05/16/19 4:25 PM

ఏపీకి కాబోయే సీఎం ఎవరు : ఎక్స్‌క్లూజివ్ అనాలసిస్

AP Elections 2019, Which Poll Survey Is Correct

ఇంకొద్ది రోజుల్లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. హోరాహోరీ జరిగిన ఈ ఎన్నికల్లో గెలిచేది ఎవరు? చంద్రబాబు అధికారాన్ని నిలబెట్టుకుంటారా లేక జగన్ అధికారాన్ని చేజిక్కించుకుంటారా? అనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఫలితాలపై కోట్లాది రూపాయల బెట్టింగ్ జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కౌంటింగ్ కు ఇంకా కొద్ది రోజులు సమయం ఉంది కాబట్టి, అప్పటివరకు ప్రీ పోల్, పోస్ట్ పోల్ సర్వేల ఆధారంగానే మనం చర్చించుకోవాలి. ఒక్కో సర్వే ఫలితాలు ఒక్కో రకంగా ఉన్నాయి. సర్వేలలో ఏ సర్వేని నమ్మాలి? అంటే ఈ సర్వేలు ఎలా జరుగుతాయో చూద్దాం..

 

సాధారణంగా ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో 1 నుండి 2% ఓటర్లను సర్వే చేసి దాని ఆధారంగా ఆ నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారో చెప్పవచ్చు. అయితే ఈ సాంపిల్ లో ఆ నియోజకవర్గంలో ఉన్న అన్ని కులాలు, వర్గాలు, వృత్తులు వారు అదే సంఖ్యలో ఉంటేనే అంటే నియోజకవర్గంలో x కులం వాళ్ళు 2% ఉంటే, సర్వే చేసే శాంపిల్ లో కూడా 2% x కులం వాళ్ళు ఉండేలా సర్వే చేస్తే ఆ ఫలితాలు అసలు ఫలితాలకు దగ్గరగా వస్తాయి. దాదాపు అన్ని సర్వే ఏజన్సీలు ఈ జాగ్రత్తను తీసుకుంటున్నాయి. అయితే ఫీల్డ్ లో సర్వే చేసే వాళ్ళు కొన్ని తప్పులు చేస్తారు..అవేమిటంటే..

 

* ఓటర్లను వారి పేరు, కులం అడిగి, అసలు ప్రశ్నలేవీ అడగకుండా సర్వే చేసే వ్యక్తి తనకి నచ్చిన సమాధానాలు టిక్ పెట్టడం.
* 200 మందిని అడగమని చెబితే 40 మందిని అడిగి, మిగతావి ఫేక్ నింపడం
* ఒక్కో ఓటర్ ని పది ప్రశ్నలు అడగాల్సి ఉంటె 4 ప్రశ్నలే అడగడం
ఇలా ఫీల్డ్ లో సర్వే చేసేవాళ్ళు అనేక తప్పులు చేస్తుంటారు.

 

ఇంకొన్ని ఏజన్సీలు అయితే ఎలాంటి సర్వే చేయకుండానే ఏదో ఒక పార్టీ దగ్గర డబ్బు తీసుకుని ఆ పార్టీకి అనుకూలంగా రిపోర్ట్ ఇస్తుంటాయి. కొన్ని ఏజన్సీలు సిన్సియర్ గా సర్వే చేయాలని అనుకున్నా…ఓటర్లు అందుకు సహకరించడం లేదు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో అయితే చాలామంది ఓటర్లు మనసులో ఒకటి ఉంచుకుని మరొకటి చెబుతుంటారు. ఇంకొంత మంది అయితే వైకాపాకి ఓటు వేస్తామని చెబితే తమ ఓట్లు తొలగిస్తారానో, తమకి అందుతున్న సంక్షేమ పథకాలు ఆపేస్తారనో భయంతో తెదేపా కి ఓటు వేస్తామని సర్వేలలో చెప్పి ఉండవచ్చు. పోస్ట్ పోల్ సర్వే అంటే పోలింగ్ తర్వాత చేసే సర్వేలలో కూడా ఇలాంటి సమస్యలే ఉన్నాయి. గత రెండేళ్లుగా ఈ సర్వేలని అధ్యయనం చేస్తున్న వ్యక్తిగా..ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపై నా అభిప్రాయం ఇదీ..

 

మార్చి 31 వరకు రాష్ట్రంలో వైకాపా కు మొగ్గు ఉంది. జగన్ ప్రకటించిన నవరత్నాల మీద ఆశతో, జన్మభూమి కమిటీల అక్రమాల మీద ఆగ్రహంతో ఉన్న ప్రజలలో జగన్ కి ఒక్క ఛాన్సిచ్చి చూద్దాం అనే భావన బలంగా ఉంది. చంద్రబాబును దించాలనే కసి కానీ, ఆయన్నే మళ్ళీ ఎన్నుకోవాలనే కోరిక కానీ మెజారిటీ ప్రజల్లో కనిపించలేదు. చంద్రబాబు ప్రభుత్వం పెన్షన్ ని రెట్టింపు చేయడం, పసుపు కుంకుమ, అన్నదాత సుఖీభవ పథకాల ప్రభావం వల్ల జగన్ చేస్తానని చెబుతున్నవి అన్నీ చంద్రబాబు కూడా చేస్తున్నారు కదా, కాబట్టి ముఖ్యమంత్రి ఎవరైనా పర్వాలేదు అనే భావన సగటు ప్రజలలో కలిగింది. రాజకీయాల గురించి చర్చించే వర్గాలలో మాత్రం, అంటే వోకల్ సెక్షన్స్ లో మాత్రం జగన్ గెలుస్తాడు అనే భావన బాగా బలంగా కనిపించింది. ఇక పవన్ కల్యాణ్ జనసేనను అయితే మెజారిటీ ప్రజలు ఒక సీరియస్ పొలిటికల్ పార్టీగా గా కూడా గుర్తించలేదు. కాపు కులస్తులు, 25 ఏళ్ల లోపు యువతలో కొంతమంది మాత్రమే జనసేన వైపు ఆకర్షితులు అయ్యారు.

 

ఏప్రిల్ 7 నుండి పరిస్థితిలో మార్పు వచ్చింది. ఓటర్లకు డబ్బు పంపిణీ విషయంలో వైకాపా చాలా పకడ్బందీగా వ్యవహరించగా, తెదేపా మాత్రం ఈ విషయంలో బాగా వెనుకబడిపోయింది. తెదేపా అధిష్టానం కొంతమంది అభ్యర్థులకి హామీ ఇచ్చిన డబ్బును ఇవ్వలేకపోయిందని అంటున్నారు. సర్వేలన్నీ వైకాపా కి అనుకూలంగా వస్తుండడంతో కొన్ని నియోజకవర్గాల్లో తెదేపా అభ్యర్థులు డబ్బు పంచినా కానీ గెలవం అని పార్టీ ఇచ్చిన ఫండ్స్ ని కూడా ఖర్చు పెట్టకుండా దాచుకున్నారని అంటున్నారు. ఇంకొన్ని చోట్ల అభ్యర్థులు ఓటర్లకి పంచమని ఇచ్చిన డబ్బును తెదేపా క్యాడర్ నొక్కేసారని సమాచారం. మరికొన్ని చోట్ల ఎలాగూ పసుపు కుంకుమ డబ్బులు మహిళల ఖాతాలో పడ్డాయి కాబట్టి, వాళ్ళు ఎలాగూ తెదేపా కి ఓటు వేస్తారని, మహిళలకి డబ్బులు పంచలేదని తెలుస్తోంది. కొన్ని చోట్ల తెదేపా క్యాడర్ లో ఉన్న అసంతృప్తులు కూడా పరోక్షంగా వైకాపాకి సపోర్ట్ చేసారని అంటున్నారు.

 

మొత్తం మీద ఓటర్ల కొనుగోలు, దీన్నే పార్లమెంటరీ భాషలో చెప్పాలి అంటే పోల్ మ్యానేజ్ మెంట్ అంటారు. ఇందులో ఈసారి తెలుగుదేశం పార్టీ విఫలం అయింది. దీనికితోడు తెలుగుదేశం పార్టీ ఐదేళ్ళలో చేసిన అనేక తప్పిదాలు, జన్మభూమి కమిటీల అరాచకాలు, విపరీతంగా పెరిగిన అవినీతి కారణంగా ఈ ఎన్నికల్లో తెదేపా గడ్డు పరిస్థితిని ఎదుర్కుందనే చెప్పాలి. ప్రభుత్వ సంక్షేమ పథకాల కారణంగా తెలుగుదేశం పార్టీ అధికారాన్ని నిలబెట్టుకునే అవకాశాలు 30% ఉండగా, ఒక్క ఛాన్సిచ్చి చూద్దాం అనే భావన కారణంగా జగన్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు 70% ఉన్నాయి.

 

నరేష్ శిరమణి

పొలిటికల్ స్ట్రాటజిస్ట్

Tags : ap cmap elections 2019chandrababujanasenapawan kalyanpoll surveyTDPYs jagan mohan reddyysr congress party

Also read

Use Facebook to Comment on this PostMenu