01/4/19 11:29 AM

బాబుగారూ.. ఒంటరిగా పోటీ చేసే దమ్ము లేదా?

Chandrababu Wants Pawan Kalyan Support

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడికి ఓటమి భయం పట్టుకుందా? ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసే దమ్ము బాబుకి లేదా? చంద్రబాబు వైఖరి, మాటలు చూస్తుంటే ఈ అనుమానాలే కలుగుతున్నాయి. కొన్ని రోజులుగా చంద్రబాబు నోట పవన్ కళ్యాణ్ మాట తరుచుగా వినిపిస్తోంది. సందర్భం ఏదైనా ఛాన్స్ చిక్కినప్పుడల్లా పవన్ జపం చేస్తున్నారు. పవన్‌తో కలిసి పని చేస్తే జగన్‌కు బాధేంటి? అని ఒకసారి, పవన్ మాతో కలిసి రావాలని మరోసారి చంద్రబాబు అన్నారు. ఇలా జనసేనాని స్నేహం కోసం చంద్రబాబు శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.

 

మరో నాలుగు నెలల్లో ఏపీలో ఎన్నికలు జరగనున్నాయి. ఈసారి జగన్ నుంచి టఫ్ ఫైట్ ఉండబోతుందని చంద్రబాబుకి అర్థమైంది. మరోవైపు జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా భయపెడుతుననారు. ఈ పరిస్థితుల్లో ఒంటరిగా వెళ్లడం ఎందుకు? అని అనుకున్నారో మరో కారణమో కానీ.. సడెన్‌గా చంద్రబాబు పవన్ జపం చేస్తున్నారు. రాష్ట్రం కోసం పవన్ కళ్యాణ్ తమతో కలిసి రావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ముగ్గురు మోదీలు(మోదీ, కేసీఆర్, జగన్) రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నారని.. ఒకరు బీజేపీతో కలిసిపోయారని.. ఇంకొకరు వన్‌సైడ్‌గా పనిచేస్తున్నారని చంద్రబాబు విమర్శించారు. జనసేనాని పవన్ రాష్ట్రం కోసం తమతో కలిసి రావాలంటూ చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ ద్వారా ఏపీకి కేంద్రం నుంచి రూ.72వేల కోట్లు రావాలని పవన్ తేల్చారని చంద్రబాబు గుర్తు చేశారు.

 

ఓపక్క వచ్చే ఎన్నికల్లో తాము వామపక్షాలతో తప్ప మరెవ్వరితోనూ కలిసి వెళ్లేది లేదని జనసేనాని పవన్ కళ్యాణ్ తేల్చి చెప్పారు. ఎవరితోనూ పొత్తులు ఉండవని, 175 స్థానాల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని స్పష్టం చేశారు. పవన్ ఇంత క్లారిటీ ఇచ్చినా చంద్రబాబు మాత్రం పవన్ కలిసి రావాలని కోరడం విశేషం. అసలు చంద్రబాబు ఎందుకిలా పవన్ వెంట పడుతున్నారు? అనేది చర్చనీయాంశంగా మారింది. చంద్రబాబుకి ఓటమి భయం పట్టుకుందా? అనే డిస్కషన్ జరుగుతోంది. బాబుగారికి సింగిల్‌గా పోటీ చేసే దమ్ము లేదా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

 

ఇప్పటివరకు ఏ ఎన్నికల్లో కూడా చంద్రబాబు ఒంటరిగా పోటీ చేసింది లేదు. ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలోకి దిగారు. 2014 ఎన్నికల్లోనూ అంతే. బీజేపీతో పొత్తు పెట్టుకుని బరిలోకి దిగారు. అప్పుడు పవన్ కళ్యాణ్ టీడీపీకి మద్దతుగా ప్రచారం చేశారు. అయితే ఈసారి బీజేపీతో విభేదాల కారణంగా చంద్రబాబు వారితో తెగదెంపులు చేసుకున్నారు. ఇక పవన్ ఏమో సొంతంగా పార్టీ పెట్టుకున్నారు. కాంగ్రెస్‌తో చంద్రబాబు చేతులు కలిపినా.. పెద్దగా వర్కవుట్ అయ్యేలా లేదు. మరోవైపు వైసీపీ అధినేత జగన్ భయపెడుతున్నారు. దీంతో చంద్రబాబుకి ఎక్కడో ఓటమి భయం పట్టుకుందని, ఎందుకైనా మంచిది పవన్‌తో కలిసి వెళ్తే గట్టెక్కవచ్చు అనే అభిప్రాయంతో చంద్రబాబు ఉన్నట్టు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మరి చంద్రబాబు ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి.

Tags : ap electionschandrababuchandrababu ask pawan kalyanjanasenapawan kalyantdp janasena allianceys jagan

Also read

Use Facebook to Comment on this Post



Menu