10/9/19 1:15 PM

చంద్రబాబు ఆదేశాలతోనే బీజేపీ, వైసీపీలోకి వెళ్తున్నారా..?

Chandrababu Covert Operation

ఏపీలో రాజకీయం మరోసారి ఆసక్తికరంగా మారింది. టీడీపీ నుంచి వలసలు పెరిగాయి. ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత తమ్ముళ్లు ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. కొందరు జాతీయ పార్టీ అయిన బీజేపీలో చేరితే.. మరికొందరు ఏపీలో అధికార పార్టీ వైసీపీలోకి జంప్ అవుతున్నారు. నేతలు టీడీపీని వీడటం ఆ పార్టీ వర్గాలను షాక్ కు గురి చేసింది. నేతలు ఒక్కొక్కరు చంద్రబాబుకి షాక్ లు ఇస్తున్నారు. చంద్రబాబుకి సన్నిహితులుగా పేరొందిన వారు పార్టీని వీడటం చర్చనీయాంశంగా మారింది. కాగా, టీడీపీ నేతల జంపింగ్ లు రాజకీయవర్గాల్లో ఆసక్తికరంగా మారాయి. సరికొత్త చర్చకు తెరలేపాయి. కోవర్టు ఆపరేషన్ అనే పదం తెరపైకి వచ్చింది. చంద్రబాబు ఆదేశాలతోనే టీడీపీ నేతలు బీజేపీ, వైసీపీలోకి వెళ్తున్నారనే టాక్ వినిపిస్తోంది. వైసీపీ నేతలు సైతం అవే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

 

రాజీనామాలు చేస్తున్న టీడీపీ నేతల్లో కొందరిపై కోవర్టులనే ప్రచారం జరుగుతోంది. ఎన్నికల్లో టీడీపీ ఓటమి తర్వాత కొందరు కీలక నేతలు బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. నలుగురు రాజ్యసభ సభ్యులు, చంద్రబాబు సన్నిహితులు సుజనా చౌదరి, సీఎం రమేష్, గరికపాటి మోహన్ రావు, టీజీ వెంకటేష్ టీడీపీ ఓడిపోగానే వెంటనే బీజేపీలో చేరిపోయారు. వాళ్లంతా టీడీపీలో కీలక నేతలే కాదు.. చంద్రబాబు సన్నిహితులు కూడా. సీఎం రమేష్, సుజనా చౌదరితో చంద్రబాబుకి ఉన్న రిలేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలాంటి వాళ్లు టీడీపీని వీడి బీజేపీలోకి వెళ్లడం ఆశ్చర్యానికి గురి చేసింది.

 

ఆ నలుగురు పార్టీ ఫిరాయించటంలో చంద్రబాబు ప్రోత్సాహం ఉందనే ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు మరో అడుగు ముందుకు పడింది. కోవర్టు ఆపరేషన్ లో భాగంగానే కొందరు టీడీపీ నేతలు వైసీపీలో చేరారు అని వైసీపీ నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తాజాగా జూపూడి ప్రభాకర్ టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలోకి రీ ఎంట్రీ ఇవ్వడం ఈ ప్రచారానికి మరింత బలం ఇచ్చింది. దానికన్నా ముందు కడప జిల్లాలో వీరశివారెడ్డి, విశాఖ జిల్లాలో విశాఖ డైరీ ఛైర్మన్ అడారి కుటుంబం వైసీపీలో చేరింది. విశాఖ డైరీ చైర్మన్ కుటుంబానికి టీడీపీతో 30 ఏళ్ల అనుబంధం ఉంది. అలాంటి వ్యక్తి టీడీపీని వీడి అధికార పార్టీలో చేరడం చర్చకు దారితీసింది.

 

ఇలా వైసీపీలో చేరిన వాళ్ల విషయంలో అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు జగన్ పార్టీ వాళ్లు. జూపూడి వ్యవహరమే తీసుకుంటే జగన్ కు అత్యంత సన్నిహితుల్లో ఒకరిగా ఉండేవాడు. అలాంటిది 2014 ఎన్నికల్లో వైసీపీ ఓడిపోగానే టీడీపీలో చేరారు. టీడీపీ కండువా కప్పుకున్న తర్వాత జగన్ ను ఎంతగా విమర్శించారో అందరికీ తెలిసిందే. అలాంటిది మొన్నటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోరంగా ఓడిపోగానే.. సడెన్ గా జూపూడి వైసీపీలోకి మళ్లీ వచ్చేశారు. దీంతో కోవర్టు అనుమానాలు పెరిగాయి.

 

తనకు బాగా సన్నిహితులకున్న వాళ్లలో కొందరిని చంద్రబాబు బీజేపీలో పంపుతున్నట్లే మరికొందరిని వైసీపీలోకి పంపుతున్నారనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబుని నమ్మడానికి వీల్లేదంటున్నారు. వెన్నుపోటు రాజకీయాలు చేయటంలో చంద్రబాబు ఆరి తేరిపోయారని చెబుతున్నారు. ప్రత్యర్ధి పార్టీల నుండి తనకు ఎటువంటి సమస్యలు రాకుండా చంద్రబాబు ముందు జాగ్రత్త పడుతున్నారని విశ్లేషిస్తున్నారు. ఈ కారణంతో వైసీపీలో చేరుతున్న వాళ్లతో జాగ్రత్తగా ఉండాలని, వారిని ఓ కంట కనిపెట్టాలని జగన్ కు పార్టీ నేతలు సూచిస్తున్నారు. జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.

Tags : BJPchandrababucm jagancovert operationjupudi prabhakarsujana chowdaryTDPysrcp

Also read

Use Facebook to Comment on this Post



Menu