07/2/19 12:07 PM

టీడీపీ కార్యకర్తల హత్యలు, వలసలు : చంద్రబాబు కీలక నిర్ణయం

Chandrababu In Jagan Route, Paramarsha Yatra

ఏపీ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయ్యి నెల రోజులే అయ్యింది. అప్పుడే అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్రమైన వివాదం నడుస్తోంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే టీడీపీ కార్యకర్తలపై దాడులు పెరిగాయని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇప్పటివరకు ఆరుగురు కార్యకర్తలను హత్య చేశారని స్వయంగా మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. టీడీపీ కార్యకర్తలపై జరుగుతున్న దాడుల అంశాన్ని చంద్రబాబు సీరియస్ గా తీసుకున్నారు. ఇంకా ఊరుకుంటే లాభం లేదని డిసైడ్ అయిన చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. తాను కూడా సీఎం జగన్ బాటలో పయనించాలని నిర్ణయించారు. నాడు జగన్ ఓదార్పు యాత్ర తరహాలోనే.. నేడు చంద్రబాబు పరామర్శ యాత్రకు శ్రీకారం చుట్టారు.

 

అవును.. త్వరలోనే చంద్రబాబు పరామర్శ యాత్ర చేయనున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక రాజకీయ దాడులు పెరిగిపోయాయని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. జగన్ సీఎం అయ్యాక తమ కార్యకర్తలను హత్య చేస్తున్నారని చెప్పారు. తమ కార్యకర్తలపై 80 భౌతిక దాడులు జరిగాయన్నారు. 54చోట్ల ఆస్తులను ధ్వంసం చేశారని చెప్పారు. ఈ మేరకు డీజీపీకి కూడా ఫిర్యాదు చేశారు.

 

రాజకీయ దాడుల్లో చనిపోయిన కార్యకర్తల కుటుంబాలకు అండగా ఉండాలని టీడీపీ అధినేత చంద్రబాబు నిర్ణయించారు. త్వరలోనే పరామర్శ యాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. దాడుల్లో చనిపోయిన వారి కుటుంబ సభ్యులను చంద్రబాబు స్వయంగా కలుస్తారు. మీకు నేను అండగా ఉంటానని భరోసా ఇస్తారు. అధైర్యపడొద్దని ధైర్యం చెబుతారు. అంతేకాదు.. బాధితుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పార్టీ తరఫున ఆర్థిక సాయం కూడా అందజేయనున్నారు.

 

గుంటూరు పార్టీ ఆఫీస్ లో ముఖ్యనేతలతో సమావేశం అయిన చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు. టీడీపీకి 65 లక్షల మంది కార్యకర్తలున్నారని చెప్పారు. వైసీపీలా తమకు దౌర్జన్యం చేతకాదన్నారు. అధికారం, ప్రతిపక్షం టీడీపీకి కొత్త కాదన్నారు. 37 ఏళ్లపాటు టీడీపీ జెండా మోసిన కార్యకర్తలను కాపాడుకునే బాధ్యత తనదన్నారు. ప్రజల కోసం స్థాపించిన పార్టీ టీడీపీ అన్న బాబు.. టీడీపీ ప్రభుత్వం చేసిన పనులు ప్రజల గుండెల్లో శాశ్వతంగా ఉంటాయన్నారు. ఎన్నికల ఫలితాలు వచ్చాక 40 రోజుల్లోనే మన కార్యకర్తలను కాపాడుకోవాల్సిన పరిస్థితి తలెత్తిందన్నారు.

 

కాగా.. చంద్రబాబు పరామర్శ యాత్ర రాజకీయవర్గాల్లో ఆసక్తికరంగా మారింది. చంద్రబాబు.. సీఎం జగన్ బాటలో పయనిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. వైఎస్ మరణం తట్టుకోలేక చనిపోయిన వారి కుటుంబసభ్యులను పరామర్శించేందుకు జగన్ ఓదార్పు యాత్ర చేశారు. ఓదార్పు యాత్ర ద్వారా తన తండ్రి అభిమానుల కుటుంబాలను జగన్ పలకరించారు. ఉమ్మడి రాష్ట్రమంతా తిరిగారు. నిత్యం జనాల్లోనే ఉన్నారు. దీంతో మాకు అండగా జగన్ ఉన్నాడనే భావన అటు కార్యకర్తల్లో ఇటు జనాల్లో ఏర్పడింది. ఇప్పుడు చంద్రబాబు చేపట్టే పరామర్శ యాత్ర కూడా టీడీపీకి ఆ రకంగానే ఉపయోగపడే అవకాశం ఉందని ఆ పార్టీ నేతలు ఆశిస్తున్నారు.

 

చంద్రబాబు పరామర్శ యాత్ర వెనుక మాస్టర్ ప్లాన్ ఉందని అంటున్నారు. టీడీపీ కార్యకర్తలకు భరోసా ఇవ్వడంతోపాటు.. నాయకులు దూరం కాకుండా పార్టీని కాపాడుకోవడానికి, కొత్త నాయకత్వాన్ని తయారు చేసుకోవడానికి పరామర్శ యాత్ర హెల్ప్ అవుతుందని అంటున్నారు. పైగా..మీడియాలో హైలైట్ కావడం ద్వారా ప్రజల్లో సానుభూతి వస్తుందని లెక్కలు వేస్తున్నారు. దీనికి తోడు.. అధికార పార్టీ కార్యకర్తలను నియంత్రించడానికి కూడా ఈ పరామర్శ యాత్ర ఉపయోగపడుతుందని టీడీపీ నేతలు భావిస్తున్నారు. టీడీపీకి పొలిటికల్ గా మైలేజ్ పెరగడానికి ఈ యాత్ర తోడ్పడుతుందని విశ్వసిస్తున్నారు. టీడీపీ నేతలు చంద్రబాబు పరామర్శ యాత్రపై చాలానే ఆశలు పెట్టుకున్నారు. ఈ యాత్రతో మళ్లీ పార్టీకి పునర్ వైభవం ఖాయమని ఆశిస్తున్నారు. ఎవరి లెక్కలు ఎలా ఉన్నా, ఎవరి వ్యూహాలు ఎలా ఉన్నా.. బాబుగారి పరామర్శ యాత్ర టీడీపీకి ఎంతవరకు వర్కవుట్ అవుతుందో చూడాలి.

Tags : ap cm ys jaganchandrababumurdersodarpu yatraparamarsha yatrapolitical attcksTDPtdp activists

Also read

Use Facebook to Comment on this Post



Menu