10/18/19 12:30 PM

ఇంతలోనే బాబుగారిలో అంత మార్పా

Chandrababu Sensational Comments on Modi

ఏపీ మాజీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. సొంత పార్టీ నేతలను కాదు.. బీజేపీ, వైసీపీ నేతలనూ షాక్ కి గురి చేస్తున్నాయి. చంద్రబాబు మార్పుకి కారణం ఏంటి? ఆయన మనసులో ఏముంది? అసలు చంద్రబాబు వ్యూహం ఏంటి? అని చర్చించుకుంటున్నారు.

 

ఏపీకి తీరని అన్యాయం చేశారని ఆరోపిస్తూ బీజేపీతో చంద్రబాబు తెగదెంపులు చేసుకున్న సంగతి తెలిసిందే. 2014 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేసిన చంద్రబాబు.. 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు.. బీజేపీకి కటీఫ్ చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేదని, విభజన హామీలు నెరవేర్చలేదని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపైన, ప్రధాని మోడీపైనా నిప్పులు చెరిగారు. నమ్మకద్రోహం చేశారని ఆ పార్టీతో రిలేషన్ తెంచుకున్నారు. ఆ తర్వాత ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగారు. కట్ చేస్తే.. టీడీపీకి దిమ్మతిరిగే షాక్ తగిలింది. కేవలం 23 ఎమ్మెల్యే సీట్లు మాత్రమే వచ్చాయి. అదే సమయంలో కేంద్రంలో మరోసారి బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత ఏపీలో జరిగిన పరిణామాలతో టీడీపీ బాగా డల్ అయ్యిపోయింది. పలువురు టీడీపీ కీలక నేతలు బీజేపీ, వైసీపీలో చేరిపోయారు.

 

ఈ పరిస్థితుల్లో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ప్రధాని మోడీతో తనకు వ్యక్తిగతంగా ఎలాంటి విభేదాలు, విరోధం లేదని చంద్రబాబు పదే పదే చెబుతున్నారు. అంతేకాదు.. ఎన్నికలకు ముందు కేంద్రంతో విభేదించి తప్పు చేశామని వాపోతున్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం మాత్రమే కేంద్రంతో పోరాడాను తప్ప.. మోడీతో తనకు ఎలాంటి విభేదాలు, అభిప్రాయభేదాలు లేవని చంద్రబాబు స్పష్టం చేస్తున్నారు. విశాఖలో చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. ఏదో ఫ్లో లో చేసిన మాటలులే అనుకుని అంతా వదిలేశారు. కానీ.. నెల్లూరులోనూ చంద్రబాబు అవే మాటలు రిపీట్ చేశారు. దీంతో టీడీపీ, బీజేపీ నేతల్లో చర్చ మొదలైంది. చంద్రబాబు మరోసారి బీజేపీతో పొత్తు కోసం ప్రయత్నం చేస్తున్నారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

 

ఇంతలోనే ఎంత మార్పు అని అంతా విస్తుపోతున్నారు. 6 నెలల క్రితం సార్వత్రిక ఎన్నికల ముందు బీజేపీ, మోడీలపై చంద్రబాబు, ఆయన పార్టీ నేతలు ఓ రేంజ్ లో నిప్పులు చెరిగారు. మోడీని అరాచకవాదిగా పోల్చారు. పక్క రాష్ట్రాల తిరిగి మోడీని ఓడించాలని చంద్రబాబు ప్రచారం చేశారు. అలాంటి బాబుగారు ఇప్పుడు మళ్లీ మోడీ భజన చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. నాలుగు రోజుల వ్యవధిలో చంద్రబాబు రెండుసార్లు అలా అనడం హాట్ టాపిక్ గా మారింది. మోడీతో ఎలాంటి విభేదాలు లేవంటున్న చంద్రబాబు మాటల్లో ఏదైనా మర్మం ఉందా అనే చర్చ ఏపీలోనే కాదు తెలంగాణలోనూ జరుగుతోంది. చంద్రబాబు అధికారం కోసం ఎంతకైనా దిగజారతారు అనే దానికి ఇదే నిదర్శనం అని వైసీపీ నేతలు అంటున్నారు. బీజేపీతో పొత్తు కోసం చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారని, అందుకే మళ్లీ మోడీ భజన స్టార్ట్ చేశారని చెబుతున్నారు.

 

ఇది ఇలా ఉంటే.. ఏపీ బీజేపీ నేతలు మాత్రం చంద్రబాబు మాటలపై ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు. ఏపీలో టీడీపీతో మరోసారి పొత్తు ప్రసక్తే లేదని తేల్చి చెబుతున్నారు. టీడీపీకి శాశ్వతంగా డోర్లు క్లోజ్ అయ్యాయని అంటున్నారు. టీడీపీతో పొత్తు కారణంగా ఇప్పటికే రెండు సార్లు నష్టపోయామని, ఏపీలో సొంతంగా ఎదగలేకపోయామని కమలనాథులు వాపోయారు. భవిష్యత్తులో టీడీపీతో పొత్తు గురించి ప్రశ్నే లేదన్నారు. టీడీపీ దిక్కూ దివానం లేని పార్టీగా మారిందని, నాయకుడు లేడని.. త్వరలోనే కనుమరుగు అవుతుందని.. ఆ పార్టీ నేతలంతా బీజేపీలో చేరిపోవాలని పిలుపునిచ్చారు. టీడీపీ నాయకత్వంపై ప్రజల్లో నమ్మకం పోయిందన్నారు.

 

బీజేపీ నేతలు అలా అంటుంటే.. టీడీపీ సీనియర్లు మాత్రం మరోలా చెబుతున్నారు. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు అంటున్నారు. భవిష్యత్తులో బీజేపీతో పొత్తు ఉండే అవకాశాలు కొట్టిపారేయలేము అంటున్నారు. ఇకపోతే జగన్ ని ఎదుర్కోవాలంటే.. తన ఒక్కడి వల్ల కాదని చంద్రబాబుకి అర్థమైందని.. అదే సమయంలో మోడీతో వైరం కారణంగా నష్టం తప్ప లాభం ఉండదని గుర్తించారని.. అందుకే ఇలా.. చంద్రబాబు మాట మార్చారని విశ్లేషిస్తున్నారు.

 

బీజేపీకి దగ్గరయ్యేందుకే.. టీడీపీకి చెందిన కీలక నేతలను, తన అనుచరులను చంద్రబాబు బీజేపీలో చేర్పించారనే వాదనలూ ఉన్నాయి. సుజనాచౌదరి, సీఎం రమేశ్.. చంద్రబాబు ఆదేశాలతోనే బీజేపీ కండువా కప్పుకున్నారని చెబుతున్నారు. మోడీకి దగ్గరయ్యేందుకు, జగన్ నుంచి కాపాడుకునేందుకు చంద్రబాబు ఇలా చేశారని వైసీపీ నేతలు చెబుతున్నారు. మొత్తంగా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు భారీ చర్చకే దారితీశాయి. అసలు ఆయన ఉద్దేశ్యంతో ఏంటో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగక తప్పదు.

Tags : ALLIANCEBJPchandrababumodiTDPys jaganysrcp

Also read

Use Facebook to Comment on this PostMenu