12/3/18 8:15 PM

జగన్ పై దాడి కేసు.. చంద్రబాబుకి ఊహించని షాక్ ఇచ్చిన హైకోర్టు

Attack On Jagan Case, Highcourt Serious On AP Govt

వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిపై హత్యాయత్నం ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటన రాజకీయంగా తీవ్ర దుమారం రేపింది. అధికార, ప్రతిపక్షం మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం నడిచింది. తాజాగా జగన్ పై దాడి కేసు మరోసారి హాట్ టాపిక్ గా మారింది. ఇందుకు కారణం హైకోర్టు చేసిన వ్యాఖ్యలే. జగన్ పై హత్యాయత్నం కేసులో దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు సోమవారం విచారించింది. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వ వ్యవహారశైలిపై న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. జగన్ పై విశాఖపట్నం ఎయిర్ పోర్టులో దాడి జరిగితే ఏపీ పోలీసులు ఎందుకు విచారణ చేపట్టారని కోర్టు ప్రశ్నించింది. కేసును ఎన్‌ఐఏకు ఎందుకు అప్పగించలేదని నిలదీసింది. జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ)కు కేసును ఎందుకు బదిలీ చేయలేదో కారణాలు తెలియజేస్తూ పూర్తి వివరాలతో కోర్టులో కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని న్యాయస్థానం ఆదేశించింది.

 

ఈ సందర్భంగా జగన్ తరఫు న్యాయవాది వాదిస్తూ ఏపీ ప్రభుత్వం నియమించిన సిట్ విచారణను నిలిపివేయాలని కోరారు. ఈ వ్యవహారంపై జాతీయ దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలన్నారు. అయితే ఈ వాదనలను ఏపీ ప్రభుత్వ న్యాయవాది ఖండించారు. సిట్ అధికారుల విచారణ పారదర్శకంగా, నిష్పాక్షికంగా కొనసాగుతోందని కోర్టుకు విన్నవించారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. జగన్ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థలకు అప్పగించడంపై స్పందించాలని ఆంధ్రప్రదేశ్ తో పాటు కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది. అనంతరం తదుపరి విచారణను డిసెంబర్ 5(ఎల్లుండికి)కు వాయిదా వేసింది.

 

అక్టోబర్ 25న విశాఖ ఎయిర్‌పోర్టులో జగన్‌పై జరిగిన దాడి ఘటనపై గుంటూరు జిల్లా మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి హైకోర్టులో ఇటీవల పిటిషన్ వేశారు. ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏతో విచారణ జరిపించాలని.. కేసును ఏపీ పోలీస్ పరిధి నుంచి ఎన్ఐఏకు బదిలీ చేసేలా ఆదేశాలు జారీ చేయాలని ఆయన తన పిటిషన్ లో కోరారు. జగన్‌పై జరిగిన దాడికి అన్‌లాఫుల్ ఎగినెస్ట్ సేఫ్టీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ యాక్ట్ ప్రకారం సెక్షన్3(ఏ) కింద కేసు నమోదు చేయాలని.. కానీ పోలీసులు కావాలనే కేసును తప్పుదోవ పట్టించేందుకు సెక్షన్ 307 కింద నమోదు చేశారని పిటిషన్‌లో ప్రస్తావించారు. అలాగే ఈ దాడి వెనుక కుట్ర కోణం దాగి ఉందని ఆళ్ల ఆరోపించారు. ఎన్ఐఏ యాక్ట్‌లోని సెక్షన్ 6 ప్రకారం ఎయిర్‌పోర్ట్ లేదా ఎయిర్‌క్రాఫ్ట్‌లో ఏదైనా ఘటన జరిగితే విచారణ ఎన్ఐఏ పరిధిలోకి వస్తుందని గుర్తు చేశారు. పోలీసులకు ఈ విషయం తెలిసి కూడా తెలియనట్టు వ్యవహరించారని.. 166 ప్రకారం వాళ్లు కూడా శిక్షార్హులేనని పిటిషన్‌లో ప్రస్తావించారు.

 

కోర్టు చేసిన వ్యాఖ్యలతో ఏపీ ప్రభుత్వం కంగుతింది. ఇప్పుడు కోర్టుకి ఏం సమాధానం చెబుతారో చూడాలి. లోకల్ పోలీసులతో విచారణ జరిపించడాన్ని ఎలా సమర్థించుకుంటారో తెలియాల్సి ఉంది. కాగా జగన్ ను హత్య చేసేందుకు టీడీపీ కుట్రపన్నిందని, శ్రీనివాసరావుతో దాడి చేయించిందని వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. సానుభూతి కోసం జగనే ఈ నాటకం ఆడారని, దాడి చేసిన శ్రీనివాసరావు జగన్ అభిమాని అని టీడీపీ నాయకులు ఎదురుదాడికి దిగారు. ఈ కేసును లోకల్ పోలీసులతో విచారణ చేయించడంపై వైసీపీ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కుట్రకోణం బయటపడకండా ఉండేందుకు చంద్రబాబు డ్రామా ఆడుతున్నారని ఆరోపిస్తున్నారు. జాతీయ దర్యాఫ్తు సంస్థతో విచారణ చేయిస్తే చంద్రబాబు నిజస్వరూపం బయటపడుతుందని అంటున్నారు. మొత్తంగా కోడికత్తి దాడి ఘటన ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది. ముందు ముందు మరెన్ని ములుపులు తిరుగుతుందో చూడాలి.

Tags : ap copsap govtattack on jaganchandrababuhighcourtjagan murder attempt caseNIATDPwhy ap police

Also read

Use Facebook to Comment on this PostMenu