి ప్రసంగంలోనే ప్రతిపక్షాన్ని అడుగడుగునా కించపరిచే విధంగా జగన్ మాట్లాడుతున్నారని చంద్రబాబు ధ్వజమెత్తారు. అధికారపక్షమైనా, ప్రతిపక్షమైనా ప్రజలు ఇచ్చిన స్థానమేనని అందరూ గుర్తుంచుకోవాలని అన్నారు.

 

గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి కూడా పార్టీ ఫిరాయించారని టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పడంపై ఏపీ ముఖ్యమంత్రి జగన్ తీవ్రంగా మండిపడ్డారు. గతంలో హత్యలు జరిగాయి కాబట్టి నేనూ హత్యలు చేస్తా.. అది తప్పు కాదు అన్నట్లుగా చంద్రబాబు వ్యవహారశైలి ఉందని ఎద్దేవా చేశారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పార్టీ ఫిరాయించిన వైసీపీ ఎమ్మెల్యేలను చంద్రబాబు టీడీపీలో చేర్చుకున్నారని జగన్ గుర్తుచేశారు. ఇప్పుడు ఆ తప్పును ఒప్పుకుని క్షమాపణలు చెప్పకుండా అనవసర విషయాలు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు మాటలు వింటుంటే ఆశ్చర్యంగా ఉందని చెప్పారు. స్పీకర్ అనుమతిస్తే చంద్రబాబు గురించి ఆయనకు సొంత కూతురిని ఇచ్చిన ఎన్టీఆర్ చెప్పిన విషయాలను సభలో టీవీలో చూపిస్తామని జగన్ స్పీకర్ తమ్మినేని సీతారామ్ ను కోరారు.

 

మొత్తంగా అసెంబ్లీ సమావేశాల తొలి రోజే సభలో యుద్ధ వాతావరణం కనిపించింది. ముందు ముందు అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల దాడి మరింత తీవ్రంగా ఉండటం ఖాయంగా కనిపిస్తోంది. చంద్రబాబుని కార్నర్ చేయాలని అధికారపక్షం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. మరి చంద్రబాబు ఎలా ఎదుర్కొంటారో చూడాలి.

Tags : ap assemblyap cm jaganchandrababudefectionsmlasresignationtammineni sitaramys jagan

Also read

Use Facebook to Comment on this Post



Menu