05/5/19 12:44 PM

గెలుపు ఖాయం : రాష్ట్రానికి, టీడీపీకి ఇది శుభసంకేతం

Chandrababu Confidence On TDP Win

ఏపీలో పోలింగ్ ముగిసింది. మే 23న ఫలితాలు వెలువడనున్నాయి. గెలుపు ఎవరిది అన్నది మే 23న తేలనుంది. అయితే.. పోలింగ్ తర్వాత.. గెలుపు తమదే అని అటు టీడీపీ, ఇటు వైసీపీ కాన్ఫిడెంట్ గా ఉన్నాయి. పెరిగిన పోలింగ్ శాతం తమకే అనుకూలమని చంద్రబాబు, జగన్ చెప్పుకుంటున్నారు. కొన్ని సర్వేలు టీడీపీదే విజయం అంటే.. మరికొన్ని సర్వేలు వైసీపీదే గెలుపు అంటున్నాయి. ఎవరి వాదనలు ఎలా ఉన్నా.. ఈ ఎన్నికల్లో టీడీపీ గెలుపు ఖాయం అని ఏపీ సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మరోసారి అన్నారు. టీడీపీ గెలుపుపై ఎలాంటి డౌట్లు అక్కర్లేదన్న చంద్రబాబు.. ఇప్పుడు ఎన్ని సీట్లు, ఎంత మెజార్టీ వస్తుందన్నదే ముఖ్యం అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

 

పోలింగ్ సరళి, కౌంటింగ్ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలుపై పార్టీ నేతలు, అభ్యర్థులు, కార్యకర్తలతో నియోజకవర్గాల వారీగా చంద్రబాబు సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. శనివారం రాజమండ్రి పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల నేతలు, కార్యకర్తలతో చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సర్వేలన్నీ టీడీపీకి అనుకూలంగా ఉన్నాయని చెప్పారు. ఇది పార్టీకి, రాష్ట్రానికి శుభసంకేతంగా భావిస్తున్నామని అన్నారు. గెలుపుపై ఎలాంటి డౌట్స్ పెట్టుకోవాల్సిన పనిలేదని కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా పార్టీ తన ఆధిక్యతను నిలుపుకోవడంపై దృష్టి పెట్టాలని నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.

 

అయితే ఈ ఐదేళ్లలో తాను పార్టీకి ఎక్కువ సమయం కేటాయించలేకపోయానని చంద్రబాబు అంగీకరించారు. కొత్త రాష్ట్రం కావడంతో వ్యవస్థల నిర్మాణానికే ఎక్కువ సమయం పట్టిందని అన్నారు. ఈ కారణంగానే పార్టీకి కేటాయించే సమయం తగ్గిందని వివరణ ఇచ్చారు. ఇకపై పార్టీకి పూర్తి ప్రాధాన్యత ఉంటుందని, ప్రతిరోజు 2,3 గంటలపాటు పార్టీ కోసం సమయం వెచ్చిస్తానని చంద్రబాబు స్పష్టం చేశారు. 3 నెలలకు ఒకసారి అన్ని నియోజకవర్గాలపైనా సమీక్ష జరుపుతానని తెలిపారు.

 

ఈ సందర్భంగా ప్రధాని మోడీ, కేసీఆర్, జగన్ లపై చంద్రబాబు విరుచుకుపడ్డారు. మోడీతో మొదట్లోనే గొడవ పెట్టుకుని ఉంటే చాలా నష్టపోయేవాళ్లమని చంద్రబాబు అన్నారు. ఏపీకి సహకారం అందిస్తారని ఎంతో ఎదురు చూశామని, సరైన సమయంలో ఎన్డీయే నుంచి బయటకు వచ్చేశామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంతో ఓపికగా ఎదురు చూసినా నిర్లక్ష్యం చేశారనే నింద మోడీకే వచ్చిందని అన్నారు. దేశం కోసం, రాష్ట్రం కోసం టీడీపీ పోరాటం చేస్తుంటే… పదవులు, కేసుల మాఫీ కోసం వైసీపీ పోరాడుతోందని విమర్శించారు. వచ్చే రెండు, మూడు సీట్లకు అప్పుడే బేరాలు ప్రారంభించారని విమర్శించారు.

 

ఎన్నికల సమయంలో ప్రత్యర్థులు పన్నిన కుట్రలను సమర్థవంతంగా ఎదుర్కొన్నామని చంద్రబాబు చెప్పారు. టీడీపీకి నష్టం కలిగించాలనేది బీజేపీ ధ్యేయమని, వారికి కేసీఆర్, జగన్ ల కుతంత్రాలు తోడయ్యాయని అన్నారు. రాష్ట్రంలో ఓటింగ్ శాతాన్ని తగ్గించేందుకు కుట్రలు పన్నారని… ఆ కుట్రలు తెలిసే ఓటింగ్ కు తరలి రావాలని ప్రజలకు తాను పిలుపునిచ్చానని చెప్పారు. ముహూర్తాలు, ప్రమాణాలు, మంత్రి పదవులు అంటూ వైసీపీ మైండ్ గేమ్ ఆడుతోందని చంద్రబాబు మండిపడ్డారు. టీడీపీ విజయంపై సందేహం లేదని.. ఆధిక్యత ఎంత అనేది మాత్రమే తేలాల్సి ఉందని అన్నారు.

 

ఈ ఎన్నికల్లో టీడీపీ ఓడిపోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుట్రలకు పాల్పడ్డారని చంద్రబాబు ఆరోపించారు. ఓటర్లు ఏపీకి రాకుండా, టీడీపీకి ఓటు వేయకుండా అనేక ప్రయత్నాలు చేశారని అన్నారు. హైదరాబాద్ నుంచి ఏపీకి వచ్చే బస్సులను సైతం రద్దు చేశారని మండిపడ్డారు. అయినా ఓటర్లు తమ సొంత వాహనాల్లో వచ్చి, పట్టుదలతో ఓటు వేశారని చెప్పారు. ఎన్నికల్లో ఎంతో మంది విలన్లను తట్టుకుని నిలబడ్డామని అన్నారు. తెలంగాణ కంటే ఏపీ అనేక రంగాల్లో ముందుందని చెప్పారు. అధికారుల్లో చీలిక తెచ్చేందుకు కొందరు యత్నిస్తున్నారని, ఇది మంచిది కాదని చంద్రబాబు అన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం అందరూ కలసికట్టుగా పని చేయాలనేదే తన సంకల్పమని చెప్పారు. ఎన్నికల సమయంలో తెలంగాణ ఎమ్మెల్యేలను ప్రజలు నిలదీశారని… కానీ, ఏపీలో మాత్రం అలాంటి పరిస్థితి రాలేదని చంద్రబాబు అన్నారు. టీడీపీ తప్పు చేసిందని ఏ ఒక్కరైనా నిలదీశారా? అని ప్రశ్నించారు. తొలి దశలో ఎన్నికలను నిర్వహించడమే మేలైందని చంద్రబాబు అన్నారు.

 

అదే సమయంలో టీడీపీ నేతలకు చంద్రబాబు క్లాస్ పీకారు. పార్టీలో ఉంటూనే కొంతమంది పార్టీకి ద్రోహ చేశారని, వెన్నుపోటు పొడిచారని చంద్రబాబు అన్నారు. పార్టీకి ద్రోహం చేసిన వారి లిస్ట్ తయారు చేస్తున్నామని, వారిని వదిలిపెట్టను అని చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. మొత్తంగా… చంద్రబాబు వ్యాఖ్యలు రాజకీయవర్గాల్లో ఆసక్తికరంగా మారాయి. చంద్రబాబు చెప్పినట్టు టీడీపీ మరోసారి గెలుస్తుందో లేదో తెలియాలంటే మే 23వ తేదీ వరకు ఆగాల్సిందే.

Tags : ap cm chandrababuap electionsKCRmodiTDPtdp winYs jagan mohan reddy

Also read

Use Facebook to Comment on this PostMenu