08/14/19 1:41 PM

ప్రమాదంలో చంద్రబాబు నివాసం : అంతా సీఎం జగన్ చెప్పినట్టే జరిగిందా?

Chandrababu House In Danger

ఊహించినట్టే జరిగింది. అధికారుల అంచనా నిజమైంది. సీఎం జగన్ చెప్పినట్టే జరిగింది. ప్రమాదం ముంచుకొచ్చింది. అమరావతిలో కృష్ణానది కరకట్ట మీద ఉన్న అక్రమ కట్టడాలకు వరద ముంపు పొంచి ఉంది. కృష్ణా నదికి వరద పోటెత్తుతోంది. ప్రకాశం బ్యారేజీ దగ్గర నీటిని దిగువకు విడుదల చేయడంతో ప్రవాహం పెరిగింది. దీంతో కరకట్టను ఆనుకుని ఉన్న నిర్మాణాలపై వరద ప్రభావం పడింది. ఈ కట్టడాల్లో మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నివాసం కూడా ఉంది. చంద్రబాబు ఇంటి చుట్టూ వరద నీటి ప్రవాహం పెరిగింది. దీంతో అధికారులు అలర్ట్ అయ్యారు. రక్షణ చర్యలు చేపట్టారు. ఆయన ఇంటి చుట్టూ ఇసుక బస్తాలు వేసి నీరు ఇంట్లోకి రాకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. చంద్రబాబు కాన్వాయ్ ని హ్యాపీ రిసార్ట్స్ కు తరలించారు. బాబు నివాసంలోని కింది అంతస్తులో ఉన్న ముఖ్యమైన వస్తువులను సైతం ఫస్ట్ ఫ్లోర్ కి తీసుకెళ్లారు. చంద్రబాబు ఇక్కడ నివాసం ఉంటున్న సమయం నుండి ఈ స్థాయిలో నదికి వరద రాకపోవటంతో ఇప్పటి వరకు ఈ సమస్య తలెత్తలేదు. ఇప్పుడు వరద కారణంగా..అక్రమ నిర్మాణలపై ప్రభావం పడింది. అక్రమ నిర్మాణాల్లో ఉంటున్న వారిని సీఆర్డీఏ అధికారులు అప్రమత్తం చేశారు.

 

ప్రకాశం బ్యారేజీ దగ్గర వదర ప్రవాహం ఎక్కువ కావడంతో అధికారులు నీటిని కిందకు వదిలారు. కరకట్టతో పాటుగా లంక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముందు నుండి అంచనా వేస్తున్నట్లుగానే వరద ప్రవాహం కారణంగా కరకట్టను ఆనుకుని ఉన్న అక్రమ నిర్మాణాలపై ప్రభావం పడింది.

 

సీఎంగా ఉన్న సమయంలో నదికి అభిముఖంగా నివాసం ఉండాలనే కోరికతో చంద్రబాబు ఈ నివాసం ఎంపిక చేసుకున్నారు. ఇప్పుడు చంద్రబాబు నివాసం ఉంటున్న లింగమనేని గెస్ట్ హౌస్ మెట్ల వరకు వరద నీరు చేరింది. అదే విధంగా చంద్రబాబు ఉపయోగించే వాకింగ్ ట్రాక్ పైన వరద నీరు ప్రవహిస్తోంది. అర్ధరాత్రి వరద ప్రవాహాన్ని గుర్తించిన అధికారులు వెంటనే రంగంలోకి దిగారు. ప్రభుత్వానికి సమాచారం ఇచ్చారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు వెంటనే తొమ్మది లారీల ఇసుకను తెప్పించారు. ఇంటి చుట్టూ ఇసుక బస్తాలు వేస్తున్నారు. నివాసంలో ప్రతీ రోజు కనిపించే మాజీ మంత్రి లోకేశ్ కాన్వాయ్.. ప్రైవేట్ వాహనాలు సైతం మంగళగిరికి తరిలించారు. ప్రస్తుతం చంద్రబాబు ఇంట్లో కూలీలు ఉన్నారు. నీరు లోపలకు రాకుండా అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. నదీ భూగర్భంలో ఉన్న నిర్మాణం కావటంతో వరద మరింత ఎక్కువైతే ఇబ్బందులు తప్పవని అధికారులు చెబుతున్నారు. ఇతర నిర్మాణాలనూ అధికారులు పరిశీలిస్తున్నారు. ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచనలు చేస్తున్నారు.

 

కరకట్ట అక్రమ కట్టడాల విషయంలో సీఎం జగన్ చెప్పినట్టే జరిగింది. ప్రజా వేదిక అక్రమ కట్టడం అని దాన్ని కూల్చివేయించారు సీఎం జగన్. అయితే దీనిపై టీడీపీ నేతలు తీవ్ర విమర్శలు చేశారు. ఇదంతా కక్ష సాధింపు చర్య అని ఆరోపించారు. కానీ ఇప్పుడు సీఎం అన్నట్టే జరిగింది. వరద ప్రవాహం వస్తే ఈ అక్రమ నిర్మాణాల కారణంగా ముంపు ఏర్పుడుతుందని సీఎం జగన్ అసెంబ్లీ వేదికగా వివరించారు. జగన్ చెప్పిన విషయాలతో చంద్రబాబు ఏకీభవించినా..తాను అద్దెకు మాత్రమే ఉంటున్నానంటూ సమర్ధించుకొనే ప్రయత్నం చేశారు. ఇప్పుడు కరకట్ట మీద ఉన్న అక్రమ నిర్మాణాల విషయంలో ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది.

 

ప్రస్తుతం చంద్రబాబు హైదరాబాద్ లో ఉన్నారు. చేతికి గాయం కావడంతో విశ్రాంతి కోసం హైదరాబాద్ కి వచ్చారు. చంద్రబాబు కుటుంబ సభ్యులు సైతం కరకట్ట నివాసంలో లేరు. అంటే.. వారంతా ప్రమాదాన్ని ముందుగానే అంచనా వేసి ఇంటి నుంచి వెళ్లిపోయారా అనే చర్చ జరుగుతోంది. తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలతో కరకట్టను ఆనుకుని ఉన్న అక్రమ నిర్మాణాల విషయంలో యజమానులు, ప్రభుత్వం ఏ రకంగా స్పందిస్తుంది.. ఇప్పుడు చంద్రబాబు ఏం చెబుతారు అనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికైనా చంద్రబాబు తన తప్పు తెలుసుకుంటారా? సీఎం జగన్ చెప్పిన దాంతో ఏకీభవిస్తారా? ఆ ఇంటిని వెంటనే ఖాళీ చేస్తారా? కరకట్టను ఆనుకుని ఉన్న నిర్మాణాలను కూల్చేస్తారా? అనేది తెలియాల్సి ఉంది.

 

కృష్ణా నది కరకట్టపై ఉన్న చంద్రబాబు ఇంటిని మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డిని పరిశీలించారు. చంద్రబాబు నివాసానికి వరద ముప్పు రావడంతో ఎమ్మెల్యే అక్కడకి చేరుకున్నారు. నీరు నివాసంలోకి రాకుండా చేసిన రక్షణ ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. వరద నీరు చంద్రబాబు నివాసంలోకి రాకుండా వందలాది స్టోన్ క్రష్, ఇసుక బస్తాల్నిఏర్పాటు చేశారు. ప్రస్తుతానికి నీటి ప్రవాహంతో ఇబ్బంది లేదంటున్నారు భద్రతా సిబ్బంది. వరద మరింత పెరిగితే నీళ్లు లోపలికి వెళ్లే అవకాశం ఉందన్నారు. చంద్రబాబుని కాపాడుకోవాల్సిన బాధ్యత మాపై ఉందని ఎమ్మెల్యే ఆళ్ల అన్నారు. కృష్ణా నదికి భారీ వరద వస్తుందని ముందే గుర్తించి.. కరకట్ట గెస్ట్ హౌస్ నుంచి చంద్రబాబు కుటుంబంతో సహా ముందే హైదరాబాద్ పారిపోయారని ఎమ్మెల్యే ఆళ్ల విమర్శించారు. టీడీపీ ప్రభుత్వంలో సరైన వర్షాలు, వరదలు లేక ఇక్కడి పరిస్థితి ఆ పార్టీ నేతలకు అర్థం కాలేదన్నారు. ఇప్పుడు జరిగిన ప్రమాదంతో భవిష్యత్తులోనైనా చంద్రబాబు గెస్ట్ హౌస్ ని ఖాళీ చేయక తప్పదని ఎమ్మెల్యే ఆళ్ల స్పష్టం చేశారు.

Tags : amaravatichandrababu housedangerfloodillegalkarakattakrishna riverMla alla Ramakrishna reddyys jagan

Also read

Use Facebook to Comment on this PostMenu