08/25/19 7:32 PM

రాజధాని తరలింపు విషయంలో సీఎం జగన్ సంచలన నిర్ణయం

AP CM Jagan To Go For Referendum On AP Capital

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు హాట్ హాట్ గా మారాయి. నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నాయి. రాజధాని తరలింపు వార్తలు చర్చకు దారితీశాయి. ఇప్పుడు ఏపీలో ఏ ఇద్దరు మాట్లాడుకున్నా.. టాపిక్ రాజధాని గురించే. ఏపీ రాజధాని ఏది? అనే ప్రశ్న మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ఏపీ రాజధానిగా అమరావతిని కంటిన్యూ చేస్తారా, లేక కేపిటల్ ని తరలిస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. రాజధానిగా అమరావతి సేఫ్ కాదని సీనియర్ నేత, మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు సీఎం జగన్ అంతరంగాన్ని చెప్పకనే చెప్పాయి అనే ప్రచారం జరుగుతోంది. బొత్స కామెంట్స్ ని బట్టి.. రాజధాని మార్పు ఖాయం అనే వార్తలు వినిపిస్తున్నాయి.

 

మరోవైపు టీడీపీ, బీజేపీ, జనసేన మాత్రం రాజధాని విషయంలో గట్టిగా పోరాటం చేస్తున్నాయి. రాజధానిగా అమరావతిని కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నాయి. రాజధానిని తరలిస్తే ఊరుకునేది లేదని హెచ్చరిస్తున్నాయి. అటు రాజధాని ప్రాంత రైతులు సైతం ఆందోళనలో పడిపోయారు. రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతులు.. రాజధానిని తరలిస్తారనే ప్రచారంతో టెన్షన్ పడుతున్నారు.

 

రాజధాని గురించి ఇలా విస్తృతంగా చర్చ జరుగుతున్న తరుణంలో మరో హాట్ న్యూస్ తెరపైకి వచ్చింది. రాజధాని తరలింపు విషయంలో సీఎం జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. అదే రెఫరెండం. అంటే ప్రజాభిప్రాయ సేకరణ. ఏపీ రాజధానిగా అమరావతిని కంటిన్యూ చేయాలా? లేక మరో చోటికి తరలించాలా? అసలు దీని గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు అనే విషయం తెలుసుకోవాలని జగన్ నిర్ణయించారట. ఏపీ రాజధానిగా ఏది బెస్ట్ అని ఆయన డైరెక్ట్ గా ప్రజలనే అడుగుతారట. వారి మనసులో ఏముందో తెలుసుకుంటారట. ఒక వేళ రాజధాని తరలించాలని మెజార్టీ ప్రజలు అభిప్రాయపడితే.. ఇక క్షణం కూడా ఆలస్యం చెయ్యకుండా కేపిటల్ ని మరో చోటికి అంటే దొనకొండ లేదా మరో ప్రాంతానికి షిఫ్ట్ చేసేయాలనే యోచనలో జగన్ ఉన్నారట.

 

ప్రభుత్వానికి చెందిన కార్యాలయాలన్నీ ఒకే చోట ఏర్పాటు చేయకూడదనే భావనలో సీఎం జగన్ ఉన్నారట. గతంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన శివరామకృష్ణ కమిటీ అభిప్రాయం కూడా ఇదే. చంద్రబాబు ప్రభుత్వం మాత్రం కమిటీ అభిప్రాయాన్ని పట్టించుకోలేదట. విజయవాడ, గుంటూరు మధ్య కృష్ణా నది ఒడ్డున రాజధాని నిర్మాణానికి పూనుకుంది. అన్ని కార్యాలయాలను ఒకే చోట నిర్మించాలనుకుంది. వరదలు వస్తే ఇబ్బందులు ఎదురవుతాయని తెలిసినా చంద్రబాబు పట్టించుకోలేదన్న విమర్శలు ఉన్నాయి. సీఎం జగన్ మాత్రం.. సేఫ్ సైడ్ ఆలోచిస్తున్నారని అధికార వర్గాలు చెబుతున్నాయి.

 

రాజధాని నిర్మాణం కోసం అమరావతిలో ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరించిన భూముల వివరాలను ఇవ్వాలని సీఆర్డీఏ కమిషనర్ ని సీఎం జగన్ ఆదేశించారట. రాజధాని నిర్మాణం కోసం ప్రభుత్వం రైతుల నుంచి స్వచ్ఛందంగా భూములను సేకరించిందా లేక బలవంతంగా లాక్కుందా అనే విషయాన్ని బయటపెట్టాలని జగన్ భావిస్తున్నారట. రాజధానిలో నిర్మిస్తున్న ప్రభుత్వ సంస్థల పక్కనే ప్రైవేట్ సంస్థలకు, వ్యక్తులకు ఏ మేరకు స్థలాన్ని కేటాయించారనే విషయంపైనా నివేదిక ఇవ్వాలని సీఆర్డీఏ కమిషనర్ ని సీఎం జగన్ ఆదేశించారట. సీఆర్డీఏ కమిషనర్ నివేదిక అందాక రాజధాని విషయమై సీఎం జగన్ ప్రజాభిప్రాయం కోరే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.

 

రెఫరెండం అంటే ప్రజాభిప్రాయం. విదేశాల్లో బాగా ఫేమస్. ఇలాంటి తరహా సమస్యలు వస్తే రెఫరెండం(ప్రజల అభిప్రాయం) తీసుకుంటారు. ఇప్పుడు అదే తరహాలో ఏపీ రాజధాని విషయంలో కూడా నిర్ణయం తీసుకోవాలని జగన్ రెడీ అయినట్లు తెలుస్తోంది. మరి జగన్ తీసుకునే ఈ నిర్ణయానికి ప్రజల నుంచి ఎలాంటి సమాధానం వస్తుందో చూడాలి.

Tags : amaravatiap capitalap cm jaganchandrababu naidudonakondareferendum

Also read

Use Facebook to Comment on this Post



Menu