07/5/19 7:21 PM

షరా మామూలే : తెలుగు రాష్ట్రాలకు మరోసారి అన్యాయం చేసిన మోడీ

Budget 2019.. Injustice For AP, Telangana States

షరా మామూలే.. ఏళ్లు గడుస్తున్నాయి, ప్రభుత్వాలు మారుతున్నాయి.. కానీ తెలుగోళ్లకి మాత్రం న్యాయం జరగడం లేదు. మరోసారి తెలుగు రాష్ట్రాలకు తీరని అన్యాయమే జరిగింది. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ 2019లో.. ఏపీ, తెలంగాణకు మొండిచేయి చూపించారు. నామమాత్రపు నిధులు కేటాయించి చేతులు దులుపుకున్నారు. గత ఐదేళ్లుగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకి మొండిచేయి చూపించిన కేంద్రం ఈసారైనా తగిన న్యాయం చేస్తుందని ఆశలు పెట్టుకున్నారు. కానీ ఈసారి కూడా నిరాశ తప్పలేదు. ప్రత్యేక హోదా ఊసులేదు, విభజన హామీల అంశం గురించి ప్రస్తావనే లేదు. పోలవరం ప్రాజెక్ట్, రైల్వే జోన్, అమరావతి నిర్మాణానికి సంబంధించి నిధుల ఊసేలేదు.

 

కేంద్ర బడ్జెట్ పై గంపెడాశలు పెట్టుకున్న ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు నిరాశే మిగిలింది. ఈ బడ్జెట్‌లో తెలుగు రాష్ట్రాలకు దక్కింది అరకొరే. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని యూనివర్సిటీలకు కొన్ని కేటాయింపులు చేసి మమ అనిపించారు. ఏపీలోని సెంట్రల్ యూవర్సిటీకి రూ.13 కోట్లు, ట్రైబల్‌ యూనివర్సిటీకి రూ. 8 కోట్లు కేటాయించిన కేంద్రం… తెలంగాణలోని హైదరాబాద్‌ ఐఐటీకి రూ.80 కోట్లు కేటాయించి చేతులు దులుపుకుంది. ఇవి మినహా తెలుగు రాష్ట్రాలకు పెద్దగా కేటాయించిందేమీ లేదు. ఏపీలోని ఐఐటీ, ఐఐఎం, నిట్‌, ఐఐఎస్‌ఈఆర్‌, ట్రిపుల్‌ ఐటీలకు ఈ బడ్జెట్‌లో నిధుల కేటాయింపు నిల్ కాగా… ఏపీ, తెలంగాణలోని మిగతా ప్రభుత్వ రంగ సంస్థలకు మొండి చెయ్యే చూపించింది. విభజన చట్టంలోని హామీల అమలుపైనా కేంద్రం ఎక్కడా ప్రస్తావించకపోవడం గమనార్హం. ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం, పోలవరం ప్రాజెక్టుకు నిధులు, రెవెన్యూ లోటు అంశాలకు పద్దులో ఎక్కడా చోటుదక్కలేదు. మొత్తంగా గత ఐదేళ్లలో జరిగినట్టే.. మోడీ రెండో ప్రభుత్వంలోని తొలి బడ్జెట్‌లోనూ తెలుగు రాష్ట్రాలకు నిరాశే ఎదురైంది.

 

కేంద్ర ఆర్థిక బడ్జెట్ పై ఏపీలో అధికార వైసీపీ నాయకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. విభజన కారణంగా లోటు బడ్జెట్‌తో ఇబ్బందుల్లో ఉన్న ఏపీకి లాభించే ఏ నిర్ణయం లేకపోవడం విచారకరం అని ఎంపీ విజయసాయి రెడి అన్నారు. ఏపీకి కోడలు అయ్యుండి కూడా తగిన న్యాయం చేయలేదని నేతలు వాపోయారు. ఐదేళ్లుగా ఏపీకి మొండిచేయి చూపించిన కేంద్రం ఈసారైనా తగిన న్యాయం చేస్తుందని పెట్టుకున్న ఆశలపై మోడీ సారు నీళ్లు చల్లారు.

 

ఏపీ విభజన చట్టంలోని అంశాలపై ఒక్క మాటైనా మాట్లాడలేదని, కేంద్ర ప్రభుత్వం ఏపీకి మొండిచేయి చూపించిందని వైసీపీ నేతలు విమర్శించారు. కేంద్ర బడ్జెట్‌ వల్ల మన రాష్ట్రానికి ఒరిగింది ఏమీ లేదన్నారు. ఏపీకి ఎంతమేరకు నిధులు కేటాయిస్తున్నారో దానిపై స్పష్టత లేదన్నారు. గత ప్రభుత్వ నిర్వాకం వల్ల ఏపీ రెవెన్యూ లోటు రూ.60 వేల కోట్ల వరకు పెరిగింది… కేంద్ర బడ్జెట్‌పై రాష్ట్ర ప్రభుత్వం చాలా ఆశలు పెట్టుకుందని, రాష్ట్రానికి తప్పకుండా సహాయం చేస్తామని కేంద్రం కూడా ఇదివరకు హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. అయితే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేదని పెదవి విరిచారు. పోలవరం, అమరావతి నిధుల ప్రస్తావన లేదన్నారు. ఏపీ ప్రయోజనాలను కాపాడటం కోసం ఏ పోరాటానికైనా తాము సిద్ధంగా ఉన్నామని, రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని పార్లమెంటులో కచ్చితంగా ప్రశ్నిస్తామని వైసీపీ నేతలు స్పష్టం చేశారు.

 

మొత్తంగా తెలుగు రాష్ట్రాలకు తీరని అన్యాయమే జరిగింది. ప్రజలు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. తెలుగువారిపై ఎందుకీ వివక్ష అని ప్రశ్నిస్తున్నారు. మరి ఇద్దరు సీఎంలు జగన్, కేసీఆర్ ఏం చెయ్యబోతున్నారు? ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నారు? న్యాయం కోసం ప్రధాని మోడీపై తిరగబడతారా? లేక ఎందుకొచ్చిన గొడవ అని మౌనంగానే ఉండిపోతారా? పోరాడితే పోయేదేమీ లేదని ధైర్యం చేసి జగన్, కేసీఆర్ లు.. ప్రధాని మోడీని నిలదీయాల్సిందేనని ప్రజలు కోరుతున్నారు. మరి మన ముఖ్యమంత్రులు ఏం చేస్తారో చూద్దాం..

Tags : allocationsamaravatiAPbudgetfundsinjusticemodinirmala sitha ramapolavaramTelangana

Also read

Use Facebook to Comment on this Post



Menu