07/11/18 9:35 PM

చంద్రబాబుకి షాక్ ఇచ్చిన కేంద్రమంత్రి..!

Untitled-1 copy

పోలవరం ప్రాజెక్ట్ విషయంలో ఏపీ ప్రభుత్వం, కేంద్రం ప్రభుత్వం మధ్య మాటల యుద్ధం నడుస్తున్న సంగతి తెలిసిందే. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి నిధులు ఇవ్వడం లేదని, ప్రాజెక్టు పూర్తి కాకుండా కేంద్రం ఇబ్బందులు పెడుతోందని సీఎం చంద్రబాబు నాయుడు, టీడీపీ నాయకులు అనేకసార్లు ఆరోపణలు చేశారు. దీనికి బీజేపీ నాయకులు కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. టీడీపీ నాయకుల ఆరోపణలు అవాస్తవం అని, ప్రాజెక్టు విషయంలో పూర్తిగా సహకరిస్తున్నామని చెబుతున్నారు. ఈ క్రమంలో కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పోలవరం ప్రాజెక్ట్ సందర్శనకి రావడం, సీఎం చంద్రబాబు దగ్గరుండి ఆయనకు పనుల వివరాలు తెలియజేయటం, పోలవరం ప్రాజెక్టుకి నిధుల కొరత లేదని చంద్రబాబు సమక్షంలో గడ్కరీ వ్యాఖ్యానించడం విశేషం.

 

వివరాల్లోకి వెళితే.. కేంద్రమంత్రి గడ్కరీ పోలవరం ప్రాజెక్టుని సందర్శించారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో కలిసి ప్రాజెక్టు పనులను నితిన్‌ గడ్కరీ పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన గడ్కరీ.. ఆంధ్రప్రదేశ్‌ రైతులకు పోలవరం ప్రాజెక్టు కొత్త జీవితాన్ని ఇస్తుందని అన్నారు. ఈ ప్రాజెక్టు రాష్ట్రానికే కాదు దేశానికే ఆదర్శమని కొనియాడారు. పోలవరం నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ప్రాజెక్టు నిర్మాణానికి నిధుల సమస్య లేదని స్పష్టం చేసిన మంత్రి గడ్కరీ పోలవరం నిధుల విషయంలో భరోసా కూడా ఇచ్చారు. దీన్ని పూర్తి చేయడానికి కేంద్ర సర్కారు దృఢ నిశ్చయంతో ఉందని, ప్రాజెక్టు శరవేగంగా పూర్తవుతోందని చెప్పారు. ఫిబ్రవరి నాటికి సివిల్‌ వర్క్స్‌ పూర్తి చేయాలని తాను సంబంధిత అధికారులకు సూచించానని అన్నారు. ముందస్తు నిధులు ఇవ్వాలని చంద్రబాబు అడిగారని, ఈ విషయంపై ఆర్థిక శాఖతో చర్చిస్తానని అన్నారు. సహాయ, పునరావాసాల్లో గిరిజన ప్రాంతాలకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు. బీజేపీ, టీడీపీ మధ్య ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితి నేపథ్యంలో ఏపీ అభివృద్ధికి సంబంధించి భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు గడ్కరీ. అభివృద్ధి పనుల విషయంలో తాము రాజకీయం చేయబోమని స్పష్టం చేశారు. నీటి సదుపాయం ఉంటే అన్నదాతలకు ఎంత మేలు జరుగుతుందో రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిగా తనకు తెలుసని అన్నారు.

 

2013 అంచనాలతో పోలిస్తే ప్రస్తుతం ప్రాజెక్టు నిర్మాణ వ్యయం భారీగా పెరిగిందని సీఎం చంద్రబాబు తెలిపారు. సవరించిన అంచనాల ప్రకారం పోలవరానికి రూ.57,940 కోట్లు అవుతుందని, అందులో కేవలం భూసేకరణకే రూ. 33 వేల కోట్లు అవుతుందని చంద్రబాబు చెప్పారు. పోలవరం పూర్తి చేయడానికి 2019 డిసెంబర్‌ వరకు డెడ్‌ లైన్‌ పెట్టుకున్నట్టు చెప్పారు. పోలవరానికి ఖర్చు చేసిన రూ.2200 కోట్ల బకాయిలు విడుదల చేయాలని కేంద్ర మంత్రిని ఈ సందర్భంగా చంద్రబాబు కోరారు. ముందస్తుగా నిధులు విడుదల చేయాలని, తద్వారా పనులు సకాలంలో పూర్తి చేయడం సాధ్యమవుతుందని ఆయన చెప్పారు. ప్రాజెక్టును వేగంగా పూర్తి చేయడానికి కేంద్రం సాయం చేయాలని చంద్రబాబు కోరారు.

 

కాగా, పోలవరం పనుల పురోగతిపై గడ్కరీ పది నెలల కాలంలో రెండోసారి సందర్శించారు. గడ్కరీ పర్యటన వల్ల ప్రాజెక్టు పనులు మరింత వేగంగా సాగడానికి అవకాశముందని భావిస్తున్నారు. గత ఏడాది గడ్కరీ వచ్చిన సమయంలో ప్రాజెక్టుకు సంబంధించి కొన్ని సమస్యలు రావడం, చర్చల అనంతరం పనులను నవయుగ ఇంజినీరింగ్ కంపెనీకి అప్పగించడం తెలిసిన విషయమే.

Tags : Andhra cm chandrababuBJPfundsNitin GadkaripolavaramTDP

Also read

Use Facebook to Comment on this Post



Menu