10/14/19 7:17 PM

దేనికి సంకేతం : సీఎం జగన్ తో చిరంజీవి భేటీ

Chiranjeevi Meets CM Jagan

ఏపీ రాజకీయం మరోసారి ఆసక్తికరంగా మారింది. సినీ, రాజకీయా వర్గాల్లో ఆసక్తి రేపే సంఘటన ఒకటి జరిగింది. ఆయనేమో ఏపీ స్టార్. ఈయనేమో మెగాస్టార్.. ఇద్దరూ కలిశారు. ఇంకేముందు.. అప్పుడే గాసిప్స్ షురూ అయ్యాయి. ఏపీ సీఎం జగన్ ని మెగాస్టార్, పవన్ కళ్యాణ్ అన్నయ్య చిరంజీవి కలిశారు. వీరిద్దరి భేటీ తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. చిరంజీవి సీఎం జగన్ ని ఎందుకు కలిశారు? ఇద్దరూ ఏం మాట్లాడుకున్నారు? జనసేనాని పవన్ కళ్యాణ్ భవిష్యత్తు ఏంటి? అనే ప్రశ్నలు ఆసక్తికరంగా మారాయి.

 

జగన్ సీఎం అయ్యాక ఇప్పటివరకు చిరంజీవి కలవలేదు. దీంతో ఈ భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. సోమవారం భార్య సురేఖతో కలిసి సీఎం జగన్ ఇంటికి వెళ్లారు చిరంజీవి. తాడేపల్లిలో తన నివాసంలో చిరు దంపతులకు ఘనంగా స్వాగతం పలికారు.. జగన్ దంపతులు. సీఎం జగన్, భార్య భారతి చిరంజీవి దంపతులను ఆహ్వానించారు. ఈ భేటీలో ప్రధానంగా జగన్ చిరంజీవి ఏం చర్చించారన్న విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. రాజకీయ వర్గాల్లో ఈ భేటీపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. చిరంజీవి జగన్ ఇంటికి చేరుకోగానే సీఎంకు షాలువా కప్పి ఘనంగా సత్కరించారు. జగన్ సతీమణి భారతికి చీర అందించారు. మరోవైపు జగన్ కూడా చిరంజీవికి వీణను బహుమతిగా ఇచ్చారు.

 

గంట పాటు చిరంజీవి, జగన్ బేటీ జరిగింది. భేటీ తర్వాత చిరంజీవి వెళ్లిపోయారు. ఇటీవలే అక్టోబర్ 2న విడుదలైన చిరంజీవి ‘సైరా’ నరసింహారెడ్డి సినిమా గురించి చర్చ జరిగినట్లు తెలుస్తోంది. లంచ్ సమయంలో సైరా సినిమా గురించి సీఎం జగన్‌కు తెలియని విషయాలను చిరు చర్చించినట్లు తెలుస్తోంది. రెండు మూడు రోజుల్లో సీఎం జగన్ సైరా సినిమాను చూసే అవకాశాలు కూడా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సైరా సినిమా చూసేందుకు జగన్ కూడా అంగీకారం తెలిపినట్లు సమాచారం. విజయవాడలో పీవీపీ మాల్ లో జగన్ సినిమా చూసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

 

సినిమాకు సంబంధించిన అంశాలతో పాటు చిరంజీవి సీఎం జగన్ ను వినోదపు పన్ను మినహాయింపు గురించి కూడా కోరినట్లు తెలుస్తోంది. వినోదపు పన్ను విషయంలో సీఎం జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

 

జగన్ సీఎం అయిన తర్వాత మొదటిసారిగా చిరంజీవి భేటీ కావడంతో రాజకీయ, సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. సైరా సినిమాతో పాటు రాజకీయ అంశాల గురించి కూడా వీరి మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఏపీలోని కాపు నేతలను వైసీపీకి అనుకూలంగా మలుచుకునే విషయంపైనా వీరి భేటీలో చర్చించినట్లు సమాచారం. ఇప్పటికే కాపు సామాజిక వర్గాన్ని వైసీపీకి చేరువగా చేసేందుకు ఆ పార్టీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జగన్, చిరంజీవి భేటీ మరింత ఆసక్తి రేపింది.

 

చిరంజీవి.. సీఎం జగన్ ని కలవడంలో పెద్ద విశేషం ఏముంది అని అనొచ్చు. అయితే.. కొన్నేళ్లుగా చిరంజీవి పూర్తిగా రాజకీయాలను పక్కనపెట్టి.. సినిమాలపైనే ఫోకస్ పెట్టారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు సడెన్ గా సీఎం జగన్‌ని కలవడం.. సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌ అయ్యింది. జగన్ తో మెగాస్టార్ లంచ్ మీట్.. చర్చకు దారితీసింది.
చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించి ఆ తర్వాత పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశారు. అందుకుగాను కాంగ్రెస్ పార్టీ చిరుకి కేంద్ర మంత్రి పదవి ఇచ్చింది. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓడిపోయింది. అప్పటినుంచి చిరంజీవి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లోనూ ఆయన ఏ పార్టీకి అనుకూలంగా పనిచేయలేదు. ఇకపోతే చిరంజీవి తమ్ముడు పవన్‌ కల్యాణ్ మాత్రం జనసేన పార్టీని స్థాపించి రాజకీయాల్లో క్రియాశీలకంగా పనిచేస్తున్న సంగతి తెలిసిందే.

 

జగన్-చిరు భేటీ గురించి అందరికన్నా ఎక్కువ ఆసక్తి జనసేన నేతలు, పవన్ అభిమానులు చూపించారు. జగన్ చిరంజీవి ఏం మాట్లాడుకున్నారు అని ఆరా తీశారు. అయితే కాపులను వైసీపీకి దగ్గర చేస్తానని ఒక వేళ చిరంజీవి కనుక సీఎం జగన్ కి హామీ ఇచ్చి ఉంటే.. మరి తమ్ముడు పవన్ పరిస్థితి ఏంటి అని జనసేన శ్రేణులు టెన్షన్ పడుతున్నాయి. పవన్ రాజకీయ భవిష్యత్తు సంగతి ఏంటని ఆందోళన చెందుతున్నారు. ఒకవేళ చిరంజీవి తన మద్దతు ఇవ్వాలని అనుకుంటే.. సొంత తమ్ముడు పవన్ కే ఇవ్వాలని సూచిస్తున్నారు. అలా కాదని వైసీపీకి సపోర్ట్ చేస్తే మాత్రం ఊరుకునేది లేదన్నారు. మొత్తంగా జగన్-చిరు భేటీ హాట్ టాపిక్ గా మారింది.

Tags : chiranjeevicm jaganKAPUpawan kalyansyeraa naraisimha reddy

Also read

Use Facebook to Comment on this PostMenu