10/24/19 12:59 PM

కేసీఆర్ కు బిగ్ రిలీఫ్ : కనిపించని ఆర్టీసీ సమ్మె ప్రభావం

Big Relief For CM KCR

తెలంగాణలో ఆర్టీసీ సమ్మె ఉధృతంగా సాగుతోంది. ఆర్టీసీ కార్మికులు వర్సెస్ ప్రభుత్వంగా మారింది. ఆర్టీసీ కార్మికులు సై అంటే.. సీఎం కేసీఆర్ సై సై అన్నారు. వారి పట్టుదలకు పోతే.. ఈయన మరింత పట్టుదలకు వెళ్లారు. ఆర్టీసీ కార్మికులతో చర్చలు కూడా జరపలేదు. దాదాపు మూడు వారాలుగా ఆర్టీసీ కార్మికులు సమ్మెలో ఉన్నారు. తెలంగాణవ్యాప్తంగా బస్సులు తిరగడం లేదు. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆర్టీసీ సమ్మె విషయంలో ప్రతిపక్షాలన్నీ ఏకం అయ్యాయి. కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరుబాటపట్టాయి. పలు కార్మిక, ఉద్యోగ సంఘాలు సైతం ఆర్టీసీ సమ్మెకి మద్దతు తెలిపాయి. దీంతో హుజూర్ నగర్ ఉప ఎన్నికలపై ఆర్టీసీ సమ్మె ప్రభావం కచ్చితంగా ఉంటుందని, టీఆర్ఎస్ ఓటమి ఖాయం అని ప్రతిపక్షాలు, ఆర్టీసీ కార్మిక సంఘాలు, విశ్లేషకులు భావించారు. కట్ చేస్తే.. రిజల్ట్స్ రివర్స్ అయ్యింది. ఆర్టీసీ కార్మికులకు, ప్రతిపక్షాలకు దిమ్మతిరిగే షాక్ తగిలింది. హుజూర్ నగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ సత్తా చాటింది. కాంగ్రెస్ కంచుకోటను బద్దలు కొట్టి.. ఫస్ట్ టైమ్ హుజుర్ నగర్ లో టీఆర్ఎస్ జెండా రెపరెపలాడింది. దీన్ని బట్టి.. హుజూర్ నగర్ బై పోల్ పై ఆర్టీసీ సమ్మె ప్రభావం కనిపించలేదు అనేది స్పష్టమైంది.

 

ఈ నెల 21న హుజూర్ నగర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరిగింది. 24న కౌంటింగ్. ఉదయం కౌంటింగ్ స్టార్ట్ అయినప్పట్టి నుంచి కూడా కారు జోరు కనిపించింది. కౌంటింగ్ ప్రారంభం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థి స్పష్టమైన ఆధిక్యత ప్రదర్శించాడు. ఈ ఎన్నికపై ఆర్టీసీ సమ్మె ప్రభావం చూపించకపోవడం హాట్ టాపిక్ గా మారింది. ఎన్నికలకు ముందు.. టీఆర్ఎస్ పై ఆర్టీసీ సమ్మె ప్రభావం ఉంటుందని అంచనా వేశారు. ఈసారి కూడా గెలుపు తమదే అని కాంగ్రెస్ ధీమాగా ఉంది. కట్ చేస్తే.. అంచనాలను తారుమారు చేస్తూ ప్రజలు టీఆర్ఎస్ కే పట్టం కట్టారు. కాంగ్రెస్ గడ్డ మీద గులాబీ జెండా రెపరెపలాడింది. దీంతో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సహా ఆ పార్టీ శ్రేణులు ఫుల్ ఖుషీగా ఉన్నాయి.

 

హుజూర్ నగర్ ఉప ఎన్నిక ఫలితం ఏకపక్షంగా వచ్చింది. ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్ కచ్చితంగా ఉప ఎన్నిక మీద ఉంటుందని.. అధికార పార్టీకి షాక్ తప్పదని కాంగ్రెస్ ఎన్నో ఆశలు పెట్టుకుంది. కానీ ఆశలు ఆవిరయ్యాయి. ప్రతీ రౌండ్ లోనూ టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి ఆధిపత్యం స్పష్టంగా కనిపించింది. ఇప్పుడు కొత్త చర్చ మొదలైంది. టీఆర్ఎస్ గెలుపుకి కారణం ఏమై ఉంటుంది అని అంతా డిస్కస్ చేసుకుంటున్నారు.

 

ఆర్టీసీ సమ్మె విషయంలో ప్రభుత్వ వాదననే ఓటర్లు పరిగణలోకి తీసుకున్నారా..లేక కేసీఆర్ మీదే నమ్మకం ఉంచారా.. ఉప ఎన్నిక కాబట్టి అధికార పార్టీకే పట్టం కట్టారా..ఇవన్నీ కాకుండా సైదిరెడ్డి పై వ్యక్తిగతంగా అభిమానం చూపించి గెలిపించారా అనే చర్చ సాగుతోంది. ఏది ఏమైనా ఈ ప్రతికూల పరిస్థితుల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఇది గ్రేట్ రిలీఫ్ అని చెప్పొచ్చు.

 

హుజూర్ నగర్ ఉప ఎన్నిక ఫలితం ద్వారా అధికార పార్టీ కచ్చితంగా దిగి వస్తుందనే అంచనాల్లో ఆర్టీసీ జేఏసీ నేతలు కనిపించారు. అధికార పార్టీకి వ్యతిరేకంగా దాదాపు అన్ని పార్టీలు..ప్రజా..ఉద్యోగ సంఘాలు మద్దతుగా నిలవటంతో అక్కడి ఓటర్లు సైతం అధికార పార్టీకి వ్యతిరేకంగా నిలుస్తారని ఆర్టీసీ జేఏసీ నేతలు ఆశించారు. కానీ, ఓటర్లు మాత్రం సమ్మెను..ఎన్నికలను విడివిడిగానే భావించారనే చెప్పాలి. సమ్మె విషయంలో కార్మికులకు మద్దతుగా నిలిచినా.. ఎన్నికల్లో మాత్రం అధికార పార్టీని గెలిపించాలని నిర్ణయించినట్టు కనిపిస్తోంది. దీంతో..ఓటర్లు ఏకపక్షంగా అధికార పార్టీకి మద్దతు ఇచ్చినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ప్రభుత్వం పైన కనిపించిన ప్రతికూల పరిస్థితులు ఎన్నికల్లో మాత్రం ప్రభావితం చేయలేదు. ఇది..ఒక రకంగా ఆర్టీసీ జేఏసీ నేతలను సైతం ఆలోచనలో పడేసే అంశం అని విశ్లేషకులు అంటున్నారు. హుజూర్ నగర్ ఫలితం సీఎం కేసీఆర్ కి బిగ్ రిలీఫ్ గా చెప్పొచ్చు.

 

ఈ ఫలితంతో ప్రజల మద్దతు తమ వైపే ఉందని టీఆర్ఎస్ చెప్పుకోవటానికి అవకాశం ఏర్పడింది. ఇప్పటి వరకు మొండిగా వ్యవహరించిన సీఎం కేసీఆర్.. మరింత వేగంగా అడుగులు వేసే అవకాశం కనిపిస్తోంది. ప్రజల నుండి వచ్చిన మద్దతుతో..మరింత దూకుడుగా వెళ్తారనే టాక్ వినిపిస్తోంది. ఇప్పుడు ఆర్టీసీ జేఏసీ సైతం ఒక మెట్టుదిగని పరిస్థితి నెలకొంది. సీఎం కేసీఆర్ తీసుకోబోయే నిర్ణయాల పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
టీఆర్ఎస్ గెలుపు సంబరాల్లో ఉంటే.. ప్రతిపక్షాలు ఏమో అనుమానాల్లో పడ్డాయి. హుజూర్ నగర్ ఫలితంపై సందేహాలు వ్యక్తం చేస్తున్నాయి. కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ సహా 10మంది అభ్యర్థుల ఫలితాలపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అన్ని వీవీప్యాట్ స్లిప్పులను లెక్కించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు రిటర్నింగ్ అధికారికి వినతిపత్రం సమర్పించారు.

Tags : big reliefby pollhuzurnagarresultstelangana cm kcrtrsTSRTC strike

Also read

Use Facebook to Comment on this PostMenu